న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం వందేమాతరంపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతర గీత రచయిత బంకించంద్ర చటర్జీ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ‘బంకిం దా’అని అని పలికారు. దీనిపై బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బంకిం దా కాదు.. బంకిం బాబు అనండి అంటూ సూచించారు.
బంకించంద్ర చటర్జీ పేరు చివర గౌరవ సూచకంగా బాబు అనే మాట చేర్చాలని చెప్పారు. అందుకు మోదీ స్పందింస్తూ... ‘‘బంకిం బాబు అని చెబుతా. మీకు కృతజ్ఞతలు. మీ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నా’’అని బదులిచ్చారు. మిమ్నల్ని దాదా అని సంబోధించవచ్చా? అందుకు మీకేమైనా అభ్యంతరమా? అంటూ సౌగతా రాయ్‌ని సరదాగా ప్రశ్నించారు. దా అంటే బెంగాలీ భాషలో అన్న అని అర్థం. మరింత గౌరవంగా బాబు అని అంటుంటారు.
బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పనిపడతాం
వందేమాతరంపై చర్చను ప్రారంభించడానికి ప్రధాని మోదీ లోక్‌సభలోకి ప్రశిస్తుండగా, అప్పటికే సభలో ఉన్న బీజేపీ ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ‘బిహార్‌లో గెలిచాం.. ఇక బెంగాల్ పని పడతాం’అంటూ నినదించారు. అలాగే వందేమాతరం అంటూ మోదీకి అభివాదం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగబోతున్నాయి.


