క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కు చెదరలేదనే భావన
స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టే యోచన
ప్రభుత్వ వైఫల్యాలపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి ఊపిరి పోశాయని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో చేదు ఫలితాలను చవి చూసిన పార్టీలో.. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయని అంటున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫలితాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. గ్రామాల్లో తమ పట్టు చెక్కు చెదరలేదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కనీసం 40 శాతం సర్పంచ్ పదవులు పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నట్లు బీఆర్‌ఎస్ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.
కేడర్ చెక్కు చెదరలేదు!
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను స్థానికంగా సమన్వయం చేసుకుని పట్టుదలతో పనిచేయడం వల్లే అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చామనే అభిప్రాయం బీఆర్‌ఎస్ నాయకత్వంలో వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, పట్టుదల నాయకత్వానికి స్ఫూర్తినిచ్చేలా ఉందనే అభిప్రాయం పైస్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లోపం, గ్రూపు తగాదాలు, పాలన వైఫల్యం, పల్లెల్లో అభివృద్ధి కుంటుపడటం కూడా తమకు కలిసి వచ్చాయని గులాబీ దళం విశ్లేషిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్ లాంటి చోట్ల మినహా ఎక్కడా పెద్దగా బీజేపీ ప్రభావం కనిపించలేదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు..ఆ పార్టీ బలపడిందనడానికి నిదర్శనం కాదని తేలిపోయిందని బీఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
నూతనోత్సాహంతో ముందుకు..
పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల దిశగా సన్నద్ధం చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయడం, సభ్యత్వ నమోదు, శిక్షణ కార్యక్రమాల సంబంధిత షెడ్యూల్‌ను పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 21న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించే అవకాశముంది.
అలాగే భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీకి అధికార కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై మరింత దూకుడుగా వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పోరాటాలకు కార్యాచరణపై గట్టిగా దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
ఇదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను విశ్లేషించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలహీనతలపైనా పోస్ట్‌మార్టమ్ చేయాలని భావిస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఇతర పార్టీల్లోకి నేతల వలసలు, ఫిరాయింపులతో బలహీన పడిన నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.


