
తానెన్నడూ భయపడిందే లేదంటోంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). కష్టతరమైన మార్గంలోనూ దర్జాగా నడిచానని, ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ (IMDB) 25 ఏళ్ల భారతీయ సినిమా (2000-2025) అంటూ 130 అత్యుత్తమ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. అందులో 10 చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించడం విశేషం.

కష్టాలదారిలోనే నడిచా..
ఈ అరుదైన ఘనత అందుకోవడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రెండు పెద్ద సినిమాలైన స్పిరిట్, కల్కి 2లు చేజారడంపైనా పరోక్షంగా కామెంట్లు చేసింది. ఈ మేరకు తన జర్నీ గురించి దీపిక మాట్లాడుతూ.. నటిగా ప్రయాణం ప్రారంభించిన కొత్తలో నేనెలా ఉండాలి? ఏం చేస్తే సక్సెస్ అవుతానని నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే నేను ముక్కుసూటిగా ఉన్నాను. ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించేందుకు వెనకడుగు వేయలేదు. కష్టాలదారిలోనే కొనసాగాను, నాకెదురైన పరిస్థితులను సవాల్ చేస్తూ ముందడుగు వేశాను తప్ప ఎక్కడా తలవంచలేదు.
నా తర్వాత వచ్చేవారికోసం..
నా కుటుంబసభ్యులు, అభిమానులు నాపై ఉంచిన నమ్మకమే నేను తీసుకునే బలమైన నిర్ణయాలకు కారణం. నా తర్వాత వచ్చేవారు అనుసరించే మార్గాన్ని నేను శాశ్వతంగా మారుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. బహుశా 8 గంటల షిఫ్ట్ గురించే ఆమె పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో కలిసి కింగ్ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.