22..? 24..? ఏది మంచిది? | know the answers of financial questions by experts | Sakshi
Sakshi News home page

22..? 24..? ఏది మంచిది?

Dec 8 2025 9:20 PM | Updated on Dec 8 2025 9:22 PM

know the answers of financial questions by experts

ఫైనాన్షియల్‌ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్‌ మార్కెటు, మ్యూచువల్‌ ఫండ్స్‌.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.

బంగారం

తరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?

ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్‌ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్‌. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.

స్టాక్‌ మార్కెట్లు..

ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి  2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?

ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్‌ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్‌ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్‌ చూడండి. ఫండమెంటల్స్‌ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్‌ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.

రియల్టీ..

నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్‌ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్‌గా ఉండే ప్లాటయితే మంచిదా?

ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్‌గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్‌ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్‌ అయితే రీసేల్‌ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు.  

బ్యాంకింగ్‌..

నేను భవిష్యత్‌ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్‌మెంట్‌ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయటం మంచిదా... మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచివా?  

దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసేటపుడు మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్‌ మార్కెట్‌కు ఉంటుంది. పైపెచ్చు ఆర్‌డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్‌డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.

ఫండ్స్‌...

నేను మ్యూచువల్‌ పండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో 22 మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్‌ ఐతే బెటర్‌?

వాస్తవానికి అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్‌ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

ఇన్సూరెన్స్‌...

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా?  

మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్‌ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్‌ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్‌ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్‌ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తీసుకోవటం సరైనదే.

ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement