దుమ్ముగూడెం: కొంతకాలంగా పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థిని సక్రమంగా బడికి పంపించాలంటూ అతడి ఇంటి ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న నక్కా మణువరన్ తరచూ పాఠశాలకు డుమ్మా కొడుతున్నాడు.
విద్యార్థిని రెగ్యులర్‌గా పాఠశాలకు పంపించాలంటూ ఉపాధ్యాయులు అతడి తల్లిదండ్రులను పలుమార్లు కోరినా వారి నుంచి స్పందన లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుడు బి.రవి, ఉపాధ్యాయురాలు రుక్మిణి ఇతర విద్యార్థులతో కలిసి మణువరన్ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా చేశారు.
ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ.. పిల్లల విద్యాహక్కు రక్షణ తమ బాధ్యత అని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని అందరినీ చదివించాలని కోరారు. ఈ విషయంలో తల్లిదండ్రులు సహకరించాలని అన్నారు. దీంతో తమ కుమారుడిని సోమవారం నుంచి సక్రమంగా బడికి పంపుతామని తల్లిదండ్రులు చెప్పడంతో ధర్నా విరమించారు.


