ఎండల ఎఫెక్ట్‌… రైళ్లలో ఏసీ బోగీలకు భారీ డిమాండ్‌ | High Demand For AC Coaches On Vande Bharat Express And Other Trains As Summer Heat Rises, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎండల ఎఫెక్ట్‌… రైళ్లలో ఏసీ బోగీలకు భారీ డిమాండ్‌

Mar 16 2026 9:36 AM | Updated on Mar 16 2026 10:18 AM

ac coaches in high demand amid summer heat

రైళ్లలో నాన్‌ ఏసీ ప్రయాణాలు తగ్గుముఖం 

థర్డ్‌ ఏసీ కోచ్‌లకు పెరిగిన డిమాండ్‌  

స్లీపర్‌ బోగీల స్థానంలో థర్డ్‌ ఏసీలు  

సాక్షి, హైదరాబాద్‌: ఎండలు మండుతుండటంతో రైళ్లలో ఏసీ బోగీలకు డిమాండ్‌ పెరిగింది. సాధారణంగా స్లీపర్‌ బోగీల్లో ప్రయాణం చేసేవారు సైతం ఏసీ ఉంటేనే జర్నీ అనే పరిస్థితి నెలకొంది. ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ కోచ్‌ల కంటే థర్డ్‌క్లాస్‌ ఏసీ బోగీలకు ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. పూర్తిస్థాయి ఏసీ సదుపాయం కలిగిన వందేభారత్‌ రైళ్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. వందశాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. వెయిటింగ్‌లిస్ట్‌ కూడా పెరుగుతోంది. రాజధాని, సూపర్‌ఫాస్ట్‌ వంటి రైళ్లలో  సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ బోగీల్లో కూడా పెద్ద సంఖ్యలో వెయిటింగ్‌ దర్శనమిస్తోంది. వేసవి ప్రారంభంలోనే ప్రయాణికుల డిమాండ్‌ ఇలా ఉంటే పిల్లలకు వేసవి సెలవులు, పెళ్లిళ్లు, పండుగలు తదితర వేడుకల కారణంగా ఏప్రిల్, మే నెలల్లో  డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు  దక్షిణమధ్య రైల్వే  అధికారులు  తెలిపారు.   

థర్డ్‌ ఏసీదే టాప్‌..  
సాధారణ స్లీపర్‌తో పోల్చుకుంటే ఏసీ చార్జీలు రెట్టింపే. హైదరాబాద్‌ నుంచి విశాఖకు స్లీపర్‌ సుమారు రూ.450 వరకు ఉంటుంది. థర్డ్‌ ఏసీలో ఇది రూ.1,190 అయినా సరే కనీసం 12 గంటల ప్రయాణం కావడంతో టికెట్‌ ధర ఎక్కువే అయినా ఏసీనే కోరుకుంటున్నారు. ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్‌షిట్లు అందజేయడం, రెండు వైపులా డోర్‌లు లాక్‌ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత లభించడం కూడా ప్రధాన కారణాలే. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే  సదుపాయం ఉండడంతో ఈ బోగీలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.   

స్లీపర్‌ తగ్గుముఖం.. 
ఏటా ఏసీ బోగీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని  కొంతకాలంగా అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి థర్డ్‌ ఏసీ బోగీలను పెంచారు. గతంలో అన్ని రైళ్లలో 1.5 లక్షల వరకు స్లీపర్‌ బెర్తులు అందుబాటులో ఉండేవి. థర్డ్‌ ఏసీ బెర్తులు పెంచడంతో స్లీపర్‌ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా. వేసవి  తీవ్రతను  దృష్టిలో ఉంచుకొని చాలామంది ఏసీ వైపు మొగ్గుచూపుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, నర్సాపూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ఏసీ ప్రయాణాలకే మొగ్గు చూపుతుండగా, ఉత్తరాదికి  వెళ్లే కొన్ని రైళ్లలో మాత్రం స్లీపర్‌ బోగీలకు ఆదరణ ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement