రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగం
51 వేల మందికి నియామక పత్రాలు అందజేత
ఇవి ఉద్యోగాలు కావు.. జాతి నిర్మాణానికి దక్కిన అవకాశాలు
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అందుబాటులో ‘ప్రతిభా సేతు’
రోజ్‌గార్ మేళాల ద్వారా 11 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం
జీఎస్టీ సంస్కరణలు ఉపాధి ఉత్సవ్‌గా మారాయన్న ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనియువతకు సాధికారిత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత విజయమే, దేశం విజయమని ప్రధాని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన 17వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 51 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పండుగ వేళ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ప్రధాని తెలిపారు. ‘పండుగ ఉత్సాహం, ఉద్యోగం పొందిన విజయం.. ఈ రెండూ కలిసి 51 వేల మందికి పైగా యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. ఈ కొత్త ఆరంభం సందర్భంగా వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు’అని మోదీ పేర్కొన్నారు.
నాగరిక్ దేవో భవ మరవద్దు
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీరు పొందినవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావు, ఇవి దేశ నిర్మాణంలో చురుకుగా పాల్గొనేందుకు లభించిన అవకాశాలు. కొత్తగా నియమితులైన మీరంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తారని, భవిష్యత్ భారతం కోసం మెరుగైన వ్యవస్థలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని అన్నారు. ‘నాగరిక్ దేవో భవ’(పౌరుడే దైవం) అనే మంత్రాన్ని ఎప్పటికీ మరవవద్దని, సేవాభావం, అంకితభావంతో పనిచేయాలని ఆయన యువ కర్మయోగులకు సూచించారు.
3.5 కోట్ల మంది లక్ష్యం
‘వికసిత భారత్ నిర్మాణం అనే సంకల్పంతో గత 11 ఏళ్లుగా దేశం ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో యువతదే ప్రధాన పాత్ర’అని ప్రధాని నొక్కి చెప్పారు. యువ సాధికారతకు తమ ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ‘యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో రోజ్‌గార్ మేళాలు శక్తివంతమైన మాధ్యమంగా మారాయి. ఇటీవలి కాలంలో ఈ మేళాల ద్వారానే 11 లక్షలకు పైగా నియామక పత్రాలను జారీ చేశాం’అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ‘పీఎం వికసిత భారత్ రోజ్‌గార్ యోజన’ద్వారా 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి వేదికలు యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు.
ప్రతిభావంతుల కోసం
యువత కోసం చేపట్టిన మరో కీలకమైన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని మోదీ ప్రకటించారు. ‘యూపీఎస్సీ తుది జాబితా వరకు చేరుకుని, ఎంపిక కాని అభ్యర్థులకు ఈ పోర్టల్ అవకాశాలు కల్పిస్తుంది. వారి ప్రతిభ వృథా కాదు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పుడు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈ ప్రతిభావంతుల సేవలను వినియోగించుకుంటున్నాయి. యువత ప్రతిభను ఇలా సద్వినియోగం చేయడం ద్వారా భారత యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది’అని మోదీ అన్నారు.
పండుగ సీజన్‌కు కొత్త ఊపు
జీఎస్టీ సంస్కరణలు పండుగ సీజన్‌కు కొత్త ఊపునిచ్చాయని ప్రధాని అన్నారు. ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్ కారణంగా నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దీంతో డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ ఉత్పత్తిని, సప్లై చెయిన్‌లను వేగవంతం చేసింది. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి పెరిగితే కొత్త ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల, జీఎస్టీ బచత్ ఉత్సవ్.. ‘ఉపాధి ఉత్సవ్’గా కూడా మారుతోంది’అని ప్రధాని విశ్లేషించారు. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా నమోదైన రికార్డు స్థాయి అమ్మకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
విదేశాంగ విధానం.. యువత కోసమే:
‘భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం. ఈ యువశక్తే మన గొప్ప ఆస్తి’అని మోదీ అన్నారు. విదేశాంగ విధానాన్ని కూడా భారతీయ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రూపొందిస్తున్నామన్నారు. యూకే, యూరప్, బ్రెజిల్, సింగపూర్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాలతో ఏఐ, ఫిన్‌టెక్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు యువతకు శిక్షణ, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘కొత్తగా నియమితులైన ఈ యువ కర్మయోగులు ’వికసిత భారత్’సంకల్పాన్ని నెరవేర్చడంలో ముందుండాలి. ఇందుకోసం ‘ఐ–గాట్ కర్మయోగి భారత్ ప్లాట్‌ఫామ్’ద్వారా నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీ ప్రయత్నాల ద్వారానే భారతదేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.


