సాక్షి,జగిత్యాల: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పరిధిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ అభ్యర్థుల మధ్య పంచాయతీ ముదిరి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో.. పోలీసు సిబ్బందికీ గాయాలు కావడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.
పైడిపల్లి గ్రామం బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల మంగ 32 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి జక్కుల మమత సంతకం చేసి కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటికే బీజేపీ శ్రేణులు మళ్లీ అక్కడకు చేరుకుని.. ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగాయి. ప్రతిగా బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు, అధికారులు గాయపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కానీ ఉద్రిక్తతలు మరింత పెరగడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు.
ఆందోళనకారులు ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు పలువురిపై కేసులు నమోదు చేశారు. పైడిపల్లిలో భయాందోళన వాతావరణం నెలకొనడంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కొనసాగిస్తున్నారు. మరోవైపు.. కట్టుదిట్టమైన పోలీస్ పహారాలో బ్యాలెట్ బాక్సులను తరలించారు.


