సిల్వర్‌ స్క్రీన్‌ పై రియల్‌ హీరోస్‌ | Upcoming Movies of From patrioticm updetes | Sakshi
Sakshi News home page

సిల్వర్‌ స్క్రీన్‌ పై రియల్‌ హీరోస్‌

Aug 15 2025 4:27 AM | Updated on Aug 15 2025 4:27 AM

Upcoming Movies of  From patrioticm updetes

దేశం కోసం అమరులైన వీరులు ఎందరో ఉన్నారు. అందరి కథలు వెండితెరపైకి రాక పోవచ్చు. అయితే దేశభక్తిని చాటి చెప్పే, దేశభక్తి స్ఫూర్తిని నింపే సినిమాలు ఎప్పటికప్పుడు వెండితెరపైకి వస్తూనే ఉంటాయి... ప్రేక్షకుల్లో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందిస్తున్నాయి. కొందరు ‘రియల్‌ హీరోస్‌’ గాథలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని చిత్రాల గురించి... 

యుద్ధానికి కొత్త నిర్వచనం
‘సీతారామం’ సినిమాలో దేశభక్తి, ప్రేమ అంశాలను మిళితం చేసి, వెండితెరపై ప్రేక్షకులకు నచ్చేలా చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’  (ప్రచారంలో ఉన్న టైటిల్‌). భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరిగే ఆ రోజుల్లో యుద్ధానికి కొత్త నిర్వచనం చెప్పే ఓ యోధుడి పాత్రగా ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్‌ ఉంటుందని యూనిట్‌ పేర్కొంది.

అలాగే స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఆజాద్‌ హిందూ ఫౌజ్, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని టాక్‌. కొన్ని చారిత్రక అంశాలతో ముడిపడిన కల్పిత కథతో కూడిన ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావొచ్చు.  

బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌ 
దేశభక్తిని చాటి చెప్పే ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు సల్మాన్‌ ఖాన్‌. 2020లో గాల్వాన్‌ లోయలో ఇండియా–చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త ఘర్షణల నేపథ్యంలో ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనే సల్మాన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇందుకోసం ఈ హీరో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సల్మాన్‌ ఖాన్‌ ఈ దేశభక్తి సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ΄్లాన్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. 

మేజర్‌ షైతాన్‌ సింగ్‌ 
మేజర్‌ షైతాన్‌ సింగ్‌ భాటి జీవితం ఆధారంగా రూపొందిన పీరియాడికల్‌ వార్‌ డ్రామా ‘120 బహదూర్‌’. ఈ హిందీ చిత్రంలో సిల్వర్‌ స్క్రీన్‌పై షైతాన్‌ సింగ్‌గా ఫర్హాన్‌ అక్తర్‌ నటిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌. రజనీష్‌ ఘాయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1962లో జరిగిన ఇండియా–చైనా  వార్‌లో ప్రధానంగా చెప్పుకునే ‘రెజాంగ్‌ లా’ యుద్ధం సంఘటనలు ప్రధాన ఇతివృత్తంతో ‘120 బహదూర్‌’ సినిమా రూపొందుతోంది. దాదాపు 3 వేలమంది చైనా సైనికులను ఎదుర్కొని, 120 మంది భారతీయ సైనికులు ఎలా వీరోచితంగాపోరాడారు? అనే నేపథ్యంలో ‘120 బహదూర్‌’ సినిమా ఉంటుంది. ఈ చిత్రం ఈ నవంబరు 21న విడుదల కానుంది. 

రాజ్‌పాల్‌ పునియా 
యునైటెడ్‌ నేషన్స్‌ పీస్‌ కీపింగ్‌ మిషన్‌లో భాగంగా వెస్ట్‌ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్స్‌ ట్రాప్‌లో చిక్కుకున్నారు. దాదాపు 70 రోజులు ఎన్నో ఇబ్బందులు అనుభవించిన ఈ సైనికులను రెస్క్యూ చేసే ఆపరేషన్‌ను రాజ్‌పాల్‌ పునియా సక్సెస్‌ఫుల్‌గా లీడ్‌ చేశారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటల నేపథ్యంలో ‘ఆపరేషన్‌ ఖుక్రీ’ సినిమా రానుంది. ఈ చిత్రంలో రాజ్‌పాల్‌ పునియాగా రణ్‌దీప్‌ హుడా నటిస్తారు. ఆపరేషన్‌ ఖుక్రీ: ది ట్రూ స్టోరీ బిహైండ్‌ ది ఇండియన్‌ ఆర్మీస్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ మిషన్‌ యాజ్‌ పార్ట్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్స్‌’ బుక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ బుక్‌ హక్కులను రణ్‌దీప్‌ హుడా ఫిల్మ్స్, రాహుల్‌ మిత్రా ఫిల్మ్స్‌ దక్కించుకున్నాయి. 

బోర్డర్‌లో వార్‌  
భారతీయ సైనికుల వీరత్వం, వీరోచితపోరాటం నేపథ్యంలో రూపొందుతున్న తాజా హిందీ చిత్రం ‘బోర్డర్‌ 2’. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ లీడ్‌ రోల్‌ చేయగా, వరుణ్‌ ధావన్, అహన్‌ శెట్టి, దిల్జీత్‌ సింగ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, వరుణ్‌ ధావన్, అహాన్‌ శెట్టి భారత సైనికుల పాత్రల్లో నటించారు. ఈ వార్‌ డ్రామా వచ్చే ఏడాది జనవరి 23న విడుదల కానుంది. ఇక 1971లో ఇండియా – పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ‘బోర్డర్‌’ (1977) సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ చిత్రం తెరకెక్కిందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. 

గూఢచారి 
అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న స్పై డ్రామా ‘జీ2’ (గూఢచారి 2). వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలోని ఈ చిత్రంలో వామికా గబ్బి, ఇమ్రాన్‌ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ  యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో చేస్తున్నారు. అడివి శేష్, వామిక ప్రధాన స్పై పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్‌ సుంకర, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. అడివి శేష్‌ హీరోగా 2018లో విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.  

ది ఇండియా హౌస్‌ 
దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1905లో లండన్‌లో ఉన్న కొందరు భారత మేథావులు ఎలా సమావేశం అయ్యారు? భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే కార్యాచరణకు ఎలాంటి వ్యూహాలు రచించారు? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్‌’ రూపొందుతోందని సమాచారం. అలాగే వీర్‌ సవార్కర్‌ జీవితంలోని కొన్ని సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి. నిఖిల్‌ హీరోగా, సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా అనుపమ్‌ ఖేర్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇక్కీస్‌ 
పరమ వీర పురస్కారగ్రహీత అరుణ్‌ ఖేత్రపాల్‌ జీవితం ఆధారంగా హిందీలో ‘ఇక్కీస్‌’ అనే దేశభక్తి చిత్రం రానుంది. 1971లో జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధంలో వీరోచితంగాపోరాడి, అమరుడైన అరుణ్‌ ఖేత్రపాల్‌గా అగస్త్య నంద (అమితాబ్‌బచ్చన్‌ మనవడు) నటిస్తున్నారు. ధర్మేంద్ర, జైదీప్‌ అహ్లావత్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. 

ఇలా దేశభక్తి నేపథ్యంలో సాగే మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement