Hyderabad: ఫాంహౌసుల్లో అసాంఘిక కార్యకలాపాలు | Hyderabad Farmhouses Becoming Hotspots For Illegal Parties And Vice Activities, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: ఫాంహౌసుల్లో అసాంఘిక కార్యకలాపాలు

Mar 16 2026 9:44 AM | Updated on Mar 16 2026 11:23 AM

Illegal Activities in Farmhouse at Hyderabad

వారాంతపు విడిది కోసమని నిర్మించుకున్న ఫాంహౌస్‌ల్లో చీకటి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. మందు, రేవ్, డ్రగ్స్, 
ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి అపాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడి చేసి గుట్టురట్టు చేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. కొన్ని రకాల సెటిల్‌మెంట్లు, రాజకీయ నేతల రహస్య భేటీలు సైతం ఫాంహౌసుల్లోనే జరుగుతుండటం విశేషం. 

హైదారబాద్‌: నగర శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలామంది ప్రముఖులు ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలంలో 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారు.  

అడ్డగోలు దందాలు... 
ఫాంహౌస్‌ యజమానులు గెట్‌టుగెదర్, ఫ్యామిలీ పార్టీలు, బర్త్‌డేలకు రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. అయితే కొందరు నిర్వాహకులు రేవ్, ముజ్రా పార్టీలు, జూదం, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు.  

ప్రముఖుల ఫాంహౌస్‌ల్లో.. 
నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుండగా ఈగల్‌ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు.  

  • వెలుగుచూస్తున్న వరుస ఘటనలు 
    కొంత కాలం క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 

  • ఏడాదిన్నర క్రితం నజీబ్‌నగర్‌ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. 

  • రెండేళ్ల క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 

  • ఏడాది క్రితం అజీజ్‌నగర్‌ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్టు చేశారు. 

  • పది నెలల క్రితం ఎత్‌బార్‌పల్లిలోని ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వా«దీనం చేసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement