ఉద్యోగుల జీవితంలో రిటైర్‌మెంట్ అనేది ఒక మధురమైన, ముఖ్యమైన ఘట్టం. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకొని నచ్చిన పనులను, అలవాట్లను ఆస్వాదించడానికి లభించే విలువైన సమయం. అయితే ఈ కాలాన్ని ఆనందంగా, ఆర్థికపరమైన చింతలు లేకుండా గడపాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. చాలా మంది తమ రిటైర్‌మెంట్ ప్లానింగ్‌లో కొన్ని సాధారణ ఆర్థిక తప్పులు చేస్తారు. ఈ తప్పులు భవిష్యత్తులో వారి జీవితాన్ని కష్టతరం చేయవచ్చు. రిటైర్‌మెంట్ జీవితం గోల్డెన్‌డేస్‌గా మారాలంటే సాధారణంగా చేసే తప్పులను సరి చేసుకోవ్సాలిందే.
త్వరగా ప్రారంభించకపోవడం
రిటైర్‌మెంట్ ప్లానింగ్‌లో చేసే అతిపెద్ద తప్పు.. పదవి విరమణ ప్రణాళికను త్వరగా ప్రారంభించపోవడం. ‘ఇంకా చాలా సమయం ఉంది కదా.. అప్పుడే తొందరేముంది’ అని అనుకుంటూ పొదుపును వాయిదా వేస్తారు. కానీ పెట్టుబడి, రాబడికి సంబంధించి సమయం అనేది అత్యంత శక్తివంతమైన ఆస్తి. చిన్న మొత్తంలో అయినా త్వరగా పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీ ప్రభావం ద్వారా మెరుగైన రాబడి వస్తుంది. ఆలస్యంగా మొదలుపెడితే అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా పెద్ద మొత్తాలను పోగుచేయాల్సి ఉంటుంది.
స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడం
రిటైర్‌మెంట్ తర్వాత ఎలాంటి జీవనశైలిని కొనసాగించాలనుకుంటున్నారు? ఆ జీవనానికి ఎంత డబ్బు అవసరమవుతుంది? అనేదానిపై స్పష్టమైన లక్ష్యం లేకపోవడం మరో పెద్ద తప్పు. ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్యాన్ని అంచనా వేయడం వల్ల అవసరమైన మొత్తం కంటే తక్కువ పొదుపు చేసే ప్రమాదం ఉంది.
ద్రవ్యోల్బణం ప్రభావాన్ని విస్మరించడం
నేడు రూ.50,000 అయ్యే ఖర్చులు 20 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను హరిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని పెట్టుబడి సాధనాలను (ఉదాహరణకు, తక్కువ రాబడిని ఇచ్చే సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు) మాత్రమే ఎంచుకుంటే రిటైర్‌మెంట్ కార్పస్ కొన్నాళ్లకు సరిపోకపోవచ్చు. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని ఇచ్చే పెట్టుబడులు (ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వంటివి) అవసరం.
ఆరోగ్య ఖర్చులను పట్టించుకోకపోవడం
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయి. చాలా మంది రిటైర్‌మెంట్ కార్పస్‌ను లెక్కించేటప్పుడు ఆరోగ్య ఖర్చులను విస్మరిస్తారు. ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులు మీ పొదుపు మొత్తాన్ని క్షణాల్లో ఖర్చు చేస్తాయి. అందుకే రిటైర్‌మెంట్ ప్రణాళికలో భాగంగా సరైన ఆరోగ్య బీమా తీసుకోవడం, వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా అవసరం.
అధిక అప్పులతో రిటైర్‌మెంట్‌లోకి అడుగుపెట్టడం
రిటైర్‌మెంట్ దశలోకి అడుగుపెట్టే సమయానికి గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ అప్పులు వంటివి ఉండటం చాలా ప్రమాదకరం. స్థిరమైన జీతం లేని సమయంలో ఈ రుణాలకు ఈఎంఐలు చెల్లించడం రిటైర్‌మెంట్ నిధిపై ఒత్తిడిని పెంచుతుంది. రిటైర్‌మెంట్‌కు ముందే అన్ని అప్పులనూ తీర్చేయడం ముఖ్యం.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?


