హిట్ కాంబోకు శ్రీకారం పడనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది కోలీవుడ్ వర్గాల నుంచి. నటుడు విశాల్, దర్శకుడు సుందర్.సిలది హింట్ కాంబో అనే చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆంబళ అనే చిత్రం తెరకెక్కించి మంచి కమర్షియల్ హిట్ సాధించింది. అదే విధంగా అంతకు ముందు రూపొందిన మదగజరాజా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ హిట్ కాంబో హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మకుటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విశాల్ తదుపరి సుందర్.సి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం.
అదే విధంగా ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సుందర్.సీ తదిపరి రజనీకాంత్ హీరోగా కమలహాసన్ నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది.అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి సుందర్.సీ వైదొలిగారు. దీంతో తదిపరి ఆయన విశాల్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని సుందర్.సీ సొంత నిర్మాణ సంస్థ అవనీ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి సుందర్.సీ ఆస్థాన సంగీతదర్శకుడు హిప్‌హాప్ ఆది సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది.

ఇకపోతే సుందర్.సీ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. అదే సమయంలో గ్లామర్ సన్నివేశాలకు కొదవ ఉండదు. ఇంతకు ముందు ఆంబళ చిత్రంలో విశాల్‌కు జంటగా హన్సిక నటించారు. మదగజరాజా చిత్రంలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించారు. ఈ సారి నటి కయాదు లోహర్‌ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. డ్రాగన్ చిత్రంతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటిస్తున్నారు. అదే సమయంలో తమిళంలోనూ అవకాశాలను అందుకుంటున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఇమ్మోర్టల్ చిత్రం చేస్తున్న కయాదు లోహర్ ఇప్పుడు విశాల్‌తో జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.


