మల్టీస్టారర్‌ చేసేద్దాం మిత్రమా... | senior actors upcoming multistarrer movies updates | Sakshi
Sakshi News home page

మల్టీస్టారర్‌ చేసేద్దాం మిత్రమా...

Sep 28 2025 12:16 AM | Updated on Sep 28 2025 12:16 AM

senior actors upcoming multistarrer movies updates

ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్‌ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్‌ హీరో, ఓ రైజింగ్‌ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్‌ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్‌ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి మల్టీస్టారర్‌ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌తో రాణించిన తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని, ఇద్దరు సీనియర్‌ హీరోలు మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్‌ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది. ‘మల్టీస్టారర్‌ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్‌ హీరోలు చేస్తున్న మూవీస్‌పై ఓ లుక్‌ వేయండి.

46 సంవత్సరాల తర్వాత... 
కెరీర్‌ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్‌. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్‌ అద్భుత విళక్కుమ్‌’ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్‌ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్‌తో మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్‌హాసన్‌ చె΄్పారు.

ఇలా కమల్‌ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్‌హాసన్‌తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌–కమల్‌హాసన్‌ ప్రోడక్షన్‌ హౌస్‌ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్‌హాసన్‌ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో ఊపందుకుంది.

కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్‌తో ‘విక్రమ్‌’ వంటి హిట్‌ మూవీ తీశారు లోకేశ్‌. అలాగే రజనీకాంత్‌కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్‌. దీంతో కమల్‌–రజనీకాంత్‌ కాంబినేషన్‌ సినిమాకి లోకేశ్‌ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్‌ ప్లే కుదిరితేనే లోకేశ్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్‌–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్‌ అవుతున్నారట.

తాజాగా ప్రదీప్‌ రంగనాథన్‌ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్‌ అందుకున్న ప్రదీప్‌ రంగనాథ్‌ ఆ తర్వాత ‘లవ్‌ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్‌ అయ్యారు. రజనీకాంత్‌–కమల్‌హాసన్‌ కాంబినేషన్‌కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్‌గా 46 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌–రజనీకాంత్‌ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్‌ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

పండక్కి వస్తున్నారు 
సిల్వర్‌స్క్రీన్‌పై ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, వెంకటేశ్‌ కనిపిస్తే తెలుగు ఆడియన్స్‌కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో వెంకటేశ్‌ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్‌ కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్‌. అలాగే చిరంజీవి–వెంకటేశ్‌–నయనతార– కేథరీన్‌ల కాంబినేషన్‌లో ఓ సెలబ్రేషన్‌ సాంగ్‌ను కూడా ప్లాన్‌ చేశారట అనిల్‌ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మరో మల్టీస్టారర్‌! 
మల్టీస్టారర్‌ మూవీస్‌ చేయడంలో సీనియర్‌ హీరో వెంకటేశ్‌ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్‌ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్‌లో మల్టీస్టారర్‌ మూవీస్‌ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా వెంకటేశ్‌ మరో మల్టీస్టారర్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్‌ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్‌ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ కాదు. దీంతో వెంకటేశ్‌ చేయనున్న లేటెస్ట్‌ మల్టీస్టారర్‌లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పేట్రియాటిక్‌ మూవీలో...
మలయాళ స్టార్‌ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్‌ నారాయణ్‌ దర్శకత్వంలోని ‘పేట్రియాట్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా తెలిసింది.

ఫాహద్‌ ఫాజిల్, కుంచాకో బోబన్‌ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య  పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్‌ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్‌ బైజాన్, యూకే, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల లోకేషన్స్‌లో చిత్రీకరణను ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌! 
షారుక్‌ ఖాన్‌ హీరోగా చేసిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘పఠాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘టైగర్‌ 3’ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్‌ ఖాన్‌–షారుక్‌ ఖాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించినప్పుడు ఆడియన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ  కలిసి లీడ్‌ రోల్స్‌లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్‌ అర్జున్‌’ సినిమా తర్వాత సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌లు కలిసి లీడ్‌ రోల్స్‌లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్‌ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్‌ జరుగుతోందని బాలీవుడ్‌ సమాచారం.

‘పఠాన్‌’, ‘టైగర్‌ 3’... ఈ రెండూ వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ అనే సినిమా రానుందని, యశ్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్‌. ‘పఠాన్, వార్‌’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది.

అలాగే ‘వార్‌’ సినిమా కూడా వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో భాగమే కనుక హృతిక్‌ రోషన్‌ కూడా ఈ ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చని బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్‌ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

17ఏళ్ల తర్వాత... 
బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌ల కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో ‘హైవాన్‌’ అనే మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్‌ సినిమాకు ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెంకట్‌ కె. నారాయణ, శైలాజా దేశాయ్‌ ఫెన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్‌లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్‌. తాజా షూటింగ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్‌ వినిపిస్తోంది.

ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్‌కు మోహన్‌లాల్‌తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్‌’లో మోహన్‌లాల్‌ ఓ గెస్ట్‌ రోల్‌ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్‌లాల్‌నే ఎందుకు గెస్ట్‌ రోల్‌కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్‌గా ‘హైవాన్‌’ సినిమా తెరకెక్కుతోందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్‌’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్‌ అలీఖాన్, అక్షయ్‌ కుమార్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్‌’యే కావడం విశేషం. 

ముగ్గురు డాన్‌లు 
బాలీవుడ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ డాన్స్‌ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ‘డాన్‌ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌  స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్‌’ సినిమాలో నటించిన అమితాబ్‌ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్‌ 2’ చిత్రాల్లో నటించిన షారుక్‌ ఖాన్‌ సైతం ‘డాన్‌ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్‌ అక్తర్‌ ప్లాన్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌.

మరి... రణ్‌వీర్‌ సింగ్, షారుక్‌ ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌లు కలిసి ఒకే ఫ్రేమ్‌లో హిందీ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్‌కి ఏముంటుంది. ఇక ‘డాన్‌ 3’లో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్‌గా విజయ్‌ దేవరకొండ, విక్రాంత్‌ మెస్సే, అర్జున్‌ దాస్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ‘డాన్‌ 3’ చిత్రంలో ఎవరు విలన్‌గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్‌ 3’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే చాన్సెస్‌ కనిపిస్తున్నాయి.

కథే హీరో 
కన్నడ స్టార్‌ హీరోలు శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్‌.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేసిన అర్జున్‌ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్‌ రెడ్డి, ఉమా రమేశ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.

సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్‌ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్‌కుమార్‌ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్‌ కావడం ఇదే అని టాక్‌. కొంత గ్యాప్‌ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్‌ సినిమాలు చేసే సీనియర్‌ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement