
హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ, విలన్ ఎంట్రీ, నాలుగు ఫైట్లు, డ్యుయెట్లు.. శుభం పలికే క్లైమాక్స్.. దాదాపు అన్ని సినిమాల్లో ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమాలో ఇవేవీ ఉండవు. అయినా ఎంతోమందిని ఈ చిత్రం కదిలించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చూసి నవ్వుతూనే ఏడ్చేశారు. అందుకే హీరోయిన్ అదితి బాలన్, దర్శకుడు అరుణ్ ప్రభును ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసులు బహుకరించారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సినిమా అద్భుతమని, చివరి పావుగంట నమ్మలేకుండా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ సినిమా పేరు అరువి. 2017లో వచ్చిన ఈ తమిళ చిత్రం రూ.1 కోటితో తెరకెక్కి రూ.35 కోట్లకు పైగా వసూలు చేసింది. దర్శకుడు అరుణ్ ప్రభుకు, హీరోయిన్‌గా అదితి బాలన్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఏముందో చూద్దాం..
కథ
ఏ అమ్మాయికైనా తండ్రంటే పంచ ప్రాణాలు. తల్లి కోప్పడినా తండ్రి మాత్రం గారాబం చేస్తుంటాడు. అరువి అనే అమ్మాయి కూడా తండ్రి చేతిలో అల్లారుముద్దుగా పెరిగింది. కానీ ఓ యాక్సిడెంట్ వల్ల తన జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. తనకో సమస్య ఉందని ఇంట్లోవాళ్లే ఆమెను ఛీ కొడతారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా ఎవరూ లెక్కచేయరు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. కన్నీళ్లతో ఇంటినుంచి బయటకు వస్తుంది. (Aruvi Movie Review)
హృదయ విదారక కథ
కానీ, ఆ కన్నీళ్లను చూసి సమాజం జాలిపడదు సరికదా! దాన్నే అలుసుగా తీసుకుంటుంది. అలా ముగ్గురు మగవారి చేతిలో మోసపోతుంది. ఎమిలీ అనే ట్రాన్స్‌జెండర్ స్నేహితురాలితో కలిసి ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్‌లో వెల్లడిస్తుంది. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తిరుగుతుంది. అసలు అరువి జీవితాన్ని తలకిందులు చేసిన సమస్య ఏంటి? కంటిరెప్పలా చూసుకున్న కన్నతండ్రే ఆమెను ఎందుకు గెంటేశాడు? చావు తథ్యమని తెలిసి ఆమె ఏం చేసింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో అరువి చూడాల్సిందే!
క్లైమాక్స్‌లో ఏడ్చేస్తారు
సినిమా ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఒక్క సంఘటన తర్వాత కథ ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. చేయని తప్పుకు అరువి జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. ఎవరూ తనను నమ్మకపోవడమనేది ఆమెను మానసికంగా చిత్రవధ చేస్తుంది. సినిమా చివర్లో హీరోయిన్ మాట్లాడే మాటలు కంటతడి పెట్టిస్తాయి. ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడండి!