రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్ | Kerala High Court Stays GST on Retired Bankers’ Health Insurance Policies | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్

Oct 27 2025 11:19 AM | Updated on Oct 27 2025 2:47 PM

High Court Interim Relief on GST for Bank Retirees Health Cover

పదవీ విరమణ చేసిన బ్యాంకర్లకు వర్తించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కలిగించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) నిర్వహించే పథకం కింద ఉన్న పాలసీలకు ఈ స్టే వర్తిస్తుంది.

అసలు సమస్యేంటి?

భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం సమగ్రమైన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకాలు సాధారణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఆధ్వర్యంలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి నిర్వహిస్తున్నారు. అయితే ఈ గ్రూప్ పాలసీలకు వర్తించే వస్తు సేవల పన్ను (GST) రిటైర్డ్ బ్యాంకర్లకు ఆర్థిక భారంగా మారిందనే వాదనలున్నాయి. ఈ పాలసీల ప్రీమియం మొత్తాన్ని పదవీ విరమణ చేసిన వారే పూర్తిగా భరిస్తున్నారు కాబట్టి, జీఎస్టీ కారణంగా వచ్చే అదనపు భారం నేరుగా వారిపై పడుతోంది. దీనిపై ఆల్ ఇండియా బ్యాంక్ పెన్షనర్స్ అండ్‌ రిటైర్డ్స్ కాన్ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈక్రమంలో దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ తరుణంలో పదవీ విరమణ చేసిన బ్యాంకర్లను కవర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు స్టే విధించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి పాలసీలను పునరుద్ధరించేటప్పుడు వాటిపై జీఎస్టీని వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ ఆదేశాలను అనుసరించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇప్పటికే సర్క్యులర్‌ను జారీ చేసింది.

పదవీ విరమణ చేసిన బ్యాంకర్లపై ప్రభావం

ఐబీఏ గ్రూప్ పాలసీ పరిధిలో సుమారు 2 లక్షల మంది పదవీ విరమణ చేసిన బ్యాంకర్లు ఉన్నారు. ఈ మొత్తం ప్రీమియంను బ్యాంకులకు బదులుగా రిటైర్డ్ ఉద్యోగులే చెల్లిస్తున్నారు. కాబట్టి జీఎస్టీ వారికి ప్రత్యక్ష భారంగా మారుతోంది. ఈ మధ్యంతర ఉపశమనం శాశ్వతంగా మారి, దేశవ్యాప్తంగా అమలులోకి వస్తే ఇది సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 31, 2025న జరగనుంది.

ఇదీ చదవండి: వడ్డీ ఆదాయంపై పన్ను ఏ మేరకు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement