పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీదే విజయం
బిహార్ ఫలితాలు బెంగాల్‌లోనూ పునరావృతం
‘పరివర్తన్ సంకల్ప సభ’లో తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ అవినీతి, బంధుప్రీతి కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. ఇక్కడ మహా జంగిల్‌రాజ్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
గతంలో బిహార్‌లో ఆటవిక రాజ్యం ఉండేదని, సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు బెంగాల్‌లో కనిపిస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, అదే ఫలితం బెంగాల్‌లోనూ పునరావృతం కాబోతోందని తేల్చిచెప్పారు. బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలోని తాహెర్‌పూర్‌లో శనివారం నిర్వహించిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు.
బెంగాల్ కోటపై జెండా ఎగురవేయబోతున్నామని స్పష్టంచేశారు. మహా జంగిల్‌రాజ్‌ను కచ్చితంగా అంతం చేస్తామని తేల్చిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో బెంగాల్‌లో బీజేపీ విజయానికి ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. గంగా నది బిహార్ నుంచి బెంగాల్‌లోకి ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు.
‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’
‘‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా మాకు అభ్యంతరం లేదు. కానీ, ప్రజలను ఎందుకు వేధిస్తున్నారో, రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలి. అవినీతి, బంధుపీత్రి, బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇక్కడ ప్రగతి ఆగిపోయింది. ప్రజలు కష్టాలు పడుతున్నారు.
కట్ మనీ, కమీషన్ల సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. బెంగాల్ నిజంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే బీజేపీని గెలిపించాలి. మాకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తాం. తృణమూల్ కాంగ్రెస్ అకృత్యాల నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘బతికి ఉండాలంటే బీజేపీ రావాలి’ అనే నినాదం రాష్ట్రంలో మార్మోగిపోతోంది.
అందుకే ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు
చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం సిగ్గుచేటు. వారిని కాపాడేందుకే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)ను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించినవారిని గుర్తిస్తే వచ్చే నష్టమేంటో చెప్పాలి.
బంగ్లాదేశ్‌లో మతపరంగా వేధింపులకు గురై మన దేశంలోకి వచ్చినవారికి సీఏఏ ద్వారా పౌరసత్వం ఇవ్వాలని సంకల్పించాం. దానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. బాధితులను బెదిరించాలని చూస్తోంది’’ అని మోదీ విమర్శించారు. తాహెర్‌పూర్‌లో ప్రధాని మోదీకి బదులుగా బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు రూ.3,200 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు.
పొగమంచు వల్ల హెలికాప్టర్ యూటర్న్
భారీ పొగమంచు కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మోదీ హెలికాప్టర్‌లో కోల్‌కతా నుంచి తాహెర్‌పూర్ చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌పై దిగాల్సి ఉండగా, పొగమంచు వల్ల అది సాధ్యం కాలేదు. దాంతో చేసేది లేక హెలికాప్టర్‌ను మళ్లీ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. మోదీ కోల్‌కతా నుంచే వర్చువల్‌గా ప్రసంగించారు.
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి
తాహెర్‌పూర్‌లో సభ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మోదీ ప్రసంగించే సభకు వెళ్తుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సీల్డా–కృష్ణానగర్ సెక్షన్‌లోని తాహెర్‌పూర్, బడ్కుల్లా రైల్వేస్టేషన్ల మధ్య పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపా రు. కార్యకర్తల మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంతాపం ప్రకటించారు.
కాంగ్రెస్ తప్పులను సరిచేస్తున్నాం..
గౌహతి ఎయిర్‌పోర్టులో నూతన టెరి్మనల్ ప్రారంభించిన మోదీ
గౌహతి: అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలపాటు నిర్లక్ష్యం చేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీ ఎజెండాలో ఈశాన్య రాష్ట్రాలు ఏనాడూ లేవని ఆక్షేపించారు. కాంగ్రెస్ తప్పులను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయన శనివారం అస్సాంలో పర్యటించారు.
రాజధాని గౌహతిలో అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బార్డోలోయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత లోకప్రియ గోపీనాథ్ బార్దోలోయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రూ.4,000 కోట్లతో నిర్మించిన నూతన టెరి్మనల్‌ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అస్సాం అటవీ భూములను ఆక్రమించుకొని రాష్ట్ర గుర్తింపునకు ముప్పుగా మారిన చొరబాటుదారులను కాంగ్రెస్ కాపాడిందని ఆరోపించారు.
చొరబాటుదారులను గుర్తించడానికి ఎన్నికల సంఘం ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే దీని అక్ష్యమన్నారు. కొందరు దేశ ద్రోహులు ఇప్పటికీ చొరబాటుదారులను కాపాడేందుకు ఆరాటపడుతున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అస్సాంను గతంలో తూర్పు పాకిస్తాన్(నేటి బంగ్లాదేశ్)లో విలీనం చేయడానికి కుట్రలు జరిగాయని, కాంగ్రెస్ కూడా ఇందులో భాగస్వామి అని ధ్వజమెత్తారు. ఆ కుట్రను గోపీనాథ్ బార్డోలోయి విజయవంతంగా అడ్డుకున్నారని గుర్తుచేశారు. అస్సాం రాష్ట్రం భారతదేశం నుంచి విడిపోకుండా కాపాడారని కొనియాడారు. ఇండియాకు, ఆసియాన్ దేశాలకు మధ్య అస్సాం అనుసంధానంగా మారిందన్నారు. కీలక రంగాల్లో దేశ అభివృద్ధికి అస్సాం ఒక ఇంజిన్‌గా పనిచేస్తోందని ప్రశంసించారు.
గౌహతిలో మెగా రోడ్ షో
గౌహతిలో మోదీ శనివారం సాయంత్రం 3.8 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రహదారికి ఇరువైపులా నిల్చున్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు. మోదీజీ జిందాబాద్, భారత్ మాతాకీ జై అంటూ జనం నినదించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ షో ముగిసింది. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ బలాన్ని చాటేలా ఈ రోడ్ షో జరిగింది.
బీజేపీ నాయకులతో భేటీ
ప్రధాని మోదీ అస్సాం బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.


