ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ..
కొత్త డిస్కం పరిధిలోకి 29 లక్షల విద్యుత్ కనెక్షన్లు
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్న సర్కార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలను ఈ డిస్కం పరిధిలోకి తెస్తారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడు దల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 15 జిల్లాలకు, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 18 జిల్లా లకు సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం వీటి పరిధిలో ఉన్న వ్యవ సాయ, లిఫ్ట్ ఇరిగేషన్ ఇతర తాగునీటి పథకాలకు చెందిన 29, 08,138 విద్యుత్ కనెక్షన్లను కొత్తగా ఏర్పడే డిస్కం పరిధిలోకి తెస్తారు. అయితే ప్రస్తుతం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న కనెక్షన్లను కొత్త డిస్కంకు బదలాయించలేదు. ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న కనెక్షన్లను మాత్రమే మూడో డిస్కంకు కేటాయించారు.
రెండు డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ సిబ్బందిని విభజించి కొత్త డిస్కంకు కేటాయిస్తారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అప్పులను కొత్తగా ఏర్పడే డిస్కంకు విద్యుత్ కనెక్షన్ల నిష్పత్తిలో బదలాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉచిత విద్యుత్ పథకా లను సమర్థంగా నిర్వహించడం, నాణ్యమైన విద్యుత్ అందించడమే కొత్త డిస్కం ఏర్పాటు లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
ఉచితాలన్నీ ఇందులోకే...
ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలో ఉన్న ఉచిత పథకాలు ఇక నుంచి కొత్త డిస్కం పరిధిలోకి రానున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, మున్సిపల్ వాటర్ సప్లైకి సంబంధించిన కనెక్షన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విద్యుత్ కనెక్షన్లు కొత్త డిస్కంకు బదలాయిస్తారు. రెండు డిస్కంల పరిధిలోని 5,22,479 వ్యవసాయ విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లపై మూడో డిస్కంకు పూర్తి అధికారాలు ఉంటాయి.
ఆపరేషన్, మెయింటెనెన్స్ మొత్తం మూడో డిస్కం పరిశీలిస్తుంది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో), కేంద్ర విద్యుత్ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ సంస్థలతోపాటు పలు రకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ప్రస్తుతం ఎస్పీడీసీఎల్‌కు 70.55 శాతం, ఎన్పీడీసీఎల్‌కు 29.45 శాతం ఉన్నాయి. స్థానిక అవసరాలు, ఐదేళ్ల విద్యుత్ వినియోగ సగటు ఆధారంగా పీపీఏలను మూడో డిస్కం పరిధిలోకి తెస్తారు.
రెండు డిస్కంల పరిధిలోని 2 వేల మంది సిబ్బందిని మూడో డిస్కంకు కేటాయిస్తారు. ఇందులో 660 మంది ఇంజనీర్లు, 1,000 మంది ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది, 340 మంది పాలనాపరమైన సిబ్బంది ఉంటారు.
రూ. 35 వేల కోట్ల అప్పు బదలాయింపు
ప్రస్తుతం ఉన్న డిస్కంల పరిధిలోని అప్పులో కొంత భాగాన్ని కొత్త డిస్కంకు బదలాయిస్తున్నారు. ప్రస్తుతం రెండు డిస్కంలకు రూ.45,398 కోట్ల మేర అప్పులున్నాయి. వీటిల్లో రూ.35,982 కోట్ల అప్పు మూడో డిస్కంకు వెళుతుంది. ఉచిత పథకాలకు సంబంధించిన అప్పునే మూడో డిస్కంకు బదలాయించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఉచిత పథకాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ఇక నుంచి మూడో డిస్కంకు వెళుతుంది. అయితే, నిర్వహణ, పెట్టుబడి వ్యయానికి మూడో డిస్కం అప్పు చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉచిత పథకాలన్నీ మూడో డిస్కంకు బదలాయించడంతో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలు లాభాల్లోకి వెళ్లే వీలుందని అధికారులు తెలిపారు.


