2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపన్ను నిబంధనల కింద.. ఆదాయపన్ను శ్లాబులు, మూలం వద్దే పన్ను మినహాయింపు (టీడీఎస్) పరిమితుల్లో మార్పులు వచ్చాయి. నేను సీనియర్ సిటిజన్. వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉన్నాను. ఈ మార్పుల ప్రభావం నాపై ఎలా ఉంటుంది? – లక్ష్మీ నర్సింహ. వి
ఆదాయపన్ను కొత్త విధానంలో పన్ను శ్లాబులు, టీడీఎస్ పరిమితుల్లో మార్పులు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది నిజమే. ఇందులో టీడీఎస్ పరిమితి ఒకటి. సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన వారు), నాన్ సీనియర్ సిటిజన్‌కు సంబంధించి టీడీఎస్ పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్దేశిత పరిమితికి మించినప్పుడు మూలం వద్దే 10 శాతం మినహాయిస్తారు. మీరు వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్ ఎఫ్‌డీలు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే గతంలో 10 శాతం టీడీఎస్ (తగ్గించేవారు) మినహాయించేవారు. ఇకపై వీటిపై వడ్డీ ఆదాయం రూ.1,00,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది.
డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్‌ను రూ.10,000 మించినప్పుడే అమలు చేయనున్నారు. టీడీఎస్ మినహాయించారు కదా అని చెప్పి, వడ్డీ ఆదాయంపై పన్ను తప్పించుకోవడం కుదరదు. మీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చినట్టయితే అప్పుడు రిటర్నులు దాఖలు చేసి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో వయసుల వారీ వేర్వేరు శ్లాబుల్లేవు. ఆదాయం రూ.4–8 లక్షల మధ్య ఉంటే 5 శాతం, రూ.8–12 లక్షల మధ్య ఉంటే 10 శాతం, రూ.12–16 లక్షల మధ్య ఉంటే 15 శాతం, రూ.16–20 లక్షల మధ్య ఉంటే 20 శాతం, రూ.20–24 లక్షల మధ్య ఆదాయంపై 25 శాతం, రూ.24 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఉద్యోగులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం ఉంటుంది. మినహాయింపు అనంతరం నికర ఆదాయం రూ.12 లక్షలకు మించనప్పుడు సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. వార్షిక ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినప్పటికీ.. స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై వచ్చే స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సి
ఉంటుంది.
నా మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం ఈక్విటీల్లో ఉన్నాయి. మిగిలిన 30 శాతం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (డెట్) పథకాల్లో ఉన్నాయి. ఈక్విటీ కేటాయింపులు అధికంగా ఉన్నందున, ఇందులో నుంచి 10 శాతాన్ని వెనక్కి తీసుకుని, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్)లలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. పదేళ్ల కాలంలో వీటి నుంచి ఎంత రాబడి ఆశించొచ్చు? – వినీ ఆనంద్
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌ఈఐటీ/రీట్)లు అన్నవి వాణిజ్య అద్దె ఆదాయం వచ్చే ఆస్తులపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటి అద్దె రాబడులు వచ్చే పదేళ్ల కాలంలో మెరుగుపడతాయని అంచనా వేస్తున్నాను. ఇక ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్స్ పట్ల ఎంతో ఆశావహంతో ఉన్నాను. దీర్ఘకాలంలో గొప్ప పనితీరుతో సంపద సృష్టించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా చూస్తే రీట్‌ల కంటే సెన్సెక్స్ విషయంలోనే నేను ఎక్కువ సానుకూలంగా ఉన్నాను.
ఇదీ చదవండి: రిటైర్‌మెంట్ ప్లానింగ్‌లో చేయకూడని తప్పులు


