
తమిళ స్టార్ ధనుష్ (Dhanush).. ఎలాంటి పాత్రలోనైనా జీవించేయగలడు. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగలడు. అందుకే రెండుసార్లు (ఆడుకాలం, అసురన్ సినిమాలకుగానూ) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడు దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ చేస్తున్నాడు. ఆదిపురుష్ ఫేం ఓం రౌత్ దీనికి దర్శకత్వం వహించనున్నాడు.
కలాం బయోపిక్
ఈ సినిమాకు కలాం: ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా (Kalam: The Missile Man of India Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. మే నెలలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఓం రౌత్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను కలాంను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను. ఆయన పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయన గురించి వెండితెరపై చెప్పినప్పుడు మరెంతో మంది ఇన్‌స్పైర్ అవుతారు.
ధనుష్ ఎందుకంటే?
ధనుష్ అద్భుతమైన యాక్టర్. ఆయనకంటే గొప్ప నటుడు మరొకరు లేరు. కలాం బయోపిక్‌లో నటించేందుకు ధనుష్ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్, టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్‌కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
సినిమా
ధనుష్ విషయానికి వస్తే ఇటీవలే శేఖర్ కమ్ముల 'కుబేర'తో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం అతడి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఓం రౌత్ విషయానికి వస్తే.. బయోపిక్‌తోనే దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. బాలగంగాధర్ తిలక్ బయోపిక్ 'లోకమాన్య: ఏక్ యుగపురుష్' మూవీతో దర్శకుడిగా మారాడు. తానాజీ, ఆదిపురుష్ సినిమాలు తెరకెక్కించాడు.
చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!