
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా వివాదాల్లో నానుతూనే ఉంది. కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల్లో భాగమైన ఆమె.. అనూహ్యంగా వాటినుంచి సైడ్ అయిపోయింది. కారణం తను పెట్టిన కండీషన్లే! 8 గంటల పనిదినాలతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని, తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్‌లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.
భారీ సినిమాలు చేజార్చుకున్న దీపికా
స్టార్ హీరోయిన్ కాబట్టి అన్నింటికీ తలాడించిన నిర్మాతలు 8 గంటల పనిదినాల దగ్గర మాత్రం ఒప్పుకోవడానికి నిరాకరించారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ రూల్ పని చేయదు. అది పాటిస్తే బడ్జెట్ చేయిదాటిపోతుందన్నది వారి వాదన! అందుకే ఆమె చేతినుంచి సినిమాలు చేజారుతున్నాయి. తాజాగా తొలిసారి దీపికా పదుకొణె మీడియా ముందు ఈ వివాదంపై పెదవి విప్పింది.
స్టార్ హీరోలు 8 గంటలే..
ఆమె మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది సూపర్‌స్టార్స్, టాప్ హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేమీ సీక్రెట్ కాదు. అయినా ఎప్పుడూ ఈ విషయం వార్తల్లోకెక్కలేదు. వాళ్ల పేర్లు నేను చెప్పను. ఇప్పుడుకానీ వాళ్ల పేర్లు ప్రస్తావిస్తే విషయం పెంటపెంట అవుతుంది. అందుకే ఆ హీరోల గురించి చెప్పాలనుకోవడం లేదు. చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తారు, వీకెండ్‌లో సెలవు తీసుకుంటారు.
నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా..
ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కొందరు హీరోయిన్లు కూడా 8 గంటలే వర్క్ చేయడం ప్రారంభించారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ మూవీలో మొదట దీపికను అనుకున్నారు. కానీ, సడన్‌గా తన స్థానంలోకి త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటించిన విషయం తెలిసిందే! ఈ మూవీ సీక్వెల్‌లో నిబద్ధతతో పనిచేసేవారు అవసరమంటూ దీపికను తప్పించారు.
చదవండి: ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు