Electricity distribution companies
-
అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా దిశగా..
సాక్షిప్రతినిధి, వరంగల్: సాంకేతిక సమస్యలను క్షణాల్లో అధిగమించి..నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చేపట్టిన విద్యుత్ ఫీడర్లు, సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాల నంబర్లు, మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక రంగులతో నంబర్లు వేస్తున్నారు. 33 కేవీ స్తంభానికి పసుపు రంగు, 11 కేవీ స్తంభానికి నలుపు రంగుతో ఈ నంబర్లు ఇస్తున్నారు. ఇది పూర్తయ్యాక జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియ జూన్‌లో ప్రారంభిస్తామని ఆ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఐదు లక్షలకు పైగా విద్యుత్‌స్తంభాలకు జియో ట్యాగింగ్ పూర్తి దశకు చేరినట్టు అధికారవర్గాల సమాచారం. స్తంభాలకు ఇస్తున్న నంబరింగ్ పూర్తయ్యాక జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేస్తారు. జియో ట్యాగింగ్‌తో ఇవీ ప్రయోజనాలు విద్యుత్ ఉత్పత్తి నుంచి వినియోగం వరకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు అంతరాయాలు ఎదురవుతాయి. ప్రకృతి విపత్తులో కరెంట్ అంతరాయం, ప్రమాదాలు జరిగినప్పు డు, గాలి దుమారానికి, పిడుగు పడినప్పుడు కరెంట్ స్తంభాలు విరగడం, విద్యుత్ వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు పోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ అంతరాయానికి కారణం ఏంటి.. సమస్య ఎక్కడొచ్చింది? అన్నది తెలుసుకోవడం సిబ్బందికి తలనొప్పి వ్యవహారమే. సాధారణంగా ఒకలైన్లో విద్యుత్ అంతరాయం వస్తే దాని పరిధిలోని మిగతా లైన్లకు కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. కానీ జియో ట్యాగింగ్ చేస్తే సమస్య ఉన్న లైన్‌కు మాత్రం కరెంట్ సరఫరా ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా విద్యుత్ అధికారులు, సిబ్బంది సెల్ఫోన్లకు మెస్సేజ్‌ల ద్వారా సమాచారం వస్తుంది. దీంతో విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య తలెత్తిన ఆ ప్రాంతాన్ని సులువుగా గుర్తించి పరిష్కరించొచ్చని అధికారులు చెప్పారు. జూన్ మాసాంతం వరకు పూర్తిపోల్ నంబరింగ్, మ్యాపింగ్ ప్రక్రియ జూన్‌కు పూర్తవుతుంది. యాసంగి పంటలు చేతికి రాగానే మిగిలిపోయిన స్తంభా లకు నంబరింగ్, జియో ట్యాగింగ్ పూర్తి చేస్తాం. జియో ట్యాగింగ్ (మ్యాపింగ్) ద్వారా రైతులు, విద్యుత్ వినియోగ దారులకు సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ అధికారులకు, సిబ్బందికి పోల్‌పై నంబర్‌తో సహా సమాచారం అందిస్తే సిబ్బంది మ్యాపింగ్ ద్వారా సులువుగా, త్వరగా చేరుకుంటారు. సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుంది. కొత్త లైన్లు వేయాల్సి వస్తే సులభంగా ప్రణాళిక రూపొందించొచ్చు. సత్వర సేవలకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతోంది. – కర్నాటి వరుణ్‌రెడ్డి, సీఎండీ,టీజీఎన్పీడీసీఎల్ -
పెంకుటింటికి భారీగా బిల్లు
సాక్షి, పాడేరు: అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది. కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. -
కరెంటు చార్జీలు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచవద్దని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా, ప్రస్తుత చార్జీలనే కొనసాగించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి ప్రతిపాదనలు పంపాలని డిస్కంలు నిర్ణయించినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఈఆర్సీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా నవంబర్ 30లోగా ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి పంపాలి. కానీ, ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఈ సారి ఆలస్యమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ సబ్సిడీ నిధులు పెంచితేనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లోని చివరి 5 నెలల్లో రూ.1,200 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు గతంలో డిస్కంలు అనుమతి కోరగా, రూ.30 కోట్ల చార్జీల పెంపునకు మాత్రమే ఈఆర్సీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. డిస్కంల ఆర్థికలోటును భర్తీ చేయడానికి విద్యుత్ సబ్సిడీ నిధులను రూ.11,499 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో చార్జీల పెంపు నుంచి ఉపశమనం లభించింది. డిస్కంలు కోరినట్టు 5 నెలల కాలానికి రూ.1,200 కోట్ల చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చి ఉంటే.. వచ్చే ఏడాది (2025–26)లో ప్రజలపై రూ.4 వేల కోట్లకుపైగా అదనపు భారం పడి ఉండేది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదీ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలి్పంచాలంటే ప్రభుత్వం భారీగా సబ్సిడీలను పెంచక తప్పదని అధికారవర్గాలు తెలిపాయి. -
విద్యుత్ వెలుగులకు ‘చంద్ర’ గ్రహణం
సాక్షి, అమరావతి: 2014– 2019 పాలనలో చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ సంస్థలకు శాపాలుగా మారి నేటికీ వెంటాడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి చేసిన అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కారణంగా విద్యుత్ సంస్థలు నేటికీ తేరుకోలేకపోతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చులతో పాటు, పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ భారం అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడుతోంది.ఈ విషయాన్ని గుర్తించిన (2019–2024) నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. ప్రజలపై చార్జీల భారం పడకూడదని భావించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందుబాటులో ఉంచడంపై ప్రధానంగా దృష్టి సారించింది. అనుకున్నట్లుగానే ఐదేళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక వృద్ధిని సాధించింది.పెట్టుబడుల సాధనతో పాటు, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందించి, దేశంలోనే ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డులను సైతం అందుకుంది. కానీ 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పిడుగు ప్రజల నెత్తిన పడింది. పాలన చేపట్టిన వంద రోజులకే సర్ధుబాటు పేరుతో దాదాపు రూ.17 వేల కోట్లకు పైగానే ప్రజలపై భారం వేసింది.జగన్‌కు.. చంద్రబాబుకు చాలా తేడా2018–19తో పోల్చితే 2023–24 నాటికి విద్యుత్ రంగంలో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం చంద్రబాబు దిగిపోయే నాటికి 7,213 మెగావాట్ల ఉంటే అది జగన్ హయాంలో 8,789 మెగావాట్లకు పెరిగింది. ఇందులో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్ ఉన్నాయి.చంద్రబాబు హయాంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2018–19లో 27,197 మిలియన్ యూనిట్లు ఉంటే జగన్ హయాంలో 2023– 24లో 34,181 మిలియన్ యూనిట్లుగా ఉంది. అంటే 6,984 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. అలాగే ఏపీ జెన్కో లాభాలు 2018–19లో రూ.2,044 కోట్లు ఉంటే, 2023–24లో రూ.2,469 కోట్లుగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీపీడీసీఎల్)వి అయితే చంద్రబాబు సమయంలో కేవలం రూ.1,565 కోట్లు ఉంటే, జగన్ హయాంలో రూ.6,240 కోట్లకు చేరాయి.నిలువునా ముంచేసిందే చంద్రబాబు..రాష్ట్రంలో 2015–19 మధ్య 30,742 మిలియన్ యూనిట్లు మిగులు విద్యుత్ రాష్ట్రంలో ఉండేది. ఈ మొత్తం మిగులు విద్యుత్‌ను చంద్రబాబు బ్యాక్‌డౌన్ (వృథా) చేయించారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్నారు. నిజానికి రెన్యూవబుల్ పవర్ పర్చేస్ ఆబ్లిగేషన్ (ఆర్పీపీఓ) నిబంధనల ప్రకారం.. మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ను 5 నుంచి 11 శాతం తీసుకోవాలి.కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 23 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. యూనిట్ రూ 2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ను వృథాచేసి, రూ.5కు బయట కొనుగోలు చేసింది. అదే సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్‌కు ఏకంగా రూ.4.84కు తీసుకుంది. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54కు బదులు రూ.8.90 వెచ్చించారు. వీటికి ఫిక్స్డ్ చార్జీలు అదనం.ఇలా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. ఈ భారాలను పూడ్చుకోవడానికి డిస్కంలు ప్రజలపై విద్యుత్ చార్జీలు వేస్తున్నాయి. చంద్రబాబు గత హయాంలో ఏపీఈఆర్సీకి సమర్పించకుండా దాదాపు రూ.20 వేల కోట్ల ట్రూ అప్ భారాన్ని మిగిల్చారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ ఇంధన సర్దుబాటు చార్జీలు వేసి ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నారు.బాబు పాలనలో చీకట్లు.. జగన్ హయాంలో వెలుగులు..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 61,347 మిలియన్ యూనిట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడి పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడేలు విధించేవారు. విద్యుత్ కోతల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు కల్పించారు. వ్యవసాయానికి రోజులో నాలుగైదు గంటలే ఇచ్చేవారు. అది కూడా రాత్రి సమయంలో ఇవ్వడం వల్ల రైతులు ప్రాణాలు పోగొట్టుకునేవారు.విద్యుత్ కోసం పొలాల్లో పడిగాపులు కాస్తూ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ చీకటి రోజుల నుంచి విముక్తి కలిగించాలని.. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు విద్యుత్ కష్టాలు లేకుండా చేయాలని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయ రంగానికి అందించాలని నాటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.5.10 ఉంటే, సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది.దే విధంగా జగన్ హయాంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు గత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందజేసింది. అలాగే వెనుకబడిన వర్గాల కుటుంబాలు, ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వృత్తిపరమైన స్వర్ణకార దుకాణాలకు ఉచిత, సబ్సిడీతో విద్యుత్‌ను సరఫరా చేసింది. చంద్రబాబు రాకతో వీటన్నింటికీ మంగళం పాడడంతో మళ్లీ ఏపీలో ఆనాటి చీకటి రోజులు మొదలవుతున్నాయి. -
విద్యుత్ సంస్థల్లో ఆగని అక్రమ బదిలీలు
సాక్షి, అమరావతి: ‘ఏలూరు ఆపరేషన్ సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న కె.మధుకుమార్‌ను నరసాపురం ఆపరేషన్ ఈఈగా అక్టోబర్ 5న బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పదవీ విరమణ చేసే వారిని బదిలీ చేయకూడదు. కానీ ఆరు నెలల్లో రిటైర్ అయ్యే బి.సురేశ్ కుమార్‌ను ఆయన స్థానంలో నియమించారు. పలాసలో కొత్త పోస్టు సృష్టించి మరీ టెక్కలి లైన్ ఇన్స్పెక్టర్ బి.కోదండరావును అక్టోబర్ 26న అక్కడికి బదిలీ చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(డీఈఈ)గా అక్టోబర్ 25న బదిలీపై భీమవరం నుంచి తాడేపల్లిగూడెం టౌన్ వచ్చిన ఎం.రాజగోపాల చౌదరి వారం రోజులకే కాకినాడ టౌన్ ఆపరేషన్ డీఈఈగా అక్టోబర్ 30న బదిలీపై వెళ్లిపోయారు.’.. ఇవి విద్యుత్ సంస్థల్లో అక్రమ బదిలీలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిబంధనల ప్రకారం సెపె్టంబర్ 22 నుంచే బ్యాన్ అమలులోకి వచ్చింది. కానీ అది విద్యుత్ సంస్థల్లో ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నవంబర్ వచ్చినా ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ముడుపులు చేతులు మారడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలున్న వారికే ప్రాధాన్యత విద్యుత్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ కూటమి ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు సగటున ఐదు సిఫారసు లేఖలను విద్యుత్ సంస్థలకు ఇచ్చారు. ఒక్కో పోస్టుకు వచ్చిన డిమాండ్‌ను బట్టి ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు సిఫారసు లేఖలు మంజూరు చేసి, అందిన కాడికి దోచుకున్నారు. ఈ క్రమంలో వారిలో వారికే ఇబ్బందులు తలెత్తాయి. సిఫారసు లేఖల ప్రకారం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడంతో కొన్ని పోస్టులు కూటమి పెద్దల అభిమతానికి విరుద్ధంగా జరిగాయి. దీంతో ఆగ్రహానికి గురైన నేతలు మళ్లీ ఒత్తిళ్లు తెచ్చి తమ వారికి పోస్టింగులు తెప్పించుకుంటున్నారు. అందుకోసమే బ్యాన్ అమలులో ఉన్నా వందల మందికి బదిలీలు చేయించుకున్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులు ఉన్న వారికి కూడా ప్రాధాన్యత పోస్టులు ఇప్పించుకుంటున్నారు. భీమవరం టౌన్ సబ్ డివిజన్లో టిడ్కో ఇళ్లకు ఇవ్వాల్సిన దాదాపు 250 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామగ్రిని పక్కదారి పట్టించారనే ఆరోపణలున్న డీఈఈని ఆ స్కామ్ నుంచి కాపాడేందుకు తాడేపల్లిగూడెం బదిలీ చేశారు. కానీ అక్కడ పొసగకపోవడంతో ఆయన పైరవీలు చేసుకుని కాకినాడలో ప్రాధాన్యమున్న పోస్టుకు వెళ్లిపోయారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో జరుగుతున్న ఈ అక్రమ బదిలీలపై విజిలెన్స్ అధికారులు కళ్లు మూసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసులకు డిస్కంల సీఎండీలు తలొంచి, సంస్థల పరువు మంటగలపడంపై విద్యుత్ సంఘాలు మండిపడుతున్నాయి. -
పరిశ్రమలకు విద్యుత్ చార్జీల ‘హైటెన్షన్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు షాక్ కొట్టనున్నాయి. విద్యుత్ చార్జీలతోపాటు ఫిక్స్డ్ చార్జీలు కూడా పెరగబోతున్నాయి. లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించేవారికీ ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)లు వాతపెట్టబోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ.. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పిడీసీఎల్) బుధవారంరాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈ మేరకు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, కొత్త టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనిపై ఈఆర్సీ త్వరలో బహిరంగ విచారణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి కొత్త టారిఫ్ ఉత్తర్వులను జారీ చేస్తుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్‌టీలో ఏకరూప చార్జీలతో.. ప్రస్తుతం హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీలో 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం పేరిట మూడు ఉప కేటగిరీల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మూడింటికి వేర్వేరు చార్జీలను విధిస్తున్నారు. ఇందులో 132 కేవీ చార్జీలు తక్కువగా, 33 కేవీ చార్జీలు కొంత తక్కువగా ఉండగా.. వీటికంటే 11 కేవీ చార్జీలు ఎక్కువగా ఇకపై అన్నింటికీ 11 కేవీతో సమానంగా.. ఎక్కువ చార్జీలను వసూలు చేయనున్నారు. అంటే 33కేవీ చార్జీలు ఒక్కో యూనిట్‌పై 50పైసల చొప్పున, 132కేవీ/ఆపై కనెక్షన్ల చార్జీలు రూపాయి చొప్పున పెరగనున్నాయి. హెచ్‌టీ కేటగిరీలోకి సాధారణ పరిశ్రమలు, లైట్స్ అండ్ ఫ్యాన్స్, కోళ్ల ఫారాలు, సీజనల్ పరిశ్రమలు, ఫెర్రో అల్లాయ్ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, తాత్కాలిక సరఫరా వంటి వినియోగదారులు వస్తారు. ఎల్టీ కేటగిరీలో 300 యూనిట్లు దాటితే వాతేఎల్టీ కేటగిరీలోని గృహ కనెక్షన్లకు లోడ్ సామర్థ్యం (కాంట్రాక్టెడ్ లోడ్) ఆధారంగా ప్రతి కిలోవాట్ (కేడబ్ల్యూ)కు రూ.10 చొప్పున ప్రస్తుతం ఫిక్స్డ్ చార్జీలను విధిస్తున్నారు. ఇకపై నెలలో విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించితే వారి ఫిక్స్డ్ చార్జీలను కిలోవాట్‌కు రూ.10కి బదులు రూ.50 చొప్పున వసూలు చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతం నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల కింద రూ.30 విధిస్తుంటే.. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రూ.150 విధిస్తారు. » ఇక ఎల్టీ కేటగిరీలోని ఇతర వినియోగదారులకు సంబంధించిన ఫిక్స్డ్ చార్జీల పెంపునకు కూడా డిస్కంలు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. లోటెన్షన్ కేటగిరీలోకి గృహాలు, గృహేతర/ చిన్న వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారులు వస్తారు. వీటికి విద్యుత్ చార్జీలను యథాతథంగా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఆదాయ లోటు రూ.13,022 కోట్లు.. రాష్ట్ర డిస్కంలు 2024–25లో రూ.13,022 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని అంచనా వేశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ వాటా రూ.8,093 కోట్లు కాగా ఎన్పిడీసీఎల్ వాటా రూ.4,929 కోట్లు. విద్యుత్ చార్జీల పెంపుతో రూ.1,200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని.. మిగతా రూ.11,822 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుందని డిస్కంలు ఈఆర్సీకి ఇచి్చన ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. -
వాణిజ్య వడ్డన..! ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి
సాక్షి, హైదరాబాద్: నష్టాలు, అప్పుల భారంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్ చేశాయి. గృహ వినియోగం మినహా.. వాణిజ్య, పారిశ్రామిక, ఇతర కేటగిరీల విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రాథమికంగా ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి త్వరలో ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. జూన్ 6వ తేదీతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గత నెల (ఏప్రిల్) ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రావాలి. ఎన్నికలు, ఇతర కారణాలతో డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించక పోవడంతో ఉన్న చార్జీలనే కొంతకాలం కొనసాగించేందుకు ఈఆర్సీ అనుమతినిచ్చింది. జనవరి 31 వరకే గడువు ఇచ్చిన ఈఆర్సీ.. విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30వ తేదీలోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, కొత్త టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాలి. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది? దానికి ఎంత ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలతో వచ్చే ఆదాయం ఎంత? వ్యత్య్సాం (ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వమిచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా మిగిలే లోటును భర్తీ చేసేందుకు.. ఎంత మేర విద్యుత్ చార్జీలు పెంచాలి? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2024–25 ఆర్థిక సంవత్సర ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. అప్పట్లో డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా.. ఈఆర్సీ తిరస్కరించింది. వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రతినెలా రూ1,386 కోట్లలోటు.. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగిపోయినట్టు గతంలో విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. డిస్కంలు సగటున ప్రతి నెలా రూ.1,386 కోట్ల లోటు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. కోడ్ ముగిస్తే వారికీ ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించలేదు. ఆ జిల్లాలోని 8 లక్షల గృహ కనెక్షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పొందిన విద్యుత్ కనెక్షన్లకు ఎన్నికల కోడ్ ముగిశాక ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గృహజ్యోతి పథకంతో నెలకు రూ.120 కోట్ల భారం పడుతోందని.. అది రూ.150 కోట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గృహజ్యోతి అమలుకు అనుమతిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ముందస్తుగానే డిస్కంలకు ఈ సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఓ వైపు 200 యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్ అందిస్తూ.. అంతకు మించి విద్యుత్ వినియోగించే వారి బిల్లులను పెంచడం సమంజసం కాదనే భావన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గృహేతర కేటగిరీల విద్యుత్ చార్జీలను మాత్రమే పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పెంచకపోతే సర్కారే భరించాలి! లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక గృహేతర కేటగిరీల విద్యుత్ చార్జీలను ఏ మేర పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు హైదరాబాద్, వరంగల్‌లలో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. తర్వాత కొత్త టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. డిస్కంల ఆదాయ లోటును ప్రభుత్వమే విద్యుత్ సబ్సిడీల రూపంలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎలాంటి చార్జీల పెంపు లేకుండానే కొత్త టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుంది. -
డిస్కమ్‌ల డైరెక్టర్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌ల సీఎండీలను ఆయన ఆదేశించారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్ఎన్పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు. తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే.. సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్‌రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ) ఉన్నారు. కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్కో, ట్రాన్స్‌కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్‌తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీతో.. విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్‌చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్‌పేమెంట్ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అదనపు సర్‌చార్జీ బాదుడు వద్దు దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి. -
Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నవారెవరైనా స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టంగా చెప్పి.. వచ్చిన టెండర్లలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి తక్కువ ధర వచ్చేలా రివర్స్ టెండరింగ్ కూడా జరిపి.. అప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించే టెండర్‌ను ఖరారుచేసినా ఈనాడు రామోజీరావు పెడబొబ్బలు పెడుతున్నారు. అదేదో ఘోరమైనట్లు తన విషపుత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాసిపారేస్తున్నారు. తమకు అభ్యంతరంలేదని రైతులే చెబుతున్నా స్మార్ట్‌మీటర్లపై ఆ పత్రిక పదే పదే విషం కక్కుతోంది. ఇందులో భాగంగానే ‘స్మార్ట్‌గా మేసేస్తున్నారు’ పేరుతో గురువారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కానీ, ఎప్పటిలాగే రామోజీ రాతల్లో ఏమాత్రం వాస్తవంలేదని.. అయినా రైతులకు లేని అభ్యంతరం ఆయనకెందుకని ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీ కె. సంతోషరావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌లు తెలిపారు. శాస్త్ర, సాంకేతికతపై అవగాహనా లేమితో ఈనాడు కథనం వాస్తవానికి దూరంగా వుందని వారు తెలిపారు. ఈ మేరకు సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నాణ్యమైన విద్యుత్ కోసమే స్మార్ట్ మీటర్లు.. పూర్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్ హార్స్ పవర్ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. ఆ తర్వాత విద్యుత్ సంస్థలు విడతల వారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓ ఎంఎస్. 22, తేదీ : 01.09.2020) జారీచేసింది. దీని ప్రకారం.. ఃనాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమచేస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.12,128.71పై.. పన్నులతో కలిపి రూ.14,455ల వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలను ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది’.. అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదాలను తగ్గించవచ్చు.. అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు అమర్చడానికి, అవి పాడైపోకుండా వుండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటుచేస్తున్నాం. ఎంసీబీ ద్వారా ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. మహారాష్ట్రతో పోలికేంటి? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడీసీఎల్) సంస్థ పరిధిలో హెచ్‌వీడీఎస్ పథకం కింద వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు వాల్ మౌంటెడ్ ఎస్ఎంసీ మీటరు బాక్సును మాత్రమే రూ.2,100లతో ఏర్పాటుచేశారు. అయితే, మన రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఎస్ఎంసీ మీటరు బాక్సులో అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్ పరికరాలు కూడా వుండడంతో మీటరు బాక్సు సైజు సుమారు రెండింతలు వుంటుంది. మహారాష్ట్ర స్మార్ట్ మీటర్లు గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం అమర్చుతున్నారు. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ విద్యుత్ ఆధారిత సర్వీసులకు మాత్రమే పెడుతున్నాం. వ్యవసాయ స్మార్ట్ మీటర్ అమర్చడంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం అమర్చిన స్మార్ట్ మీటర్లను పోల్చడం సరికాదు. మీటర్లతో అందరికీ మేలు.. మీటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. డిస్కంకు జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో లోడ్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం వుంటుంది. అంతేకాక.. సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకే పనులను అప్పగించాం. ఈ ప్రక్రియలో ఎలాంటి గోప్యతకు ఆస్కారం లేదు. విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని సీఎండీలు వివరించారు. తెలియకపోతే తెలుసుకోండి.. విద్యుత్ సంస్థల్లో డీబీటీ విధానం కోసం 93 నెలల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. అనుబంధ పరికరాలకు సంబంధించిన టెండరును విక్రాన్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ అనుబంధ పరికరాలను బాక్సులో అమర్చి సరఫరా చేసి వ్యవసాయ సర్వీసు వద్ద అమర్చుతోంది. అంతేతప్ప అది ఖాళీ బాక్సులు ఇస్తున్నట్లు కాదు. ♦ స్మార్ట్ మీటర్ల టెండర్లను దక్కించుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ విక్రాంత్ సంస్థ అమర్చిన అనుబంధ పరికరాలతో కూడిన మీటరు బాక్సులో మీటరు సరఫరా, అమరిక, అనుసంధానం పనులు చేపడుతోంది. ♦ ఈ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సెంట్రల్ సర్వర్లతో అనుసంధానం అయిన ప్రతి సర్వీసు మీటర్ డేటా ఆన్లైన్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ♦సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్ హెచ్చుతగ్గులను నివారించడంతో పాటు రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. ♦ ఒప్పందం ప్రకారం డేటా నమోదైన సర్వీసులకు మాత్రమే ప్రతినెలా బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ♦ మీటర్ రీడింగ్‌లో సర్వే, జీఎస్ మ్యాపింగ్, అనుసంధానం, హెచ్ఏఎస్, ఎంఏఎస్, ఎంఎంఎస్, సిమ్‌కార్డ్ రెంటల్, నెట్వర్క్ కాస్ట్, ఆపరేషన్–మెయింటినెన్స్ వంటి సేవలను పొందుపరిచారు. ♦ వ్యవసాయ సర్వీసులు దూరంగా వుండడంవల్ల నెట్వర్క్ హెచ్చుతగ్గులు ఉన్నచోట మీటరు దగ్గరకు వెళ్లి మీటరు డేటా స్వీకరిస్తున్నారు. ∙దీని అంచనా సుమారు 15 శాతంగా నిర్ణయించాం. ఈ అంచనా వ్యయం అధ్యయనం చేసిన తర్వాత నెలకు ఒక మీటరుకు రూ.197.05 పైసలుగా నిర్ణయించాం. -
‘స్మార్ట్’ మీటర్లకు సై
వీరంపాలెం గ్రామం నుంచి సాక్షి ప్రతినిధి బోణం గణేష్: అర్ధరాత్రి చేనుకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటార్ స్విచ్ ఆన్ చేయగానే విద్యుత్ షాక్ తగిలి అన్నదాత ప్రాణాలు వదిలేస్తే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. రైతులకు ఇచ్చే కరెంటులో నాణ్యత లేకపోతే పంట మనుగడ కష్టం. ఎన్ని సర్వీసులకు ఎంత విద్యుత్ ఇవ్వాలో తెలియక సాంకేతిక సమస్యలతో సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం. ఈ సమస్యలను అధిగమించి, పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌ను ఇకపై రైతులకు హక్కుగా మార్చాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తూ, మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామంటుంటే ఎందుకు కాదంటామని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పొలాల్లో ప్రాణాలు వదిలే పరిస్థితిగానీ, నీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితిగానీ రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రైతులు మద్దతు పలుకుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో 33% విద్యుత్ ఆదా రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రంలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని 2020లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 18 శాతం నుంచి 20 శాతం వరకు వ్యవసాయ రంగం వాటా ఉంది. దీనిని మరింత కచ్చితంగా లెక్కించడం కష్టమవుతోంది. ఇది తెలియాలంటే మీటర్లు అమర్చి, విద్యుత్ వినియోగాన్ని లెక్కించాలి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఫలితంగా 33 శాతం విద్యుత్ ఆదా కనిపించింది. దీంతో రాష్ట్రం అంతటా స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. తొలి విడతగా ఏపీఈపీడీసీఎల్‌లో 32,500, ఏపీసీపీడీసీఎల్‌లో 35,000, ఏపీఎస్పీడీసీఎల్లో 70,200 చొప్పున స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను మొదలుపెట్టాయి. నమ్మకంతోనే రైతుల మద్దతు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుతం రైతుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొత్త ఖాతాలు తెరిపిస్తోంది. వినియోగం ఆధారంగా బిల్లు మొత్తం నగదు బదిలీ ద్వారా జమ చేస్తుంది. అది డిస్కంలకు బదిలీ అవుతుంది. దీనివల్ల నాణ్యమైన విద్యుత్‌ను పొందే హక్కు రైతులకు లభిస్తుంది. మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు లైన్మెన్లు రావడం వల్ల విద్యుత్ సమస్య ఏదైనా ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించుకోవచ్చు. రీడింగ్‌ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని తెలుసుకుని లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చు. ఎంత లోడు వాడుతున్నారో కచ్చితంగా తెలియడం వల్ల ఆ మేరకు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు పటిష్టం చేసుకోవచ్చు. అనధికార కనెక్షన్లు ఉండవు. ఇలాంటి ఏర్పాటుపై నమ్మకం కుదరడంతో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు అంగీకార పత్రాలను డిస్కంలకు అందించారు. పనితనానికి, ప్రాణానికి భరోసా మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న రక్షణ పరికరాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వోల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్ మోటారు జీవిత కాలాన్ని పెంచడానికి దోహదపడుతుంది. మోటారు పనితనం వృద్ధి చెందుతుంది. మోటారు స్టార్టర్, వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవ్వడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిచినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్ ప్రమాదాలను షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసీ) బాక్స్ నివారిస్తుంది. ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్ తగలదు. వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లదు. రైతుపై పైసా భారం పడదు స్మార్ట్ మీటర్ల కోసం రైతులు తమ జేబు నుంచి ఒక్క పైసా చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క విద్యుత్ సర్వీసునూ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత తొలగించరు. ఒక వినియోగదారుని పేరిట కొన్ని కనెక్షన్లే ఉండాలనే నిబంధన ఏదీ లేదు. ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ పేరు మార్చుకోవాలన్నా చేసుకోవచ్చు. అనధికార, అదనపు లోడు కనెక్షన్లన్నీ క్రమబద్దీకరిస్తారు. పేర్ల మార్పు ప్రక్రియ కోసం, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, రైతు ఎవరి దగ్గరకూ వెళ్లనవసరం లేదు. డిస్కంలు, గ్రామ సచివాలయ సిబ్బందే రైతు వద్దకు వచ్చి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. – కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ అనుమానాలేం లేవు స్మార్ట్ మీటర్ పెడతామన్నప్పుడు మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామకృష్ణని, లైన్‌మెన్‌ని దాని గురించి అడిగాను. బిల్లు వేస్తారని అందరూ అంటున్నారనే సందేహాన్ని వారి వద్ద వ్యక్తం చేశాను. అలాంటిదేమీ లేదని, ఉచిత విద్యుత్ ఎన్ని యూనిట్లు వాడుతున్నామనేది తెలుసుకోవడం కోసమే మీటర్లు అని చెప్పడంతో నా అనుమానాలన్నీ తీరిపోయాయి. వెంటనే మీటర్ అమర్చడానికి అంగీకరించాను. – అఖిల్ రెడ్డి, రైతు, వీరంపాలెం మాకే మంచిది స్మార్ట్ మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, దొంగతనానికి, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చులు మొత్తం విద్యుత్ కంపెనీలే భరిస్తాయని హామీ ఇచ్చారు. మేం పైసా కట్టకుండా మీటర్ పెడతామన్నారు. అంతకంటే ఏం కావాలి? ఇప్పటికే మాకు తొమ్మిది గంటలు పగలు కరెంటు ఇస్తున్నారు. దానివల్ల పంటలు బాగా పండుతున్నాయి. మీటర్లు పెట్టాక ఇంకా మేలు జరుగుతుందంటే మాకే మంచిది కదా! – మాకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం రైతులకు మెరుగైన విద్యుత్ రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వడంలో ఎక్కడా రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఏలూరు ఆపరేషన్ సర్కిల్, నీలాద్రిపురం సెక్షన్‌లోని వీరంపాలెం లో ముందుగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు మీటర్లపై అవగాహన కల్పించడంతో వారంతా సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. – పి.సాల్మన్‌రాజు, ఎస్ఈ, ఏలూరు ఆపరేషన్ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ -
జనంపై భారం లేదు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ కొనసాగుతుంటే ఏపీ మినహా మరెవరూ స్మార్ట్ మీటర్లు అమర్చడం లేదంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను అచ్చేస్తోంది ఈనాడు. ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుంటే ‘జనం జేబుకు చిల్లు‘ అంటూ వక్ర భాష్యాలు చెబుతోంది. ఆ కథనంలో దాచిపెట్టిన వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు. ♦ విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2025 నాటికి ప్రతి సర్వీసు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు అన్నిటికి స్మార్ట్ మీటర్లను అమర్చాలనే నిబంధన విధించాయి. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారం లేకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పధకాన్ని రూపొందించారు. ఈమేరకు దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. ♦ రాష్ట్రంలో 200 యూనిట్లు అంతకుమించి వాడకం ఉన్న సర్వీసులకు, ప్రభుత్వ సర్వీసులకు డిస్కమ్‌లు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాయి. తద్వారా పేద, మధ్య తరగతిపై భారం లేకుండా చర్యలు తీసుకున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లలో కొత్త టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, నాణ్యతను తెలుసుకునే వీలుంది. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. డబ్బులు కట్టలేదని లైన్మెన్ కరెంట్ నిలుపుదల చేసే పరిస్థితి ఉండదు. ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు 2025 మార్చి వరకు గడువు ఉంది. రెండు నెలల వ్యవధిలో ఏర్పాటు చేయాలన్నది అవాస్తవం. ♦ దేశంలో 19.792 కోట్ల మంది వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు ఆమోదం లభించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్, బిహార్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, త్రిపురలో 7.517 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు టెండర్లను ఖరారు చేశారు. బిగించే ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ♦ మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, వాణిజ్య భవనాలకు, పారిశ్రామిక వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ఒక్కో సింగిల్ ఫేజ్ మీటర్‌కు నెలకు రూ.86.32, త్రీ–ఫేజ్ మీటర్‌కు రూ.176.02 చొప్పున 93 నెలల వ్యవధిలో టెండర్ దక్కించుకున్న సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, పదేళ్ల పాటు నిర్వహణకు రూ.5 వేల కోట్లు వ్యయం కానుంది. అయితే ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా మీటరుకు రూ.1,350 వరకు కేంద్రం గ్రాంట్ ఇస్తుంది. ఇదంతా వదిలేసి రూ.20 వేల కోట్ల భారమంటూ ‘ఈనాడు’ కాకి లెక్కలతో తప్పుడు రాతలను అచ్చేసింది. -
Fact Check: ఎక్స్చేంజీల్లో చెప్పిన ధరకే విద్యుత్ కొనుగోలు
సాక్షి, అమరావతి: జాతీయ ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ ధరలను ఎవరూ నియంత్రించలేరు. కేవలం గరిష్ట సీలింగ్ ధరను మాత్రమే నిర్ణయించగలరు. ఆ అధికారం కూడా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కే ఉంది. ఇంత చిన్న విషయంపైన కూడా అవగాహన లేకనో లేదా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం వైఎస్ జగన్ పైనా బురద జల్లాలనే అత్యుత్సాహమో ఈనాడు బుధవారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ‘మనం చేస్తే ఖర్చు.. మరొకరైతే దోపిడీ’ అంటూ అవాస్తవాలను అల్లింది. ప్రజల అవసరాలకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సరిపోనప్పుడు బహిరంగ మార్కెట్లో కొనైనా ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే తప్పన్నట్టుగా ఆ కథనంలో అక్కసు వెళ్లగక్కింది. విద్యుత్‌ను బయట నుంచి మూడు రెట్లు అధిక ధరకు కొంటున్నారని, ఆ భారం ప్రజలపైనే వేస్తారని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఇంధన శాఖ వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. ► దేశంలో విద్యుత్ ఎక్స్చేంజిలు కొత్తగా ఏమీ రాలేదు. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి వివిధ రకాల మార్కెట్ సెగ్మెంట్ల ద్వారా స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు స్వల్పకాలిక విద్యుత్ అవసరాల కోసం ఎప్పటి నుండో ఈ ఎక్స్చేంజిలపై ఆధారపడ్డాయి. ► మార్కెట్ ధరలు ఆ రోజుకి, ఆ టైం బ్లాక్ (ఒక రోజులో 96 టైం బ్లాక్ లు ఉంటాయి. ఒక్కోటీ 15 నిమిషాల సమయం)లో మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, డిమాండ్ బిడ్లు ఆధారంగా ఉంటాయి. ► ఇందులో బయటి నుంచి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. ఈ ఎక్స్చేంజిలు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం, మండలి నిబంధనలు, నియమావళికి లోబడి పనిచేస్తాయి. ► నెల వారీగా కొనే ద్వైపాక్షిక విద్యుత్ ఒప్పందాలైతే డీఈఈపీ, ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా నిర్దేశిస్తారు. ఈ పోర్టల్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. కేంద్ర విద్యుత్ శాఖ ఎక్స్చేంజిల్లో కొనే విద్యుత్‌కు గరిష్ట ధర (సీలింగ్ ప్రైస్) యూనిట్ రూ.10గా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధారించింది. ► పీక్ లోడ్ సమయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వివిధ కేటగిరీల లోడ్‌ను బట్టి, అందుబాటులో ఉండే ఉత్పత్తి వనరులపై ఆధారపడి ఉంటుంది. అంతే కానీ ఈ ధరలను ఎవరూ నియంత్రించలేరు. ► పీక్ అవర్స్‌లో విద్యుత్ కొనుగోలు కూడా ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఇచ్చింది. దాని ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నారు. ► మార్కెట్ ధరలు మూడు రెట్లు పెరగలేదు. గతంలో సీలింగ్ ధర యూనిట్‌కు రూ. 20 ఉండేది. అప్పుడు కూడా అత్యవసరాన్ని బట్టి డిస్కంలు యూనిట్‌కు రూ. 17 వరకు వెచ్చించి కొన్నాయి. ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన డిమాండ్ వల్ల, జల విద్యుత్ లేకపోవడం వల్ల మార్కెట్లో ధరలు పీక్ సమయంలో దాదాపు సీలింగ్ ప్రైస్ యూనిట్ రూ .10, రోజువారీ ధర రూ.6 నుంచి రూ.9 వరకు సీఈఆర్సీ నిర్ణయించింది. అంతేగానీ ధరలు మూడు రెట్లు పెరగలేదు. ► మార్కెట్ కొనుగోళ్లలో ఏ విధమైన ప్రమేయాలూ ఉండవు. ధరలు మార్కెట్ అంశాల ఆధారంగానే నిర్ధారణ చేస్తారు. ► దేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఎక్స్చేంజి ఐఈఎక్స్ గణాంకాల ప్రకారం.. సంవత్సరం అంతా సాయంత్రం పీక్ లోడ్ సరాసరి ధరలు (అన్ని నెలలు, సీజన్లు కలుపుకుని) గత 8 సంవత్సరాలుగా ఈ విధంగా ఉన్నాయి. -
ఏపీయే స్ఫూర్తి
సాక్షి, అమరావతి : ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధిని సాధించిందని చెప్పడానికి ఉపయోగపడే ప్రధాన సూచికల్లో విద్యుత్ వినియోగం ఒకటి. అందుకే విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు, జీవన ప్రమాణాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని లెక్కిస్తుంటారు. అలాంటి విద్యుత్ సరఫరాకు దీర్ఘకాలంగా ఆటంకం ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు భవిష్యత్ విద్యుత్ సరఫరాకు ముందుగానే ప్రణాళికలు వేస్తుంటాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఏపీ చర్యలను స్ఫూర్తిగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ పదేళ్ల విద్యుత్ వినియోగానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తొమ్మిదేళ్ల ముందుగానే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్దేశించింది. జల విద్యుత్ కొనాలంటే తొమ్మిదేళ్ల ముందు, థర్మల్‌కు ఏడేళ్ల ముందు, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఐదేళ్లు, పవన విద్యుత్‌కు మూడేళ్లు, సౌర విద్యుత్‌కు రెండేళ్ల ముందు ఒప్పందాలు కుదుర్చుకోవాలని కేంద్రం వెల్లడించింది. 2031 నాటికి రెట్టింపు వినియోగం.. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ ఆధారంగా రానున్న పదేళ్లలో వినియోగం ఎంత ఉంటుందో అంచనా వేయాలని కేంద్రం కోరింది. దీంతో.. 2031 నాటికి ఏపీలో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తన 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే (ఈపీఎస్) నివేదికలో ఇప్పటికే వెల్లడించగా, ఇటీవల జాతీయ విద్యుత్ ప్రణాళిక కమిటీ దానిని ధుృవీకరించింది. ఇక రాష్ట్రంలో 2021–22 ఏడాదిలో విద్యుత్ వినియోగం 60,495 మిలియన్ యూనిట్లు ఉండగా, 2031–32 నాటికి 1,21,798 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మరో 13,510 మెగావాట్లు పెరగనుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రంలో 800 మెగావాట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఈ నెలలోనే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో మరో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఇంధన శాఖ, ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తున్నాయి. పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట.. ఇక 2030 నాటికి వినియోగించే విద్యుత్‌లో 50 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. ఈ విషయంలోనూ రాష్ట్రం ముందంజలోనే ఉంది. వ్యవసాయానికి ఏకంగా ముప్పై ఏళ్ల పాటు పగటివేళలోనే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ఇప్పటికే యూనిట్‌కు రూ.2.49 పైసల చొప్పున ఒప్పందం చేసుకున్నాయి. సెకీ నుంచి తీసుకుంటున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ కావడం విశేషం. దీంతోపాటు 44,250 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.9.47 లక్షల కోట్ల విలువైన పునరుత్పాదక ప్రాజెక్టుల స్థాపనకు ఒప్పందాలు కూడా చేసుకుంది. -
విశాఖలో ‘అండర్ కరెంట్’
సాక్షి, అమరావతి: విశాఖలో విద్యుత్ వ్యవస్థను సంపూర్ణంగా మారుస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత సురక్షిత విద్యుత్ సరఫరాకు భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. తుపానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం వెలుగులు ప్రసరించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.720 కోట్లతో ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి. నగరంలో విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భూగర్భ విద్యుత్ లైన్లతో రీప్లేస్ చేయాలని ఏపీఈపీడీసీఎల్ భావిస్తోంది. సగానికి తగ్గనున్న ప్రసార నష్టాలు భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ సముద్రతీర ప్రాంతంలోని 28 సబ్స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 115 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 349 కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 940 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు, 660 రింగ్ మెయిన్ యూనిట్ (ఆర్ఎంయు)లు, 986 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు), 1,498 ఫీడర్ పిల్లర్లు, 9,179 సర్వీస్ పిల్లర్లు నిర్మించారు. 1,03,281 సర్వీసులను భూగర్భ విద్యుత్ వ్యవస్థతో అనుసంధానించారు. దీంతో ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, సాగర్‌నగర్, బీచ్ రోడ్, జాతీయ రహదారి–16 ప్రాంతాల్లో ఇటీవల తుపాన్ల సమయంలోను నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను తొలగించి భూగర్భంలోకి మార్చనున్నారు. ఇందుకోసం రూ.157 కోట్లతో మూడు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్)లు, 35 ఇండోర్ 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. వీటికోసం 613.31 కిలోమీటర్ల మేర కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించారు. ఏపీఈపీడీసీఎల్ ప్రస్తుత ప్రసార నష్టాలు 6 శాతంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల శాతాన్ని సగానికి తగ్గించవచ్చని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. కరెంటు తీగలకు తగులుతున్నాయని చెట్లను నరికేయాల్సిన అవసరం ఉండదు. కొత్త మొక్కలను కూడా నాటి నగరాన్ని పచ్చదనంతో నింపవచ్చు. ఈ కేబుళ్లు ప్రత్యేకం నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ప్రమాణాలకు అనుగుణంగా భూగర్భ విద్యుత్ లైన్లు ఉండాలి. సరైన వైర్, కేబుల్ ఎంచుకోవడంపైనే ప్రాజెక్టు ఆధారపడి ఉంటుంది. అందువల్ల వాటి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కేబుల్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు, గేజ్ పరిమాణం, స్ట్రాండ్డ్ సాలిడ్, వోల్టేజ్ రేటింగ్, ఇన్సులేషన్, జాకెట్ రంగు వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. వైర్లు, కేబుల్స్ రెండింటినీ భూగర్భ నిర్మాణంలో ఉపయోగించవచ్చు. భూగర్భ తీగను రాగి, అల్యూమినియంతో తయారు చేస్తారు. రాగి తీగ సురక్షితంగా భూమిలో మనగలుగుతుంది. దీనిచుట్టూ అత్యంత భద్రతనిచ్చే పొర ఉంటుంది. ఈ కేబుళ్లు కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వైర్‌కు మట్టికి మధ్య ఒక కండ్యూట్ (గొట్టం) యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. సరికొత్త విశాఖను చూస్తాం విశాఖ సాగరతీర ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చాలా వరకు పూర్తయింది. నగరంలో మిగిలిన ప్రాంతాల్లోను భూగర్భ విద్యుత్ లైన్లు వేస్తున్నాం. మొత్తం పనులు పూర్తయితే విశాఖలో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. సరికొత్త విశాఖను చూస్తాం. ప్రజలకు అత్యంత సురక్షితంగా, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుంది. డిస్కం పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలోను 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థలోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. మీరేమంటారు?
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు. జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
Fact Check: స్మార్ట్‌గా ‘పచ్చ’ అబద్ధాలు! ‘ఈనాడు’ రాసిన మరో దిగజారుడు కథనం
సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? ఇంధన శాఖ అంటే ప్రభుత్వంలో భాగం కాదా? మరి ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఆపటమేంటి? అసలు ఇలాంటి కథనానికి అర్థమేమైనా ఉందా? ‘స్మార్ట్ మేతకు ఎత్తు’ అంటూ గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. ప్రభుత్వం కుంభకోణానికి ప్రయత్నిస్తే, ‘ఇంధన, ఆర్థిక శాఖలు తీవ్ర అభ్యంతరం’ వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నం ఫలించలేదన్నది వార్త సారాంశం. స్మార్ట్ మీటర్ల విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అంశాలను పరిశీలించి, తగిన వివరణ ఇవ్వాలంటూ డిస్కంలకు ఇంధనశాఖ కార్యదర్శి మూడు నెలల క్రితం రాసిన లేఖల అర్థ్ధాన్నే మార్చేసి... ఇప్పుడేదో జరిగిపోతున్నట్లుగా కథనాన్ని వండేసింది. విచిత్రమేంటంటే టెండర్లను పిలిచింది ప్రభుత్వమే. శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించిన మీదట... అక్కడ దాదాపు 20 శాతం విద్యుత్ వినియోగం తగ్గింది. పైపెచ్చు విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కం) చంద్రబాబునాయుడు ఏకంగా రూ.21,000 కోట్ల అప్పుల్లో ముంచి దిగిపోవటంతో వాటి ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. వాటిని గాడిలో పెట్టాలంటే వాటికీ కాస్త జవాబుదారీ తనం పెరగాలి. మరోవంక మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తారు. వారికి నాణ్యమైన విద్యుత్తును అడిగే హక్కుంటుంది. ఈ కారణాలతో స్మార్ట్ మీటర్లకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కాకపోతే కోవిడ్ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిని... ప్రతి వస్తువు ధరా దారుణంగా పెరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అప్పట్లో పిలిచిన టెండర్లు కావటంతో.. ముందుకొచ్చిన కంపెనీలు అప్పటికి తగ్గట్టు రేట్లు కోట్ చేశాయి. రకరకాల కారణాలతో టెండర్లు ఆలస్యం కావా? చివరకు కోవిడ్ తగ్గి పరిస్థితులు మామూలు స్థాయికి రావటంతో పరికరాల ధరలూ తగ్గుముఖం పట్టాయి. ఇది గమనించబట్టే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి... ప్రస్తుత ధరలతో పిలిస్తే కొంత ఆదా అవుతుందని భావించింది. అందుకే ప్రభుత్వమే టెండర్లను రద్దు చేసింది. మరి దీన్లో కుంభకోణమేంటో.. ప్రభుత్వమే స్కామ్ చెయ్యబోతే దాన్ని ఇంధన శాఖ ఆపేయటమేంటో... రామోజీరావే చెప్పాలి. ఇప్పుడైనా మీరు టెండర్లు వేయొచ్చు కదా? ప్రతిసారీ ప్రభుత్వం చెబుదున్నదొకటే. పనికిమాలిన ఆరోపణలు చేసే బదులు... అలాంటి టెండర్లలో మీరూ పాల్గొనవచ్చు కదా... అని!!. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో వీటికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. దాన్లో ఎవరైనా పాల్గొనవచ్చు.ఎవరు తక్కువకు కోట్‌చేస్తే... వారికే పని దక్కుతుంది. రకరకాల రాష్ట్రాల పేర్లు చెబుతూ ఎక్కడెక్కడ ఎంత తక్కువో చెబుతున్న రామోజీరావు... వారితో ఒప్పందం చేసుకుని తానే టెండర్లు వేయొచ్చు కదా? లేకపోతే రామోజీకి తందానతాన పలికే చంద్రబాబునాయుడే టెండర్లు వేయొచ్చు కదా? మీరు తక్కువ కోట్ చేస్తే మీకే వస్తుంది కదా? ఎందుకీ పనికిమాలిన ఆరోపణలు?. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ మీటర్లకు గ్రాంటు ఇస్తూ... వీటి ఏర్పాటుకు రకరకాల నిబంధనలు పెట్టింది. ఆ మార్గదర్శకాలకు లోబడే ఎవరైనా చెయ్యాలి. అలాంటి వాస్తవాలు రాయనే రాయరు. ఇంకా ‘ఈనాడు’ రాసిన ఈ దిగజారుడు కథనంలో అసలు నిజాలేంటంటే... ఆరోపణ: ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు అమర్చే ఒక్కో స్మార్ట్ మీటర్ (3 ఫేజ్)కు రూ.3,500 వ్యయం వాస్తవం: ఇది పచ్చి అబద్ధం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయ మీటర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనికితోడు కాంట్రాక్టు సంస్థలకు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటం కూడా పచ్చి అబద్ధమే. ఎందుకంటే నిర్వహణ వ్యయంలో మాత్రం 40 శాతాన్ని కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని ఏడేళ్ల వ్యవధిలో చెల్లిస్తుంది. కానీ మొత్తం 100 శాతాన్నీ కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం ముందే చెల్లించేస్తుందంటూ ‘ఈనాడు’ రాయటాన్ని ఏమనుకోవాలి? అయినా టెండర్ల ప్రక్రియే పూర్తికాకుండా... దానికి ఎక్కువ పెట్టేశారని ఒకసారి... ఇంధన శాఖ అడ్డుకోవటంతోనే రద్దు చేశారని మరోసారి... ఇలాంటి రాతలను ఏమనుకోవాలి రామోజీరావు గారూ? ఈనాడు’ ఆరోపణ: మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రెట్లు ఎక్కువ వాస్తవం: రాష్ట్రంలో ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, నిర్వహణకు నెలకు రూ.581.16 పైసలు అవుతుందనడం అబద్ధం. అసలు టెండర్లే ఖరారు కానపుడు రేట్లెలా నిర్ధారిస్తారు? ఇంకా విచిత్రమేంటంటే మహారాష్ట్రలోని మీటర్లతో వీటిని పోల్చటం. మహారాష్ట్రలో బెస్ట్ కంపెనీ స్మార్ట్ మీటర్లను అమర్చింది ప్రధానంగా అర్బన్ ప్రాంతంలోని ఇళ్లకు. 80 శాతం సింగిల్ ఫేజ్, 20 శాతం త్రీఫేజ్ మీటర్లు. నిర్వహణ కాల వ్యవధి ఏడున్నరేళ్లు. ఈ వ్యవధిలో కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తం మీటరుకు రూ.18,690. కానీ మన రాష్ట్రంలో అమరుస్తున్నది గ్రామాల్లో.. అది కూడా వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు. అన్నీ త్రీఫేజ్ మీటర్లే. మరి వాటికీ వీటికీ పోలిక ఎక్కడ? పైపెచ్చు మన రాష్ట్రంలో టెండర్లు పిలిచే నాటికి ఎక్కడా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని అమర్చిన సందర్భాల్లేనందున దీనికి బెంచ్‌మార్క్ ధరంటూ లేదు. అయినా సరే.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధర ఎక్కువని ప్రభుత్వమే భావించినందున ప్రభుత్వమే రద్దుచేసి మళ్లీ పిలుస్తోంది. కానీ ‘ఈనాడు’ వంకర రాతలే పనిగా పెట్టుకుంది. ‘ఆరోపణ: స్మార్ట్ మీటర్లలో ఫీచర్లు ఎక్కువ ఉన్నంత మాత్రన అంత ధరలా? వాస్తవం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఐఆర్డీఏ మీటర్లను మీటరు బోర్డుపై అమర్చారు. మీటర్ రీడర్లు ఐఆర్డీఏ పోర్టు ద్వారా రీడింగ్ తీయాలి. వేర్వేరు ప్రాంతాల్లోని ఈ వ్యవసాయ సర్వీసులన్నింటికీ రీడింగ్ తీయడం కష్టమైది. మీటరు బోర్డుకు ఎటువంటి అనుబంధ, భద్రతా పరికరాలను అమర్చలేదు. వ్యవసాయ పంపుసెట్లకు దగ్గరగా బహిరంగ ప్రదేశంలో వీటిని అమర్చడంతో ఎండ, వర్షాలకు పరికరాలు దెబ్బతింటున్నాయి. దీంతో మీటర్లను మార్చాల్సిన పరిస్థితొస్తోది. రీడింగ్ తీయడానికి కూడా ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బందితోనే ప్రస్తుతం రీడింగ్ తీస్తుండటంతో సాదారణ విధులకు ఆటంకమేర్పడుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు ప్రస్తుతం అనుబంధ, భద్రత పరికరాలు ఏమీ లేవు. దీంతో భద్రతా పరికరాలైన కెపాసిటర్లు (నాణ్యమైన ఓల్టేజ్, పంపిణీ నష్టాలు తగ్గింపునకు), సర్వీసు వైరు, పీవీసీ వైరు, ఎర్తింగ్, ఎంసీబీ(ఓవర్ లోడ్ ప్రొటెక్షన్, విద్యుత్ భద్రతా చర్యల బలోపేతానికి) కూడా చేర్చారు. ఈ ఎస్ఎంసీ బాక్స్‌లో మీటర్లను ఏర్పాటు చేస్తారు కనక వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటికి భద్రత ఉంటుంది. రైతులకి విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణా ఉంటుంది. యంసీబీ ద్వారా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యుర్నూ తగ్గించొచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతు కోసం ఏటా రూ.102 కోట్లు భరించాల్సి వస్తోంది. అందుకే ఈ పరికరాలన్నిటినీ చేరిస్తే... ఇవన్నీ అనవసరమైనవంటూ తేల్చేశారు ఘనత వహించిన రామోజీరావు!!. అదీ ‘ఈనాడు’ పాఠకుల దౌర్భాగ్యం. -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2023–24లో విద్యుత్ చార్జీలు వడ్డించకుండా ప్రస్తుత రిటైల్ టారిఫ్‌ను యధాతథంగా కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల యాజమాన్యాలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఈ నెలాఖరులోగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్), విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పించేందుకు డిస్కంలు కసరత్తు నిర్వహిస్తున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌చార్జీలు పెంచి వినియోగదారులపై రూ.5,597 కోట్ల వార్షిక భారాన్ని డిస్కంలు వేశాయి. దీనికితోడు వచ్చే ఏడాదిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో 2023–24లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని డిస్కంలు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ సబ్సిడీ పెంపు! విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఏటా నవంబర్ చివరిలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలతోపాటు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. వచ్చే ఏడాది రాష్ట్రానికి ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం? ఈ మేరకు విద్యుత్ సరఫరాకి కానున్న మొత్తం వ్యయం ఎంత? ప్రస్తుత విద్యుత్ చార్జీలతోనే బిల్లులు వసూలు చేస్తే వచ్చే నష్టం(ఆదాయ లోటు) ఎంత? లోటును భర్తీ చేసుకోవడానికి ఏ కేటగిరీ వినియోగదారులపై ఎంత మేర చార్జీలు పెంచాలి? అనే అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఏఆర్ఆర్ నివేదికలో ఉంటాయి. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెంచే అవకాశాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వమే తమకు సబ్సిడీలు పెంచి ఆదాయలోటును భర్తీ చేయాలని డిస్కంలు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. డిస్కంలు తీవ్ర ఆర్థికనష్టాల్లో ఉన్న నేపథ్యంలో సబ్సిడీల పెంపు తప్ప మరో మార్గంలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
నాణ్యమైన పరికరాలనే కొంటున్నాం..
సాక్షి, అమరావతి: డిస్కమ్ పరిధిలో వివిధ పనుల కోసం నాణ్యమైన పరికరాలనే కొనుగోలు చేస్తున్నామని ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. డిస్కంలో నాసిరకం తీగలు, పరికరాలను కొనుగోలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. వివిధ పనులకు టెండర్ల స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రూపొందించే ప్రక్రియలో భాగంగా బిడ్డర్ అర్హతను తెలుసుకోవడం కోసం కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ను ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా తయారు చేస్తారని తెలిపారు. ఈ–ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో రివర్స్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్‌కు టెండరు దక్కాక సంబంధిత ఫ్యాక్టరీలో పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి థర్డ్ పార్టీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్‌తో పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరికరాల తరలింపునకు అనుమతించి, ఆయా ఫ్యాక్టరీల నుంచి సంస్థ పరిధిలోని స్టోర్లకు తరలిస్తామని తెలిపారు. స్టోర్లకు చేరిన పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి మరోసారి పరీక్షించాకే వాటిని స్టాక్‌లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అమర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ పనుల్లో, పరికరాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు డిస్కంలలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే, డిస్కంలో లైన్మెన్ పోస్టులను కుదించేశారని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయిలో నియామకాలు జరగలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. దీంతో 2019 అక్టోబర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 3,088, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2,859 ఎనర్జీ అసిస్టెంట్లను నియమించినట్లు వివరించారు. -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
రూ.3,897.42 కోట్లతో విద్యుత్ వ్యవస్థ పటిష్టం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) ఆధ్వర్యంలో విద్యుత్ వ్యవస్థను పటిష్టపరిచే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందుకోసం మొత్తం రూ.3,897.42 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునికీకరణ, కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం వంటి పనులతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తయితే సాంకేతిక, సరఫరా నష్టాలు తగ్గి విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలపడటంతోపాటు వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 31,301 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎంల) మేర విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. వీటిలో 5,532.161 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎంల) 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎంల 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎంల పొడవున 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. ఇవి 354 మార్గాల ద్వారా రాష్ట్ర, అంతర్రాష్ట్ర పవర్ గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయి. ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 351 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 400 కేవీ సామర్థ్యంగలవి 16, 220 కేవీ సామర్థ్యం ఉన్నవి 103, 132 కేవీ సామర్థ్యంగలవి 232 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఈ 351 సబ్స్టేషన్ల ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్ సంస్థలకు (డిస్కంలకు) ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతోంది. ఆ విద్యుత్‌ను డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. వీటన్నిటినీ అధికారులు తనిఖీ చేయించనున్నారు. ఎక్కడైనా ఆయిల్ లీకేజీలు ఉన్నా, కాయిల్స్ మార్చాల్సి వచ్చినా, వైండింగ్ చేయాల్సినా, స్విచ్‌లు, ఇతర సామగ్రి పాడైనా గుర్తించి వాటిస్థానంలో కొత్తవి అమర్చాలని భావిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ‘విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల అనేక నష్టాలను తగ్గించవచ్చు. ట్రాన్స్మిషన్ నష్టాలను పరిశీలిస్తే.. 2018–19లో 3.10 శాతం ఉండగా, 2022–23లో మే నెల నాటికి 2.83 శాతానికి తగ్గాయి. 2014–15లో ఇవి 3.37 శాతం ఉండేవి. అలాగే విద్యుత్ సరఫరా నష్టాలు 2020–21లో 7.5 శాతం ఉండగా, 2021–22లో 5 శాతానికి తగ్గాయి. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా 2021–22లో 11 శాతమే ఉన్నాయి. ఇలా సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు, మరింత నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వ సహకారంతో పనులు జరుగుతున్నాయి.’ – బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
లెక్క.. ఇక పక్కా!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో సరికొత్త సాంకేతికత రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి ఒక రోజు ముందు విద్యుత్ డిమాండ్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పవన విద్యుత్, సౌర విద్యుత్, మార్కెట్ సూచన, డిస్పాచ్ మోడల్, ఫ్రీక్వెన్సీ సూచనల కోసం 4 రోజుల ముందే డిమాండ్‌ను అంచనా వేసేలా ఎనర్జీ ఫోర్కాస్టింగ్ సాంకేతికత (నూతన సాఫ్ట్వేర్)ను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అభివృద్ధి చేసింది. భవిష్యత్ డిమాండ్‌ను ఎదుర్కొనేలా ఏపీ ట్రాన్స్‌కోకు ప్రస్తుతం 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 5532.161 సర్క్యూట్ కిలోమీటర్లు (సీకేఎం) ఉన్నాయి. మరో 12200.9 సీకేఎం 220 కేవీ లైన్లు ఉన్నాయి. 132 కేవీ లైన్లు 13568.18 సీకేఎం పొడవున విస్తరించాయి. వీటి ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏటా సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పంపిణీ జరుగుతోంది. వచ్చే మార్చినాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు అత్యధికంగా 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఏపీ ట్రాన్స్‌కో గ్రిడ్ నిర్వహణ విభాగం అంచనా వేసింది. ప్రస్తుత లైన్లపై అదనపు భారం మోపకుండా ఈ అసాధారణ పెరుగుదలను ఎదుర్కొనేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల్లో ‘ఎనర్జీ ఫోర్కాస్టింగ్’ కూడా ఒకటని ఏపీ ట్రాన్స్‌కో చెబుతోంది. ముందస్తు అంచనాలతో ప్రయోజనాలు విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక సంప్రదాయ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) కాలం నుండి స్వల్పకాలిక ఒప్పందాలు (షార్ట్ టెర్మ్ టెండర్లు) వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల అంచనా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎనర్జీ ఫోర్కాస్టింగ్ ద్వారా థర్మల్, సోలార్, విండ్, గ్యాస్ వంటి ప్రతి విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ నుండి డిస్కంలకు ఎంత విద్యుత్ పంపిణీ చేయాలో నాలుగు రోజుల ముందే తెలుసుకోవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఇది అప్డేట్ అవుతుంటుంది. అంతేకాదు తక్కువ ఖర్చుతో విద్యుత్ పంపిణీ ఎక్కడి నుంచి ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. పవర్ జనరేటర్లు, డిస్కంలు తగిన బిడ్డింగ్ వ్యూహాలను రూపొందించడానికి ధర అంచనా డేటాను ఉపయోగిస్తున్నాయి. జనరేటర్ల ధరల గురించి కచ్చితమైన సూచనను తెలుసుకొంటే దాని లాభాలను పెంచుకోవడానికి బిడ్డింగ్ వ్యూహాన్ని రూపొందించవచ్చు. అలాగే మరుసటి రోజు కచ్చితమైన ధర ఎంతో అంచనా వేయగలిగితే డిస్కంలు సొంత ఖర్చులను తగ్గించుకోవడానికి వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ఖర్చు తగ్గుతుంది పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లలో, ఫ్రీక్వెన్సీ సూచనలు తెలుసుకోవడంలో జాతీయ స్థాయిలో విద్యుత్ రంగ నిపుణుల సహకారంతో నాలుగు రోజుల ముందే అంచనాలు రూపొందించడానికి ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాం. గ్రిడ్ డిమాండ్‌ను తీర్చడానికి, అతి తక్కువ తేడాతో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయడానికి ఎనర్జీ ఫోర్కాస్టింగ్ మోడల్ ఉపయోగపడుతుంది. దీనిద్వారా బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్‌ను కొనొచ్చు. తద్వారా విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. –బీ శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
సామాన్యుడిపై భారం లేకుండా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతేడాది అక్టోబర్‌లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సమర్పించిన 2022–23 అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్) ప్రతిపాదనలపై బుధవారం నిర్ణయం వెలువడనుంది. డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో పేద, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారంలేదు. పైగా గతంలో కంటే తక్కువ రేట్లు వసూలుచేస్తామని తెలిపాయి. దానికి తగ్గట్లుగానే ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తిరుపతి వేదికగా బుధవారం కొత్త టారిఫ్‌ను ప్రకటించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన డిస్కంలను గట్టెక్కించడంతో పాటు సామాన్యులపై అధిక భారంలేకుండా చార్జీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పేద, మధ్య తరగతికి ఊరట డిస్కంల ప్రతిపాదనల ప్రకారం.. ► నెలవారీ వినియోగం 30 యూనిట్ల వరకు ఉన్న గృహ విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన పెంపులేదు. ► 31–75 యూనిట్లు ఉన్న వినియోగదారులకు చాలా స్వల్పంగా అంటే కేవలం యూనిట్‌కు 20 పైసలు పెంచాలని మాత్రమే డిస్కంలు ప్రతిపాదించాయి. ► నెలవారీ వినియోగం 201–300 మధ్య చార్జీలు యూనిట్‌కు రూ.0.10 పైసలు, 301–400 మధ్య రూ.0.45 పైసలు, 401–500 మధ్య ఒక రూపాయి తగ్గించగా, 500 యూనిట్లు మించిన వినియోగానికి రూ.2.45 చొప్పున తగ్గిస్తూ ప్రతిపాదించాయి. ► వీటిపై విశాఖపట్నంలో ఏపీఈఆర్సీ ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టింది. ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు పెరగడం, విద్యుత్ ఉత్పత్తిదారులకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోవడం, రుణాలు కూడా తీసుకోలేనంతగా వాటి రుణ పరిమితులు దాటిపోవడం, వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా అధిక రేట్లతో పీపీఏల ద్వారా విద్యుత్ కొనుగోలు వంటివన్నీ కలిసి డిస్కంలను 2019 నాటికే నడిరోడ్డున నిలబెట్టేశాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో 30,742 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్‌ను బ్యాక్‌డౌన్ చేసిన గత టీడీపీ ప్రభుత్వం.. తనకు నచ్చిన కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఆదాయ, వ్యయాల మధ్య తేడా (రెవెన్యూ గ్యాప్) 24.18 శాతం పెరిగింది. వినియోగదారులకు సరఫరా చేసిన విద్యుత్ సరాసరి వ్యయం యూనిట్‌కు రూ.6.92 ఉండగా, దానిపై విద్యుత్ సంస్థలకు వచ్చేది యూనిట్‌కు రూ.5.25 మాత్రమే. అంటే యూనిట్‌కు రూ.1.67 లోటు ఉంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల ఆదాయం కోల్పోతున్నాయి. మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ విద్యుత్ సంస్థలు తేరుకోలేకపోతున్నాయి. రుణాలిచ్చిన సంస్థల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ లోటును కొంతైనా పూడ్చకపోతే విద్యుత్ సంస్థల మనుగడ కష్టం. – జె. పద్మజనార్ధనరెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ మన రాష్ట్రంలోనే తక్కువ పేదలను మినహాయించి మిగిలిన వినియోగదారులకు సంబంధించిన విద్యుత్ చార్జీలపై ప్రతిపాదనలనే ఏపీఈఆర్సీకి సమర్పించాం. జాతీయ స్థాయిలో విద్యుత్ చార్జీలను పోల్చిచూస్తే ఏపీలోనే తక్కువ ధరలతో గృహ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. – కె. సంతోషరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఖర్చులు పెరిగిపోయాయి గృహ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, విద్యుత్ కొనుగోలు, నిర్వహణ వ్యయం ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. దానిని టారిఫ్‌తో భర్తీచేయాలి. – హెచ్.హరనాథరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ -
త్వరగా కడితే తక్కువే!
సాక్షి, అమరావతి: ప్రతి నెలా విద్యుత్ బిల్లు చేతికందగానే చాలామంది చేసే తప్పు.. దాన్ని సకాలంలో చెల్లించకపోవడం. ‘కడదాంలే’ అని బిల్లును పక్కనపెట్టి మర్చిపోతుంటారు. ఇలా బిల్లు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంతో వారికి అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇలా కాకుండా కరెంట్ బిల్లుని నిర్దేశిత సమయంలోగా కడితే సర్‌చార్జ్, ఇంధన చార్జ్, జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ లోగా కట్టేస్తే సరి.. రాష్ట్రంలో తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.91 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరంతా రోజుకి 229 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అయితే నెలవారీ బిల్లులు చెల్లించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. ప్రతి నెల 1 నుంచే స్పాట్ బిల్లింగ్ రీడర్లు ఇళ్లకు వచ్చి విద్యుత్ మీటర్ నుంచి రీడింగ్ తీసి వినియోగదారులకు బిల్లు అందిస్తున్నారు. ఆ బిల్లు తీసిన రోజు నుంచి 14 రోజుల్లోపు బిల్లు కట్టేస్తే ఏ సమస్య ఉండదు. పైగా రూ.35 నుంచి రూ.85 వరకు ఆదా కూడా చేయొచ్చు. సకాలంలో కట్టకపోతే ఏం జరుగుతుందంటే ఒక విద్యుత్ సర్వీస్‌కి రూ.100 బిల్లు వస్తే.. ఆ బిల్లును ప్రతి నెల 1న తీస్తే 14లోగా, 5న తీస్తే 19లోపు చెల్లిస్తే వినియోగదారుడిపై తర్వాత నెలలో రూ.25 సర్ చార్జ్, రూ.10 ఇంధన చార్జ్ పడదు. అదే బిల్లును ఒక వారం తర్వాత చెల్లిస్తే ఆ తర్వాత నెలలో రూ.100 బిల్లుకు సర్‌చార్జ్, ఇంధన చార్జ్ కలిపి రూ.135 బిల్లు వస్తుంది. ఒకవేళ ఆ వారానికి కూడా అనివార్య కారణాలతో బిల్లు కట్టలేకపోతే రూ.135కు ఇంకొక రూ.50 ఆలస్య రుసుం కలిపి మొత్తం రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే అనర్థమే.. గతంలో విద్యుత్ సిబ్బంది గ్రామాలకే వచ్చి విద్యుత్ బిల్లులు కట్టించుకునేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం కావడంతో ఆన్లైన్లోనే విద్యుత్ బిల్లు కట్టే అవకాశం ఉంది. అయినా చాలామంది ఆలస్యం చేస్తున్నారు. దీనివల్ల బిల్లు ఎక్కువ రావడంతో డబ్బులు వృథా కావడమే కాకుండా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి బిల్లు అందిన 14 రోజుల్లోపు చెల్లించేస్తే మంచిదని అధికారులు చెబుతున్నారు. -
చీ‘కట్’లకు స్వస్తి.. వేసవిలో 24 గంటలూ విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవిలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) చర్యలు తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ డిస్కంలో విద్యుత్ డిమాండ్ లోడు సుమారు 5,010 మెగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిస్కం పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 24/7 అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ పవర్ సిస్టం స్కీం (ఐపీడీఎస్) కింద విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నిర్మిస్తున్న ఎనిమిది జీఐఎస్ కొత్త ఇండోర్ సబ్స్టేషన్ల (33/11కేవీ)ను అందుబాటులోకి తెస్తోంది. చదవండి: ఉల్లి రైతుకు ఊతం విజయవాడ భవానీపురం, కాళేశ్వరరావునగర్, రామలింగేశ్వరనగర్, గుంటూరు జిల్లా నిడమర్రు, మంగళగిరి, కుంచనపల్లి, గుంటూరు నెహ్రూనగర్, టీచర్స్ కాలనీల్లో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.54.29 కోట్లు వెచ్చించింది. రూ.98.20 కోట్లతో నిర్మిస్తున్న 33/11 కేవీ సామర్థ్యం ఉన్న 32 కొత్త అవుట్ డోర్ సబ్స్టేషన్ల పనులను వేగవంతం చేస్తోంది. వివిధ సబ్స్టేషన్లలో 52 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతిపాదించింది. విద్యుత్ సరఫరా మెరుగు కోసం 33 కేవీ లైన్ల పనులు 35, 11 కేవీ లైన్లకు సంబంధించి 145 పనులు శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించింది. అదనంగా 512 త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, 703 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసింది. వీటితో పాటు 33 కేవీ, 11 కేవీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, మరమ్మతు పనులను సీపీడీసీఎల్ అధికారులు ముమ్మరం చేశారు. అధిక లోడ్ నియంత్రణ మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల భద్రత చర్యల్లో భాగంగా ఎంసీసీబీ బాక్సుల ఏర్పాటు సత్వరమే పూర్తయ్యేలా చూస్తున్నారు. ఇలా వేసవి డిమాండ్, అవసరాలను బేరీజు వేసుకుని అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడ్తున్నారు. వేసవిలో అధిక లోడు పంపిణీ జరిగి టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, ఏసీలు వంటి విలువైన గృహోపకరణాలు కాలిపోకుండా సక్రమంగా విద్యుత్ పంపిణీ జరిగేలా డిస్కం సిబ్బంది నిరంతరం లోడ్‌ను పర్యవేక్షిస్తారు. వ్యవసాయ ఫీడర్లకు 9 గంటల విద్యుత్ డిస్కం పరిధిలోని వ్యవసాయ పంపుసెట్లకు పగటి పూట తొమ్మిది గంటలు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా జరిగేలా రూ.117.07 కోట్లను వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు ప్యాకేజీల్లో రూ.83.30 కోట్లు ఖర్చు చేశారు. ఇలా మొత్తం 1,400 వ్యవసాయ ఫీడర్లలో 1,392 ఫీడర్లు పగలు తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరాకు వీలుగా అభివృద్ధి చేశారు 24/7 విద్యుత్ సరఫరా.. ప్రభుత్వ ఆదేశాలతో వేసవిలో డిస్కం పరిధిలో 24/7 విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించాం. నిధుల కోసం వెనకడుగు వేయకుండా నిరంతరాయంగా విద్యుత్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరా మెరుగు పరుస్తాం. నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లను సత్వరమే పూర్తి చేస్తున్నాం. విద్యుత్ చౌర్యంతో ఆకస్మికంగా లోడ్ పెరిగి షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంది. డిస్కంనకూ నష్టం వాటిల్లుతుంది. అందువల్ల ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగితే వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. -జె. పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ -
ఎందుకీ కారు కూతలు! పాత ఫొటోలతో కరెంట్ కోతలంటూ రాతలు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఏపీఎస్పీడీసీఎల్ ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాధరావు స్పష్టం చేశారు. ‘ఎందుకీ కోతలు!’ శీర్షికన ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఖండిస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► కర్నూలు జిల్లా కోసిగి మండలంలో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎల్టీ కేబుల్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి అంతరాయాలు లేవు. ► రైతులకు 9 గంటల పాటు విద్యుత్ అందడం లేదన్న కథనంలో నిజం లేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► అనంతపురం జిల్లా మడకశిర మండలంలో మంగళవారం ఆర్టీపీపీలో కెపాసిటర్ ఓల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ సమస్య కారణంగా సబ్ స్టేషన్లు ట్రిప్ కావడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ► చిత్తూరు జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవు. ► అనంతపురం జిల్లాలో గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేవు. బుధవారం 18.227 ఎంయూల విద్యుత్‌ను సరఫరా చేశాం. ప్రతి నెలా రెండో శనివారం లేదా 3వ శనివారం సబ్ స్టేషన్లు, లైన్ల నిర్వహణ కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్‌లో దాదాపు 45 శాతం సౌర, పవన, ఇతర వనరుల స్థాపిత విద్యుత్ ఉంది. వీటి నుంచి వచ్చే విద్యుత్ ’తప్పక సేకరణ’ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో దాదాపు ఆరు నెలలు ఈ వనరుల నుంచి విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుంది. సౌర కేంద్రాల నుంచి సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ పగటి పూట మాత్రమే లభ్యత ఉంటుంది. ► రోజువారీ గ్రిడ్ డిమాండ్‌లో కేవలం 4 గంటలు (ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ సమయంలో) మాత్రమే కొంత వరకూ విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి బహిరంగ మార్కెట్ లో ముందురోజు బిడ్డింగ్ విధానంలో సమకూర్చుకుంటున్నాం. ఈ విధానంలో అందుబాటులోకి రాకపోతే రోజువారీ మార్కెట్లో కానీ అత్యవసర మార్కెట్లో కానీ విద్యుత్ సేకరించి కొనుగోలు చేస్తున్నాం. ► రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నంతవరకు ఎలాంటి బ్యాక్ డౌన్ లేకుండా విద్యుత్ సేకరిస్తున్నాం. ప్రస్తుతం ఏ విద్యుత్ కేంద్రాన్ని షట్ డౌన్ చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నా వినియోగదారుల సౌకర్యార్ధం ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం ప్రస్తుత రబీ సీజన్లో ఒక్క సెంటు భూమికి కూడా సాగు నీటి కొరత తలెత్తకుండా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. కోతలు లేవు.. నాణ్యమైన కరెంట్ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.జనార్దనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎందుకీ.. కోతలు!’ శీర్షికతో ఓ దినపత్రిక ప్రచురించిన కథనంలో నిజం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ కోతలతో సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయనడం అవాస్తవమన్నారు. బుట్టాయగూడెం విద్యుత్ శాఖ అధికారులు లోడ్ రిలీఫ్ కోసం కోతలు విధిస్తున్నారనడం కూడా అవాస్తవమేనని, విద్యుత్ అధికారులు అటువంటి వివరణ ఏదీ ఇవ్వలేదని వెల్లడించారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులందరికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన సిబ్బంది, సామగ్రి 24 గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పడిన అంతరాయాలను సరిదిద్ది త్వరితగతిన పునరుద్ధరిస్తున్నారని వివరించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తినప్పుడు వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేయాలని ఎస్ఈ కోరారు. మడకశిరలో కరెంట్ కోతలు లేవు అనంతపురం జిల్లా మడకశిరలో బుధవారం కరెంట్ కోతలు విధించారన్న వార్తల్లో నిజం లేదని హిందూపురం డివిజన్ డీఈ డి.భూపతి స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో సాంకేతిక సమస్యలతో మంగళవారం ఉదయం మాత్రం కొద్ది గంటలు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్ కోతలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం నిరాధారమని మడకశిర ఏడీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఆ ఫొటో... ఇప్పటిది కాదు నా ఫ్యాక్టరీలో కరెంటు లేకపోవడంతో కార్మికులు ఖాళీగా కూర్చున్నట్లు ఓ పత్రికలో ఫొటో ప్రచురించారు. అసలు ఆ ఫొటో ఇప్పటిది కాదు. ఇటీవల కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గురువారం ఓ ఛానల్ వాళ్లు వచ్చి విద్యుత్తు కోతల గురించి మాట్లాడాలని కోరారు. లేని వాటిని ఉన్నట్లు చెప్పడం అన్యాయం. అందుకు నేను ఒప్పుకోలేదు. బుధవారం కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. మంగళవారం మాత్రం రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈమేరకు మాకు ముందుగానే సెల్‌ఫోన్‌కు సమాచారం ఇచ్చారు. – ఆనంద్, టెక్ మనోరా ప్యాకింగ్ పరిశ్రమ యజమాని, మడకశిర ఆగింది అరగంటే.. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గలో విద్యుత్తు కండెక్టర్ తెగిపోవడంతో బుధవారం సాయంత్రం 6.40 నుంచి 7.14 వరకు 34 నిమిషాల పాటు కరెంట్ సరఫరా ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం సరఫరాను పునరుద్ధరించారు. ఇక్కడ కరెంట్ లేక రాత్రంతా గాడాంధకారం నెలకొందనే తరహాలో ఓ పత్రిక ఫోటోలు ప్రచురించింది. -
విద్యుత్ ఉద్యోగులకు ‘పీఆర్సీ’ ఏర్పాటు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల కోసం వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు(ఏపీఎస్ఈబీ) కింద నియమితులై ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సవరించేందుకు గానూ అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
అక్కడి నుంచే చెప్పండి
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల(టారిఫ్)పై ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) ప్రజాభిప్రాయాన్ని బహిరంగ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించనుంది. ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. సదస్సుల్లో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, పి.రాజగోపాల్‌తో పాటు రాష్ట్ర ఇంధన శాఖ, మూడు డిస్కంల అధికారులు పాల్గొంటారు. 2022–23 సంవత్సరానికి ‘ఏఆర్ఆర్’ సమర్పణ తక్కువ విద్యుత్ వినియోగించే వారిపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022–23 ఆర్థిక సంవత్సర రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ), అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గత ఏడాది డిసెంబర్ 13న ఏపీ ఈఆర్సీకి సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో మార్పులను చేయాల్సిన అవసరాన్ని ఇందులో వివరించాయి. వివిధ మార్గాల ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉందని వెల్లడించాయి. మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేశాయి. పరిశ్రమలకు నాన్ పీక్ అవర్స్‌లో టైం ఆఫ్ ది డే (టీఓడీ) పేరుతో యూనిట్‌కు 50 పైసల చొప్పున రాయితీ ఇచ్చేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. అవసరమైతే ఇదే విధానాన్ని గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని తెలిపాయి. కాగా, ఏపీ ఈఆర్సీ నిలిపివేసిన 2014–2019 ట్రూ అప్ చార్జీలను తిరిగి వసూలు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. కరోనా కారణంగా.. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్‌కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుంచే జరుపనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను నియంత్రణ మండలి స్వీకరిస్తుంది. విశాఖ వెళ్లక్కర్లేదు ఏపీఈఆర్సీకి విద్యుత్ చార్జీలపై అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వారు విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ (ఎస్ఈ ఆఫీస్), డివిజన్ కార్యాలయం (డీఈ ఆఫీస్) ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రతిరోజు ముందుగానే నమోదు చేసుకున్న వారి నుంచి అభ్యంతరాలు విన్న తరువాత, నమోదు చేసుకోని వారు మాట్లాడేందుకు ఏపీ ఈఆర్సీ అనుమతిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు ‘సాక్షి’కి చెప్పారు. -
ఇంట్లోనే వాహన చార్జింగ్
సాక్షి, అమరావతి: ఇకపై విద్యుత్ వాహనాన్ని ఇంట్లోనే చార్జింగ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడో ఉన్న చార్జింగ్ కేంద్రాలకు వెళ్లి, సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పని ఉండదు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వాతావరణ, వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే, వీటికి చార్జింగ్ ప్రధాన సమస్య కావడంతో ఎక్కువ మంది కొనడంలేదు. దీంతో ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏర్పాటు చేసిన విద్యుత్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఇంటిలోనో, ఆఫీసులోనో సెల్‌ఫోన్ మాదిరిగానే చార్జింగ్ పెట్టుకోవచ్చు. గృహాలు, ఆఫీసుల వినియోగానికి వర్తించే టారిఫ్ ప్రకారమే చార్జీ చెల్లించాలి. ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ (పీసీఎస్)లకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించిన విధంగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఉండాలి. వీటికి సర్వీస్ చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్రంలో లక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా 9,47,876 విద్యుత్ వాహనాలు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) నివేదిక ప్రకారం చార్జింగ్ స్టేషన్లు 1,028 మాత్రమే ఉన్నాయి. 2030 నాటికి దేశంలో ప్రైవేటు కార్లు 30 శాతం, వాణిజ్య వాహనాలు 70 శాతం, బస్సులు 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు 80 శాతం ఈవీలుగా మార్చాలనేది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటికి వీటి సంఖ్యను 10 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం రాష్ట్రంలో 2030కి లక్ష చార్జింగ్ కేంద్రాలు నెలకొల్పాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున తొలి దశలో మొత్తం 300 చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. వచ్చే ఫిబ్రవరి నాటికి 60 కేంద్రాలను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వీటి ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో పీసీఎస్‌ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. యూనిట్‌కు రూ.12 చొప్పున వసూలు చేసి, దాని నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి. -
భవిష్యత్తు ‘వెలుగు’లకు భరోసా
సాక్షి, అమరావతి: సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్‌కు చెందిన సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియాతో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) కుదుర్చుకున్నాయి. 12 ఏళ్ల పాటు డిస్కంలకు ఈ సంస్థ 625 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది (2023) నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ వనరుల నుంచి 8,075 మెగావాట్లు వస్తోంది. కానీ వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఏడాదిలో ఎక్కువ రోజులు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లుగా ఉంది. ఈ థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సమకూర్చేందుకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి సంస్థలతోపాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. ఇలా సమకూర్చుకున్న బొగ్గు మన థర్మల్ ప్లాంట్ల మొత్తం అవసరాలలో 70 నుంచి 75 శాతం తీర్చగలుగుతాయి. జెన్కో బొగ్గు ప్లాంట్లకి రోజుకు దాదాపు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. గతేడాది దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రంగా వేధించింది. గత ఏడాది సెప్టెంబర్ ఆఖరులో రోజుకు 24 వేల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం బొగ్గు కొరత సమయంలో రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్లు నడపడం దాదాపు అసాధ్యమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలు చెల్లించైనా సరే విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ సంస్థలకు సూచించారు. అప్పుడు మార్కెట్లో యూనిట్‌కు రూ.20 వెచ్చించి విద్యుత్ కొన్నారు. సాధారణ రోజుల్లో ఈ రేటు రూ.6 వరకు ఉంటుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాదని చెప్పలేం. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను, రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెంబ్‌కార్ప్‌తో ఒప్పందం చేసుకున్నారు. యూనిట్ ధర రూ.3.84 నెల్లూరులో సెంబ్‌కార్ప్ ఎనర్జీకి 2.6 గిగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ థర్మల్ ప్లాంట్ సామర్థ్యంలో 77 శాతం విద్యుత్‌ను దీర్ఘకాలిక, మధ్యకాలిక పీపీఏల ద్వారా డిస్కంలకు ఇస్తోంది. మనకు యూనిట్ రూ.3.84కు ఇవ్వనుంది. – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి ఏపీఅభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషం పునరుత్పాదక శక్తిలో సెంబ్‌కార్ప్ తన ఉనికిని వేగంగా పెంచుకుంటోంది. మేం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి ఏపీ డిస్కంలతో జరిగిన దీర్ఘకాలిక ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – విపుల్ తులి, సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ దక్షిణాసియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
ఇకపై ఏటా చార్జీల వడ్డన!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు ఇక ఏటా పెరుగుతాయా? ఏటా నిర్దేశిత గడువులోగా వార్షిక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు భారీ జరిమా నాలు విధించనుండటం ఈ ప్రశ్నకు తావి స్తోంది. జరిమానాలకు సంబంధించిన ముసా యిదా మార్గదర్శకాలను ఈఆర్సీ గురువారం ప్రకటించింది. ఏటా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో పాటు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ), వార్షిక పనితీరు సమీక్ష, ట్రూఅప్ చార్జీలు, వనరుల ప్రణాళిక, రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక, వ్యాపార ప్రణాళిక ప్రతిపాదనలు , మూలధన పెట్టుబడి ప్రణాళికలను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని స్పష్టం చేసింది లేనిపక్షంలో.. తొలి 30 రోజుల జాప్యానికి రోజుకు రూ.5,000 చొప్పున జరిమానాలను విధించనుంది. 30 రోజుల తర్వాత అదనంగా రూ.1.50 లక్షలతో పాటు రోజుకు రూ.10 వేలు చొప్పున జరిమానాను సంబంధిత ప్రతిపాదనలు సమర్పించే వరకు వసూలు చేయనుంది. ఈ ముసాయిదా నిబంధనలపై ఈ నెల 27లోగా సలహాలు, సూచనలు తెలపాలని ఈఆర్సీ కోరింది. పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయాన్ని రాబట్టుకోవడానికి ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా రాష్ట్రాలను కోరుతోంది. చార్జీల పెంపు ద్వారా మొత్తం వ్యయాన్ని రాబట్టుకో వాల్సిందేనని, నష్టాలు మిగల్చడానికి వీల్లేదని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ఈఆర్సీలు ఇప్పటికే ఈ నిబంధనలను అమలు చేస్తున్నాయి. నవంబర్ 30లోగా సమర్పించాల్సిందే నిబంధనల ప్రకారం ఏటా నవంబర్ 30లోగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను ఈఆర్సీకి రాష్ట్రాల డిస్కంలు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే విద్యుత్ చార్జీల పెంపుతో వచ్చే వ్యతిరేకత, విమర్శలకు భయపడి డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు అనుమతించడం లేదు. కానీ తాజాగా ఈఆర్సీ తీసుకొచ్చిన జరిమానాల నిబంధనలతో నిర్దేశిత గడువులోగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటా చార్జీల వడ్డన తప్పదనే అభిప్రాయాన్ని విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
AP: పరిశ్రమలకు ‘పవర్’ రాయితీ!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చులో మిగిలిన మొత్తాన్ని ట్రూ డౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తొలిసారిగా 2021లో రూ.125 కోట్లు వెనక్కిచ్చిన రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022లో అమలయ్యేలా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చాయి. విద్యుత్ డిమాండ్‌లేని సమయాల్లో భారీ పరిశ్రమలకు వినియోగించిన విద్యుత్‌పై యూనిట్‌కు రూ.0.50 పైసల చొప్పున ప్రత్యేక రాయితీ ఇస్తామంటున్నాయి. డిమాండ్ లేని వేళలు.. 2006లో డిస్కంలు.. డిమాండ్‌ను బట్టి విద్యుత్ చార్జీల విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. సా.6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసే విద్యుత్‌పై టైం ఆఫ్ ది డే (టీఓడీ) టారిఫ్ పేరుతో చార్జీలు వసూలుచేస్తున్నాయి. ఇందులో కొన్ని మార్పులు చేస్తూ.. డిమాండ్ లేని వేళలు ఉ.10 గంటల నుంచి మ.3 గంటల వరకు, అదే విధంగా రాత్రి 12 గంటల నుంచి ఉ.6 గంటల వరకు వినియోగించే విద్యుత్‌పై రిబేట్ ఇవ్వాలనేది డిస్కంల ఆలోచన. అంతేకాక.. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ డిమాండ్ లేని వేళల్లో రాయితీ ఇవ్వడానికీ సంసిద్ధంగా ఉన్నాయి. సమతూకం కోసమే.. విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంట్ కొనుగోలు కోసం విద్యుదుత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ప్రకారం రోజులో కొన్ని గంటలకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే కుదరదు. 24 గంటల చొప్పున సరఫరా తీసుకోవాల్సిందే. దీనివల్ల డిమాండ్ లేని వేళల్లో కూడా జెన్కోలకు చెల్లించే చార్జీలు భారంగా మారుతున్నాయి. అదే విధంగా పీక్ అవర్స్‌లో ఒకేసారి అందరూ విద్యుత్ వినియోగించడంవల్ల గ్రిడ్‌పై భారం పడి తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రెండిటినీ సమతుల్యం చేయడానికి డిస్కంలు పరిశ్రమల్లో విద్యుత్ వినియోగాన్ని రాత్రివేళ ప్రోత్సహించాలని భావిస్తున్నాయి. దీనివల్ల పీక్ అవర్స్‌లో లోడ్ తగ్గుతుంది. పరిశ్రమలు ఏ, బీ, సీ షిఫ్టుల్లో పనిచేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పరిశ్రమల్లో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. విద్యుత్ వినియోగం పెరగడంవల్ల డిస్కంలకు బిల్లుల రూపంలో ఆదాయం వస్తుంది. దీంతో జెన్కోలకు చెల్లించే చార్జీల్లో సమతూకం వస్తుంది. ఈ నెలలోనే విచారణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి 2022–23 ఆర్థిక సంవత్సర వార్షిక సగటు ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు గత డిసెంబర్లో కొన్ని ప్రతిపాదనలు సూచించాయి. వీటిల్లో టీఓడీ కూడా ఒకటి. ఏఆర్ఆర్పై ఈ నెల 24, 25, 27 తేదీల్లో ఏపీఈఆర్సీ విశాఖపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, మార్చి చివరి వారంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏఆర్ఆర్ అమల్లోకి వస్తుంది. – కె. సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
‘ఏపీఈపీడీసీఎల్’ ఆదాయానికి ‘చెక్’!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంసలో చెక్కుల మాటున సాగుతున్న గోల్మాల్ మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజుల కిందట శ్రీకాకుళం సర్కిల్లో చెక్కులు చెల్లించిన హెచ్‌టీ వినియోగదారులపై సర్‌చార్జి వేసి, వసూలైన సొమ్మును పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. అలానే విశాఖ సర్కిల్ పరిధిలో జరిగిన అవకతవకలపై సర్కిల్ రెవెన్యూ అధికారులు తాజాగా అవినీతి నిరోధక శాఖకు, ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు 62 పేజీల సమగ్ర నివేదికను అందజేశారు. 13 మందిపై ఆరోపణలు విశాఖపట్నంలోని ఓ భారీ పరిశ్రమ ప్రతినెలా విశాఖ సర్కిల్ కార్యాలయానికి అందజేసిన తమ విద్యుత్ బిల్లులకు సంబంధించిన చెక్కులు 2017, 2018 సంవత్సరాల్లో సకాలంలో నగదుగా మారలేదు. గడువు తేదీ ముగిశాక ఒక రోజు నుంచి ఐదు రోజులకు జమ అయ్యేవి. నిజానికి నిర్ణీత గడువు పూర్తయ్యాక చెల్లించే బిల్లులపై లేట్ పేమెంట్(ఎల్పీ) చార్జి వసూలు చేయాలి. కానీ అలా జరగకుండా నగదు వచ్చినట్టుగానే అప్పట్లో విశాఖ సర్కిల్ అధికారులు రికార్డుల్లో నమోదు చేసేశారు. దీంతో డిస్కంకు రావాల్సిన ఎల్పీ ఆదాయం పోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఫిర్యాదు అందడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు, ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విశాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో) ప్రసన్నకుమార్‌కు విశాఖ సర్కిల్ అధికారులు తాజాగా అందించారు. దాదాపు రూ.15 లక్షలు ఎల్పీ నష్టం జరిగినట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఆ రెండేళ్ల కాలంలో పనిచేసిన సీనియర్, జూనియర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లతో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను బాధ్యులుగా తేల్చారు. కేసు విచారణను వారంలోగా పూర్తి చేస్తామని చీఫ్ విజిలెన్స్ అధికారి ఏవీఎల్ ప్రసన్నకుమార్ చెప్పారు. కాగా, ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొంత మంది కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు లబ్ధి పొందాలని చూస్తున్నట్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి చెప్పాడు. ఓ కంపెనీకి కొన్ని వెసులుబాట్లు కల్పించిన మాట వాస్తవమని తెలిపారు. కానీ అవి కేవలం కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేసినట్టు తెలిపాడు. శ్రీకాకుళం వ్యవహారంలో త్వరలో చర్యలు ఇదిలా ఉండగా, శ్రీకాకుళం రెవెన్యూ కార్యాలయం(ఈఆర్వో)లో హెచ్‌టీ వినియోగదారుల నుంచి చెక్కులు తీసుకుని సకాలంలో బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. ఫలితంగా వారిపై ఎల్పీ పడింది. కొంత మంది గొడవెందుకని ఆ మొత్తాన్ని చెల్లించేశారు. కానీ ఆ సొమ్ము సంస్థకు చేరలేదు. దీనిపై అక్కడి ఎస్ఈ మహేందర్‌తో పాటు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. బాధ్యులపై చర్యలకు డిస్కం సీఎండీకి సిఫారసు చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈఆర్వో అక్రమార్కులపై వేటు పడే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు.. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నం సర్కిల్లో జరిగిన చెక్కుల వ్యవహారం గత సీఎండీల కాలంలోనిది. దానిపైనా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. తప్పుచేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదు. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
సెకీ విద్యుత్ కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రానికి నోటీసులు
సాక్షి, అమరావతి: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు, ఏపీ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండళ్లకు కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఏటా 7 వేల మెగా వాట్లను యూనిట్ రూ.2.49కే కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. దీనిని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తక్కువ ధరకు సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కాదని ఎక్కడో రాజస్తాన్‌లో ప్లాంట్లు ఏర్పాటు చేసిన సెకీ నుంచి ఎక్కువ రేటుకు కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో సౌర విద్యుత్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. మంత్రి మండలి నిర్ణయం వల్ల ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రతి ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. -
విచారణార్హత లేదు.. డిస్కంలకు షాక్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు విద్యుత్ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. గత మూడేళ్లకు సంబంధించి దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలు విచారణార్హమైనవి కావంటూ వెనక్కు పంపింది. డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్ల విచారణార్హతపై సోమవారం విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎం.డి.మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యలు విచారణ నిర్వహించారు. ఈ విచారణకు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డితోపాటు డిస్కంల తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. ఈ నివేదికల్లో టారిఫ్ (విద్యుత్ చార్జీల పెంపు) ప్రతిపాదనలను సమర్పించనందున ఏఆర్ఆర్లను విచారణ జరపాల్సిన అవసరం లేదని మం డలి సభ్యులు తేల్చారు. ఒకవేళ మూడేళ్ల టారిఫ్ ప్రతిపాదనలు సమర్పిస్తే విచారణ జర పాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భాగస్వామ్యపక్షాల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణ యిస్తామని వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోందని, 10 రోజుల గడువు ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీని కోరగా వారంకన్నా ఎక్కువ సమయం ఇవ్వలేమని ఈఆర్సీ తేల్చిచెప్పింది. ఈ నెల 27లోగా ప్రతిపాదనలను కండోల్ పిటిషన్ రూపంలో సమర్పించా లని ఆదేశించింది. టారిఫ్ ప్రతిపాదనలు డిస్కంలు ఇవ్వకపోయినా తామే సుమో టోగా తీసుకొని విచారణ జరిపే అధికారాల గురించి కూడా ఈఆర్సీ అన్వేషిస్తోంది. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ అలా జరగలేదని, డిస్కంలు ప్రతిపాదించకుండా టారిఫ్ ఉత్తర్వులు ఈఆర్సీ ఇవ్వజాలదని, యూపీలో డిస్క ంలకు జరిమానా మాత్రం విధించారని ఈఆర్సీ చైర్మన్ దృష్టికి నిపుణులు తీసుకువచ్చారు. దీంతో ఏం చేయాలన్న దానిపై ఈ నెల 27 వరకు ఈఆర్సీ వేచిచూసే ధోరణిలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆమోదిస్తేనే...: వాస్తవానికి చాలాకాలం తర్వాత ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏఆర్ఆర్లను దాఖలు చేశాయి. ఈ ఏడాది నవంబర్ 30న 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల ఏఆర్ఆర్లను దాఖలు చేసినా టారిఫ్ ప్రతిపాదనలు చేయలేదు. దీంతో ఈ నెల 10లోగా ప్రతిపాదించాలని ఈఆర్సీ డిస్కంలకు నోటీసులిచ్చింది. టారిఫ్ ప్రతిపాదనలకు సంబంధించి మంత్రుల స్థాయిలో మూడుసార్లు సమావేశం జరగ్గా ముసాయిదా ప్రతిపాదనలకే మోక్షం లభించింది. ఈ ముసాయిదాను కేసీఆర్ ఆమోదించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఆర్సీ ఈ నెల 27 వరకు గడువిచ్చింది. ఆలోగా సీఎం ఆమోదిస్తేనే ప్రతిపాదనలు సమర్పించగలమని అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాలతో వెనక్కి.. 2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. వినియోగదారులకు రూ.196.28 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి. ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోకి వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కింది. -
జల మండలికి విద్యుత్‌తో.. రూ.999 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జల మండలికి రాయితీ విద్యుత్ సరఫరా వల్ల గత నాలుగేళ్లలో ఏకంగా రూ.999.53 కోట్లు నష్టాలను మూటగట్టుకున్నట్టు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లు వెల్లడించాయి. టారిఫ్ సబ్సిడీల రూపంలో ఈ నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపాయి. తమ ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకు ని ఈ మేరకు నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. జలమండలి కోసం రేటు తగ్గించి.. జలమండలి గతంలో విద్యుత్ చార్జీల కింద యూనిట్‌కు.. పరిశ్రమల కేటగిరీ (హెచ్‌టీ–1ఏ) పరిధిలో 11 కేవీ సరఫరాకు రూ.6.65.. 33కేవీ సరఫరాకు రూ.6.15.. సీపీడబ్ల్యూఎస్ (హెచ్‌టీ–4బీ) కేటగిరీ పరిధిలో అన్నివోల్టేజీ స్థాయిలకు రూ.5.10 చొప్పున చెల్లించేది. అయితే హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చులతో పోల్చితే... ప్రజల నుంచి వసూలు చేస్తున్న నీటిచార్జీలు తక్కువగా ఉండడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని, విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గించాలని జలమండలి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2018–19లో రూ.299.95 కోట్లు, 2019–20లో రూ.577.49 కోట్లు, 2020–21లో రూ.543.84 కోట్లు కలిపి మొత్తం రూ.1,421.28 కోట్లు నష్టాలు వచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. జలమండలికి సరఫరా చేసే విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గిస్తూ 2020 జూలైలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన చార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు తిరిగి చెల్లించాలని కోరింది. 2018–19 నాటి బిల్లుల నుంచి ఇప్పటిదాకా ఈ తగ్గింపును వర్తింపజేసింది. ఈ మేరకు డిస్కంలు జలమండలికి విద్యుత్ టారిఫ్‌ను తగ్గించినా.. బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ విడుదల కాలేదు. దీనివల్ల ఈ నాలుగేళ్లలో రూ.999.53 కోట్లు నష్టపోయినట్టు డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి. సబ్సిడీ కొనసాగించాలన్న విజ్ఞప్తితో.. సబ్సిడీ టారిఫ్‌ను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తిని తాజాగా ఈఆర్సీ తోసిపుచ్చింది. ‘వార్షిక టారిఫ్ ఉత్తర్వులు 2021–22’జారీచేసే వరకు జలమండలి సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే యథాతథంగా అమల్లో ఉంటాయని గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. 2021–22 టా రిఫ్ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చే సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. -
డిస్కంలపై ‘దివాలా’ పిడుగు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డి స్కం)లు కొత్తగా ‘దివాలా’ముప్పు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ డిస్కంలకు కూడా దివాలా స్మృతి సంపూర్ణంగా వర్తిస్తుందని.. దివాలా వ్యా పార పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్/సీఐఆర్‌పీ) కింద వాటిపై చర్యలు తీసుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. దీనితో అప్పులు, బకాయిలు చెల్లించడంలో విఫలమైన డిస్కంలను దివాలా తీసినట్టు ప్రకటించి, వాటి ఆస్తుల వేలం ద్వారా తమ బకాయిలు ఇప్పించాలంటూ.. బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని కోరేందుకు వీలు కలుగనుంది. నిజానికి ప్రభుత్వ రంగ డిస్కంలు విద్యుత్ చట్టం పరిధిలోకి వస్తాయని, వాటికి ‘దివాలా స్మృతి’వర్తించదని రాష్ట్రాలు వాదిస్తూ వచ్చాయి. బకాయిలు కట్టని డిస్కంలపై విద్యుత్ చట్టం కింద బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు చర్యలు తీసుకునేవి. జరిమానాలతో బకాయిలు వసూలు చేసేందుకు ప్రయత్నించేవి. కానీ ఇకపై డిస్కంలకు గడ్డుకాలమేనని నిపుణులు చెప్తున్నారు. రుణాలు, బకాయిల భారంతో.. దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు, బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు ధరల్లో పెరుగుదలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపు లేకపోవడం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు వందలకోట్ల మేర పేరుకుపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరిపడా విద్యుత్ సబ్సిడీలు అందకపోవడం వంటి కారణాలతో డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాయి. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు కొనే విద్యుత్‌కు 45 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. కానీ నిధుల్లేక నెలలు, ఏళ్ల తరబడిగా కట్టలేకపోతున్నాయి. ►కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారమే.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు రంగ విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.98,518 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.7,888 కోట్లు. వీటితోపాటు తెలంగాణ జెన్కో, సింగరేణి థర్మల్ ప్లాంట్లకు చెల్లించాల్సిన సొమ్ము కూడా కలిపితే.. తెలంగాణ డిస్కంల బకాయిలు రూ.20 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిస్కంలు రూ.36 వేల కోట్ల మేర అప్పులు చేశాయి. ►డిస్కంల నుంచి సకాలంలో చెల్లింపులు రాక విద్యుదుత్పత్తి కంపెనీలు బొగ్గు కొనుగోళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ.. గతంలోనే తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. -
నగరాల్లో నిరంతర కరెంట్
సాక్షి, హైదరాబాద్: మెట్రోలు, పెద్ద నగరాల్లో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంతరాయాలు లేకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి రానుంది. సరఫరాలో అంతరాయం కలిగితే డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గురువారం విద్యుత్ (వినియోగదారుల హక్కుల) నిబంధనల సవరణ ముసాయిదా–2021ను ప్రకటించింది. పెద్ద నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో డీజిల్ జనరేటింగ్ సెట్ల వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ముసాయిదాపై అక్టోబర్ 21లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని కోరింది. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. తెరపైకి కొత్తగా విశ్వసనీయత చార్జీలు పెద్ద నగరాల్లో వినియోగదారులు డిస్కంలు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా నగరాలకు సంబంధించి..సగటు అంతరాయాల పునరావృతం సూచిక, సగటు అంతరాయాల వ్యవధి సూచికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రూపకల్పన చేయనుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరముంటే, అందుకు అవసరమైన పెట్టుబడిని వినియోగదారుల నుంచి ‘రిలయబిలిటీ (విశ్వసనీయత) చార్జీల’పేరుతో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించనుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైతే డిస్కంలకు ఈఆర్సీ జరిమానాలు విధించనుంది. ఐదేళ్లలో జనరేటర్లు మాయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బ్యాకప్‌గా డీజిల్ జనరేటర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ ముసాయిదా అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లలోగా, లేదా రాష్ట్ర ఈఆర్సీ నిర్దేశించిన కాల వ్యవధిలోగా బ్యాటరీలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ వంటి కాలుష్య రహిత టెక్నాలజీకి మారాలి. సంబంధిత నగరంలో డిస్కంల విద్యుత్ సరఫరా విశ్వసనీయత ఆధారంగా ఈఆర్సీ ఈ గడువును నిర్దేశిస్తుంది. నిర్మాణ కార్యకలాపాలు, ఇతర తాత్కాలిక అవసరాలకు దర ఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేయాల్సి ఉండనుంది. -
విద్యుత్ సంస్థలు చట్టాన్ని అనుసరించాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు చట్టం పరిధిలోనే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి చెప్పారు. విద్యుత్ చట్టం–2003 సెక్షన్ 88 ప్రకారం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. వర్చువల్‌గా సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు ఏపీఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్ రామసింగ్ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి, సలహామండలిలోని 16 మంది సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు పౌరసేవల ప్రమాణాలను (ఎస్‌వోపీని) సవరించినట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యంపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు డిస్కంలు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సీ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. డిస్కంలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమంగా ప్రయోజనాలు అందించాలని ఆయన సూచించారు. సేవా ఖర్చు తగ్గింపు, విద్యుత్ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, మెరుగుపరచడం, డిస్కంల పనితీరు, ప్రజల సమర్థమైన భాగస్వామ్యం, నియంత్రణ నిర్ణయ ప్రక్రియ, విద్యుత్ లైన్లు పంట చేలపై నుంచి వేయాల్సి వచ్చినపుడు రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యుల సూచనలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. -
విద్యుత్ పంపిణీ సంస్థలకు.. టీడీపీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: ట్రూ–అప్ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక్క ఏడాదిలోనే రూ.6,000 కోట్లు అదనంగా వసూలుచేస్తున్నాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. అవి పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి విద్యుత్ వాడకపోయినా కట్టవలసి వచ్చే నెలవారీ కనీస చార్జీలు రద్దుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2014 నుండి 2019 వరకూ ట్రూ–అప్ నివేదికలు దాఖలు చేయవద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం విధాన నిర్ణయమేదీ తీసుకోలేదని, అంతేకాక.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీచేయలేదని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, అందువల్లే ఈ సర్దుబాటు చార్జీలు వసూలుచేయడానికి అనుమతించాలని కమిషన్ నిర్ణయించిందని విద్యుత్ నియంత్రణ మండలి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయి. -
కంచే చేను మేసేస్తోంది!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసిన చందాన ఉద్యోగులే సంస్థ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం వారి అవినీతి వ్యవహారాలకు కొమ్ముకాస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)కు రావాల్సిన ఆదాయానికి కొందరు ఉద్యోగులు గండికొడుతున్నారు. వారు చేసింది తప్పని పలు విచారణల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఏపీ ట్రాన్స్‌కో వరకూ ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. ప్రతి డీడీకి సమర్పించుకోవాల్సిందే! ► విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎం స్థాయి అధికారి ఒకరు సీఎండీ పేషీలోని ఒక అటెండర్ బంధువుకు చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని వాడుకుంటున్నారు. నిజానికి ట్రావెల్ వాహనాన్ని వినియోగించాల్సి ఉన్నా.. అలా చేయలేదు. సంస్థ నుంచి బిల్లు రూపంలో నగదు తీసుకుంటూ అటెండర్ బంధువుకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. ► ఏలూరు ఆపరేషన్ సర్కిల్లోని భీమవరం డివిజన్లో విద్యుత్ సర్వీస్ కోసం సంస్థ పేరు మీద వినియోగదారులు డీడీ తీయాలంటే తన సంతకం తప్పనిసరంటూ ఓ అధికారి నిబంధన విధించారు. ప్రతి డీడీకి కొంత మొత్తాన్ని తనకు లైన్మేన్లు చెల్లించడమన్నది ఆనవాయితీగా మార్చారు. ► తణుకు సబ్ డివిజన్లో భవనాలపై ఉన్న పెంట్ హౌస్‌కు విద్యుత్ సర్వీస్ ఇచ్చేందుకు ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ► నిడదవోలు డివిజన్ ఉండ్రాజవరం మండలంలో ఓ అధికారి.. అపార్ట్మెంట్లకు విద్యుత్ సర్వీస్ ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో ఇటీవలే విజిలెన్స్ విచారణ జరిపించారు. ఇలా అనేక చోట్ల సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని ఉద్యోగులు, అధికారులు పక్కదారి పట్టిస్తున్నట్టు ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు సమాచారం అందింది. త్వరలోనే చర్యలు డిస్కంకు నష్టం చేకూర్చేలా ప్రవర్తించిన ఏ ఉద్యోగిపైనైనా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అటువంటి వారిపై విచారణ జరుగుతోంది. కొందరు తప్పు చేసినట్టు రుజువైనప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. వారి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నాం. త్వరలోనే మా వైపు నుంచి చర్యలుంటాయి. –ఏపీ ట్రాన్స్ కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. తప్పు చేశాడని తేలినా.. శ్రీకాకుళానికి చెందిన జి.సత్యవతి తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ పొందేందుకు రూరల్ సెక్షన్‌ను సంప్రదించారు. ఆమె ఇంటికి విద్యుత్ సర్వీస్ ఇవ్వాలంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో కలిపి మొత్తం రూ.1,04,000 ఖర్చవుతున్నా అక్కడి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్(ఏఈఈ) బి.నాగేశ్వరరావు ఆమె నుంచి అనధికారికంగా రూ.లక్ష తీసుకుని కేవలం రూ.8,900కే ప్రతిపాదనలిచ్చారు. సంస్థ అవసరానికి వాడుకునేందుకు పక్కన ఉంచిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలతో పని పూర్తిచేశారు. ఈ వ్యవహారంపై శ్రీకాకుళం రూరల్ ఏడీఈ విచారణ జరిపి ఎస్ఈకి నివేదిక ఇచ్చారు. ఎస్ఈ మరోసారి డివిజనల్ ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపించారు. ఆయన విచారణలోనూ ఏఈఈ నేరం రుజువైంది. ఈ మొత్తం నివేదికను విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉండే చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)కు ఎస్ఈ పంపించారు. తప్పు చేసిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సీజీఎం నుంచి ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. -
ఏపీ ఇంధన శాఖ: కొనుగోళ్లలో రోజుకు రూ.కోటి ఆదా
సాక్షి, అమరావతి: చౌక విద్యుత్ కొనుగోళ్లలో రాష్ట్ర ఇంధన శాఖ మరో రికార్డు నమోదు చేసింది. 2021–22 తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రూ. 95 కోట్ల మేర ఆదా చేసింది. అంటే రోజుకు రూ.కోటి వరకు ఇంధన కొనుగోళ్లలో ఆదా అయింది. ఇక గత రెండేళ్లలో కూడా విద్యుత్ కొనుగోళ్లలో ఇప్పటికే రూ.2,342.45 కోట్లు మిగిల్చింది. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం తగ్గనుంది. అంతిమంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ఉపశమనం లభించనుంది. గత ప్రభుత్వం ఈ తరహా నియంత్రణ చర్యలను పాటించకపోవడంతో ప్రజలు ఏటా విద్యుత్ చార్జీల భారం మోయాల్సి వచ్చింది. నిర్వహణ వ్యయాన్ని వీలైనంతగా తగ్గించుకుని ప్రజలపై విద్యుత్ భారాన్ని నివారించే చర్యలపై ఇటీవల విజయవాడలోని విద్యుత్ సౌధలో జరిగిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులు చర్చించారు. ట్రాన్స్‌కో జేఎండీ వెంకటేశ్వరరావు, డిస్కమ్‌ల సీఎండీలు పద్మా జనార్థన్‌రెడ్డి, హరినాథ్‌రావు, సంతోష్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్, ముత్తుపాణ్యన్ పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా.. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. నిర్వహణ వ్యయంలో 80 శాతం విద్యుత్ కొనుగోలు ఖర్చే ఉంటుంది. మార్కెట్లో విద్యుత్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చౌకగా లభించే సమయంలో ఎక్కువగా తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో రియల్ టైం విధానం వల్ల ప్రతి 15 నిమిషాలకు విద్యుత్ ధరలను అంచనా వేసే వీలుంది. ఈ సదుపాయాన్ని విరివిగా ఉపయోగించేందుకు సాంకేతికతను బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. విద్యుత్ డిమాండ్, మార్కెట్లో లభ్యతను శాస్త్రీయంగా గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. దీని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ పర్యవేక్షించనుంది. కేంద్రం ప్రశంసలు.. రియల్ టైం మార్కెట్ ద్వారా విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఇతర రాష్ట్రాలకన్నా ఏపీ మెరుగ్గా నియంత్రించడాన్ని కేంద్ర సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్‌శర్మ అభినందించిన విషయం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇదే ఒరవడితో ముందుకెళ్లాలని కమిటీ నిర్ణయించింది. -
ఆ కొనుగోళ్లే కొంప ముంచాయ్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం సరైన నియంత్రణ పాటించని కారణంగా విద్యుత్ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది. ఈ కారణంగానే రాష్ట్ర విభజన కాలం నుంచి ఇప్పటివరకూ విద్యుత్ సంస్థలు కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. 2014–15 నుంచి 2018–19 వరకూ విద్యుత్ రంగం పరిస్థితిపై కాగ్ నివేదిక వెలువరించింది. మిగులు విద్యుత్ పేరుతో గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాలను అత్యధిక ధరలకు చేసుకోవడం వల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోయాయి. ముఖ్యంగా పవన, సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో గాడి తప్పడం వల్ల ఊహించని విధంగా నష్టాలు వచ్చాయి. ప్రైవేటుతో ఢమాల్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2014–15లో రూ.7,069.25 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2018–19 నాటికి ఆ నష్టాలు రూ. 27,239.60 కోట్లకు వెళ్లాయి. ప్రధానంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యధికంగా ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం తారస్థాయిలో ఉండటం (యూనిట్ రూ.5 పైన), ఆదాయం అంతకన్నా తక్కువ ఉండటంతో నష్టాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) ఐదేళ్లలో రూ.6,608.90 కోట్ల నుంచి రూ.21,173.01 కోట్ల నష్టాలకు వెళ్లింది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) రూ.2,416.68 కోట్ల నుంచి రూ.7,974 కోట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఎక్కువగా ప్రైవేట్ సోలార్, విండ్ పవర్ విద్యుత్ ధరలు రానురాను తగ్గుతున్నా.. అప్పటి ప్రభుత్వం మాత్రం అత్యధిక రేట్లకు కొనుగోలు చేసింది. ఆర్పీవో ఆబ్లిగేషన్ కింద 2016–17లో 2,433 ఎంయూల (5 శాతం) సౌర, పవన విద్యుత్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంటే.. 4,173 ఎంయూలు (8 శాతం) అనుమతించింది. 2017–18లో 4,612 ఎంయూలకు (9 శాతం), 9714 (19 శాతం) ఇచ్చింది. 2018–19లో 6,190 ఎంయూలు (11 శాతం) అనుమతించాల్సి ఉంటే... 13,142 ఎంయూలు (23.4 శాతం) అనుమతించింది. విండ్, సోలార్ విద్యుత్ తీసుకుని చౌకగా లభించే ఏపీ జెన్కో విద్యుత్‌ను నిలిపివేశారు. దీంతో జెన్కోకు యూనిట్‌కు రూ.1.50 వరకూ ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో 2015–16లో సంస్థలపై రూ.157.1 కోట్లు, 2016–17లో రూ.339.3 కోట్లు, 2017–18లో రూ.2,141.1 కోట్లు, 2018–19లో రూ.3,142.7 కోట్ల అదనపు భారం పడింది. సోలార్ విద్యుత్ ప్రస్తుతం యూనిట్ రూ.2.49కే లభిస్తోంది. కానీ.. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏ కారణంగా కొన్నింటికి యూనిట్‌కు రూ.6.25 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీ నిర్ణయాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదు. -
డిజిటల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: ఆన్లైన్ విధానంలో విద్యుత్ బిల్లుల చెల్లింపుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. బిల్లు వసూలు కేంద్రాలను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రతినెలా వచ్చే బిల్లులను వినియోగదారుడికి మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక మీదట తేలికగా డిస్కమ్ సైట్‌కు లింక్ అయ్యి, గేట్ వే ద్వారా బిల్లులు చెల్లించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సులభం ► రాష్ట్రంలో 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.43,447 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు జరుగుతాయి. ఇందులో రూ.26,431 కోట్లు వినియోగదారుల నుంచి వసూలవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.3,102 కోట్లు, మిగతా మొత్తం ఇతర సబ్సిడీల రూపంలో డిస్కమ్‌ల ఖాతాల్లో చేరతాయి. ► ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్ మీటర్లు పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన రూ.26,431 కోట్ల రెవెన్యూ సమస్యగా మారుతోంది. రెవెన్యూ కేంద్రాల నిర్వాహణకు డిస్కమ్‌లు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలు ఈ ఖర్చును తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. ► కరోనా నేపథ్యంలో రెవెన్యూ కేంద్రాలకు వెళ్లి బిల్లు కట్టే సంప్రదాయ వినియోగదారులు చెల్లింపులు ఆపేస్తున్నారు. ఎక్కువ సేపు లైన్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీనివల్ల డిస్కమ్‌ల రెవెన్యూ తగ్గిపోతున్నాయి. గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే దాదాపు 38 శాతం రెవెన్యూ వసూళ్లు తగ్గినట్టు తేలింది. ► క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అవసరమైతే గ్రామ సచివాలయం వలంటీర్లను ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ► మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా పూర్తిస్థాయిలో ఆన్లైన్ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
చార్జీల షాకుల్లేవ్
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ చార్జీల భారం సామాన్య ప్రజలపై పడకుండా.. వినియోగదారుల ఆకాంక్షలు, పంపిణీ సంస్థల ఆర్థిక అవసరాల్ని సమన్వయం చేస్తూ 2021–22 రిటైల్ సరఫరా ధరల్ని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) బుధవారం విడుదల చేసింది. ఇకపై కనీస చార్జీల భారం గృహ వినియోగదారులపై పడకుండా, రైతులకు ఉచిత విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తూ, కుల వృత్తులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగిస్తూ రూపొందించిన కొత్త టారిఫ్ నేటి నుంచి అమల్లోకి రానుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వరుసగా రెండోసారి ప్రజలపై భారం మోపకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్తు టారిఫ్‌లను విడుదల చేసింది. కోవిడ్–19 కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ సామాన్యులపై భారం మోపకుండా టారిఫ్‌లను ప్రకటించి మరోసారి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంది. రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా... గృహ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021–22 కొత్త టారిఫ్ని ప్రకటించింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.రాజగోపాల్ కొత్త టారిఫ్ని విడుదల చేశారు. టారిఫ్ వివరాల్ని జస్టిస్ నాగార్జునరెడ్డి మీడియాకు వివరించారు. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ రూ.11,741.18 కోట్ల లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్‌సీకీ నివేదించాయన్నారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నికరలోటు రూ.7433.80 కోట్లుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులు, ప్రభుత్వంపై రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా నివారించినట్లు వివరించారు. 2021–22 ఆదాయ అంతరాన్ని నిర్ధారించే సమయంలో 2014–15, 2016–17, 2018–19 వరకూ నిర్ణయించిన రూ.3,013 కోట్ల ట్రూఅప్, గత ఆర్థిక సంవత్సర ట్రూడౌన్ సర్దుబాటు కింద రూ.3,373 కోట్లని కూడా పరిగణలోకి తీసుకొని నికరలోటుని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మీ సెల్వరాజన్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జే.పద్మజనార్థనరెడ్డి, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు కే.రాజబాపయ్య, బి.రమేష్ప్రసాద్తో పాటు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. అన్ని వర్గాల భారాన్ని మోస్తున్న ప్రభుత్వం కొత్త టారిఫ్‌లకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోసేందుకు అంగీకరించింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి 2021–22లో రూ.7,297.08 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వం భరించనుంది. కార్పొరేటేతర రైతులు, చెరకు క్రషింగ్, గ్రామీణ మొక్కల పెంపక కేంద్రాలు, దోభీ ఘాట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హమైనవని ఏపీఈఆర్సీ సూచించింది. ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65లోకి.. ఈసారి తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. వివిధ వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్ కారణంగా ప్రభుత్వంపై రూ.1657.56 కోట్ల భారం పడుతోంది. దీన్ని భరించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. హరిజన, గిరిజన నివాస సముదాయాలు, తండాల్లో నివసించే గృహ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. రజక సంఘం నడుపుతున్న బీపీఎల్ లాండ్రీలకు నెలకు 150 యూనిట్లు ఉచితం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ), స్వర్ణకారులు, చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు, నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మరోవైపు యూనిఫాం ధరలతో ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఏకరీతి ధరలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గృహ వినియోగదారులకు రాయితీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీల భారం రూ.136.72 కోట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,091.36 కోట్ల భారం పడనుంది. ఆక్వా సాగుదారుల మోముల్లో వెలుగులు.. చేపల, రొయ్యల చెరువుల వినియోగదారులకు గతంలో క్రాస్‌సబ్సిడీ యూనిట్ రాయితీ ధర రూ.3.85 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.2.35కి తగ్గించారు. అంటే యూనిట్‌పై రూ.1.50 వరకూ తగ్గింది. ఆక్వా హేచరీస్, చేపలు, రొయ్యల దాణా కేంద్రాలు, కోడి పిల్లల తయారీ, కోళ్ల దాణా తయారీ కేంద్రాల్ని ఇండస్ట్రీస్ జనరల్ కేటగిరిలో విలీనం చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్థనని ఏపీఈఆర్సీ అంగీకరించింది. ఇప్పటి వరకూ వీరంతా ఇండస్ట్రీస్ కేటగిరీలో బిల్లులు చెల్లించేవారు. ఇకపై వారంతా టీఓడీ పీక్, ఆఫ్–పీక్ ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్వతంత్ర ఎల్టీ కనెక్షన్లు కలిగి, జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న చేపలు, రొయ్యల చెరువులు, కోళ్ల పెంపకం, పాడి క్షేత్రాలు, సొంత దాణా తయారీ కేంద్రాలకు చెందిన వారంతా ఇకపై యూనిట్‌కు రూ.5.25, కిలోవాట్‌కు రూ.75 మాత్రమే చెల్లించేలా కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఇండస్ట్రీస్ (జనరల్) కేటగిరీలోని హెచ్‌టీ వినియోగదారులకు లోడ్ కారక ప్రోత్సాహక పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. గృహ వినియోగదారులపై భారం లేకుండా... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి గృహ వినియోదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం మోపకుండా టారిఫ్‌లను విడుదల చేసింది. ఇప్పటివరకూ కనీస ఛార్జీలుగా రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేసేవారు. ఇకపై ఈ భారం ఉండదు. కనీస ధరలకు బదులుగా కిలోవాట్‌కు రూ.10 వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక ఎల్టీ వినియోగదారుడు మూడు నెలల పాటు ఇంట్లో లేకపోయినా నెలకు కనీసం రూ.50 చొప్పున రూ.150 బిల్లు కట్టాల్సి వచ్చేది. ఇకపై నెలకు రూ.10 చొప్పున రూ.30 చెల్లిస్తే సరిపోతుంది. సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించారు. అపార్ట్‌మెంట్లులో ఒకే పాయింట్ వద్ద అధిక వోల్టేజీ (హెచ్‌టీ) కనెక్షన్ల కింద ధరలు వసూలు చేయాలన్న పంపిణీ సంస్థల ప్రతిపాదనల్ని ఏపీఈఆర్సీ తిరస్కరించింది. అపార్ట్మెంట్లలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని నివారించేందుకు డిస్కమ్‌ల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఇక ఫంక్షన్ హాళ్లలో గతంలో నెలకు కిలోవాట్‌కు రూ.100 చెల్లించాల్సి ఉండేది. ఇకపై యూనిట్ల కింద చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఆఫ్–పీక్ టీవోడీ(టైమ్ ఆఫ్‌డే) సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ఉండగా దీన్ని ఉదయం రూ.8 గంటల వరకూ మార్చాలన్న ప్రతిపాదనని తిరస్కరించారు. 2 గంటలు తగ్గిస్తే గృహ వినియోగదారులకు నష్టం వాటిల్లే అవకాశాలున్నందున డిస్కమ్‌ల ప్రతిపాదనని ఏపీఈఆర్సీ తోసిపుచ్చింది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా.. పర్యావరణ పరిరక్షణకు ఏపీఈఆర్సీ పెద్దపీట వేసింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ విద్యుత్ ధరని ఒక్క పైసా కూడా పెంచకుండా ఈ ఏడాదీ రూ.6.70గానే కొనసాగిస్తోంది. వినియోగదారులకు సేవలందించే చార్జింగ్ కేంద్రాల నుంచి 90 శాతం మాత్రమే డిస్కమ్‌లు తీసుకోవాలని, మిగిలిన 10 శాతం చార్జింగ్ కేంద్రాల నిర్వహణకు విడిచిపెట్టాలని సూచించింది. పునరుత్పాదక విద్యుత్‌ని ప్రోత్సహించేలా కూడా రాయితీలు ప్రకటించింది. పవన, సౌర విద్యుత్‌కు పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేశారు. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య చర్యల్ని ప్రోత్సహించేందుకు ఏపీ రాష్ట్ర విద్యుత్ సమర్థత అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఈఈడీసీవో)కు నిధులు మంజూరు చేశారు. పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థ మొత్తం ఎపీఎస్పీడీసీఎల్ పరిధిలోనే ఉండటంతో మిగిలిన సంస్థలపై ఆ లోటు తొలగించేందుకు సరికొత్త నిర్ణయాన్ని అమలు చేస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ధ్రువీకరణ పత్రాలు(ఆర్ఈసీ) రూపంలో వినియోగదారులపై భారం పడకుండా మిగులు విద్యుత్‌ని ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ నుంచి యూనిట్ రూ.2.43 / రూ.2.44 చొప్పున కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. 150 హెచ్‌పీ వరకూ ఎల్టీ రైస్ మిల్లులే... గత సంవత్సరం టారిఫ్‌లో రైస్ మిల్లులు, పల్వరైజర్లకు టారిఫ్‌లలో వెసులుబాటు కల్పించారు. 100 హార్స్ పవర్ వరకు ఎల్టీ వినియోగదారులుగా, అంతకు మించితే హెచ్‌టీ వినియోగదారులుగా పరిగణిస్తారు. అయితే దీన్ని మార్చాలని వినతులు వెల్లువెత్తడంతో 100 హెచ్‌పీ బదులు 150 హెచ్‌పీ వరకూ ఎల్టీ ధరలు, 150 హెచ్‌పీ దాటితే హెచ్‌టీ కింద పరిగణించాలని నిర్ణయించారు. అయితే ఇది పూర్తి ఆప్షనల్ విధానంగా నిర్థరించారు. 2020 జూన్ 30లోపు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా మంది మిల్లర్లు కరోనా కారణంగా మార్చుకోలేకపోయామని చెప్పడంతో ఈ గడువుని ఈ ఏడాది జూన్ 30 వరకూ పొడిగించినట్లు ఏపీఈఆర్సీ ప్రకటించింది. ఒకసారి మార్పు చేసుకున్నాక తిరిగి మళ్లీ మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే మిల్లులు సర్వీస్ శాంక్షన్ చేసే సమయంలోనే ఆప్షన్లు తెలియజేయాలని సూచించింది. కొనుగోలు, అమ్మకానికి స్పెషల్ సెల్... రియల్ టైమ్ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకానికి సంబంధించి ప్రతి డిస్కమ్‌లో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ 24 గంటలూ పర్యవేక్షించేలా సెల్ పనిచేయాలని సూచించింది. దీనిద్వారా జాతీయ స్థాయిలో తక్కువ ధరకు విద్యుత్ అమ్మకానికి వచ్చినప్పుడు కొనుగోలు చేసేలా, ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించేలా అవకాశాలు మెరుగుపడి డిస్కమ్‌లు లాభాల బాట పట్టే అవకాశాలున్నాయి. రెస్కోలు.. డిస్కమ్‌ల పరిధిలోకి ఇకపై గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల(రెస్కోలు)ను సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆధీనంలోకి తీసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్ పంపిణీ లైసెన్సులు, మినహాయింపుల విషయంలో రెస్కోలు విఫలమవ్వడంతో వినియోగదారులు ఇబ్బందుల పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. రాయచోటి, కదిరి రెస్కోలని ఆయా డిస్కమ్‌లు విలీనం చేసుకున్నాయని, అనకాపల్లి, కుప్పం రెస్కోలు కూడా తాత్కాలికంగా డిస్కమ్‌లు ఆధీనంలోకి రానున్నాయని వెల్లడించారు. బిల్లుల వెనుక రాయితీ వివరాలు – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ ‘సగటు వినియోగదారులపై రూపాయి భారం లేకుండా కొత్త టారిఫ్ తయారు చేశాం. విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పడకుండా, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యుత్తు టారిఫ్‌లు రూపొందించడం కత్తిమీద సామే అయినా విజయవంతంగా పూర్తి చేశాం. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల రాయితీలు అందిస్తోంది. అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లుల వెనకవైపు ప్రతి యూనిట్ సేవా వ్యయం(కాస్ట్ ఆఫ్ సర్వీస్), క్రాస్ రాయితీ, ప్రభుత్వ రాయితీ మొదలైన వివరాల్ని పొందుపరచాలని డిస్కమ్‌లకు సూచించాం. తొలిసారిగా వర్చువల్ విధానంలో బహిరంగ విచారణ చేపట్టాం. ఆత్మకూరు లాంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూడా ఈ విచారణలో పాల్గొనడం విశేషం. బహిరంగ విచారణ అనంతరం అన్ని అభ్యంతరాల్ని నిశితంగా పరిశీలించి టారిఫ్‌లు తయారు చేశాం’ – ప్రకటనల హోర్డింగ్స్‌కు రూ.12.25, ఫంక్షన్ హాల్స్‌కు రూ.12.25, విద్యుత్ వాహనాలకు రూ.6.70 చొప్పున యూనిట్‌కు ఛార్జ్ పడనుంది. – పరిశ్రమలకు 75 కేవీ వరకు రూ.6.70, సీజనల్ పరిశ్రమలకు(75 కేవీ) రూ.7.45గా నిర్ణయించారు. – వీధి దీపాలు, సుజల స్రవంతి, సీపీడబ్ల్యూస్, పీడబ్ల్యూఎస్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు. ఏపీలోనే చీప్ – కోవిడ్ వెంటాడినా సామాన్యులకు తాకని షాక్ సాక్షి, అమరావతి: కరోనా కారణంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పురోగతి దెబ్బతిన్నా పేదలపై ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పడనివ్వలేదు. ఏపీఈఆర్సీ ప్రకటించిన విద్యుత్ టారిఫ్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 21 రాష్ట్రాలతో పోలిస్తే నెలకు 50 యూనిట్ల వరకూ వాడే పేద వర్గాలకు ఏపీలోనే భారీ సబ్సిడీతో విద్యుత్ (యూనిట్ రూ. 1.45కు) అందుతుండటం గమనార్హం. అదే బిహార్‌లో యూనిట్ రూ. 6.15 వరకు విద్యుత్ టారిఫ్ ఉంది. 200 యూనిట్లు వాడే వినియోగదారులకు కూడా ఏపీలో ఇప్పటికీ యూనిట్ రూ. 3.60కే విద్యుత్ అందుతోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తోంది. మరోవైపు ఏపీలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్ అమలులోకి తెచ్చారు. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారే అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడవున ఎక్కువ టారిఫ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా పేదలకు విద్యుత్ భారం కారాదన్న విధానానికి అనుగుణంగానే ఏపీఈఆర్సీ కసరత్తు చేసి సత్ఫలితాలు సాధించింది. -
కరెంటు అంతరాయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 2019–20లో 3,90,882 విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటే, 2020–21లో ఇప్పటివరకు 2,54,414 మాత్రమే నమోదు కావడం గమనార్హం. గతంలో విద్యుత్ వాడకం పెరిగినా అందుకు తగ్గట్టుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచలేదు. అలాగే గతంలో నాలుగు గ్రామాలకొక లైన్‌మ్యాన్ ఉండేవారు. దీంతో ఫీడర్ల పరిధిలో కరెంట్ పోతే లైన్‌మ్యాన్ వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అంతరాయాలు ఏర్పడేవి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ అంతరాయాలు సుదీర్ఘ సమయం పాటు కొనసాగేవి. ‘తూర్పు’లో భారీ మార్పు రాష్ట్రంలో ఉన్న మూడు డిస్కమ్‌లలో గ్రామీణ ప్రాంతం, గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలో భారీ మార్పు కన్పిస్తోంది. ఈ డిస్కమ్ పరిధిలో గత ఏడాది 1,24,035 అంతరాయాలు ఏర్పడితే ఈ ఏడాది ఇప్పటివరకు చాలా తక్కువగా 28,663 మాత్రమే నమోదయ్యాయి. ఏళ్లనాటి విద్యుత్ స్తంభాలు, లైన్లు మార్చడంపై విద్యుత్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అనధికారిక కనెక్షన్లు క్రమబద్ధీకరించి, లోడ్‌కు తగినట్టు మారుమూల ప్రాంతాల్లో సైతం కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ సరఫరాలో అంతరాయాలు తగ్గించడానికి తోడ్పడ్డాయి. చక్కదిద్దేందుకు చర్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఫీడర్ల బలోపేతానికి ప్రత్యేకంగా రూ.1,700 కోట్లు కేటాయించింది. దీంతో గ్రామీణ విద్యుత్ సరఫరా జరిగే లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో పాటు అధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఆధునీకరించారు. వాడకాన్ని తట్టుకునేలా కండక్టర్లను మార్చారు. ఇంధనశాఖ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదంతా ఆన్లైన్ ద్వారానే గమనించేలా పారదర్శక విధానం తీసుకొచ్చారు. ఏ సమయంలో అంతరాయం కలిగింది? ఎంతసేపట్లో పరిష్కరించారు? అనేది తెలుసుకుంటుండటంతో సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరిగింది. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక్కరు చొప్పున ఇంధన సహాయకులను ఏర్పాటు చేశారు. సుశిక్షితులైన ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం వల్ల అంతరాయం వచ్చిన వెంటనే వారు హాజరవుతున్నారు. అంతేగాకుండా సమస్యను గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ అంతరాయం ఏర్పడకుండా నివారిస్తున్నారు. (చదవండి: ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి పుస్తకం) హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
రైతుల ఖాతాల్లోకి రూ.4.23 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రూ.4,23,10,183 జమ చేసింది. వ్యవసాయ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్షంగా బదిలీ చేసి, అక్కడి నుంచి విద్యుత్ పంపిణీ సంస్థకు పంపనున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ నెల వ్యవసాయ విద్యుత్ బిల్లుల మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి మళ్లించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం జీవో జారీ చేశారు. -
విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్ చార్జీలు మాత్రం పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం) కొత్త లోగోను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్న విషయాలను చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సంక్షోభంతో విద్యుత్ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినా కూడా ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే విద్యుత్ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని మంత్రి చెప్పారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. చౌక విద్యుత్ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్ సంస్థలకు మంత్రి సూచించారు. కాగా.. గ్రామ, మున్సిపల్ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్ లైన్మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్ సంస్థల పనితీరు మెరుగుపడిందని మంత్రికి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ఐదేళ్ల ట్రూ–అప్ రూ.19,604 కోట్లు
సాక్షి, అమరావతి: గత సర్కారు నిర్వాకాల ఫలితంగా ఐదేళ్లకు సంబంధించి రూ.19,604 కోట్ల మేర ట్రూ–అప్ విద్యుత్తు చార్జీల భారాన్ని మోపేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని డిస్కమ్‌లు అనుమతి కోరడంపై ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకేసారి ఇంత మొత్తాన్ని, అదికూడా గత సర్కారు పాలన ముగిసిన తరువాత కమిషన్ ముందుకు తేవడాన్ని అన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రూ–అప్ అంత ఎందుకైంది? ఎప్పటికప్పుడు గత కమిషన్ ముందుకు ఎందుకు తేలేదు? ఏపీఈఆర్సీ నిర్ణయించిన దానికన్నా ఎక్కువ వ్యయం చేయాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రూ–అప్ అంటే? ► విద్యుత్ పంపిణీ సంస్థలు ఏటా వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్ఆర్) ఏపీఈఆర్సీకి సమర్పిస్తాయి. వచ్చే ఏడాదిలో పెరిగే వ్యయం, రెవెన్యూ తేడా, లోటు ఎలా భర్తీ చేసుకోవాలో పేర్కొంటాయి. ► డిస్కమ్‌ల ఏఆర్ఆర్లను పరిశీలించాక కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. నిర్వహణ వ్యయం దేనికి ఎంత ఉండాలనేది సూచిస్తుంది. ► 2014–15 నుంచి 2018–19 వరకూ గత సర్కారు కమిషన్ సూచించిన దానికన్నా అధికంగా ఖర్చు చేసింది. ఇలా చేసిన వ్యయానికి కారణాలు వివరిస్తూ ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుగా చూపించాలి. దీన్నే ట్రూ–అప్ అంటారు. దిగిపోయే ముందు.... ► గత ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్‌ను ఇష్టానుసారంగా ఎక్కువ రేట్లకు కొనుగోలు చేస్తూ కమిషన్ నిర్దేశించిన పరిమితి దాటిపోయింది. ఫలితంగా ప్రతి సంవత్సరం వాస్తవ ఖర్చులో భారీగా తేడా వచ్చింది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ కొనుగోలు ధర కమిషన్ నిర్ణయించిన దానికన్నా రూ.9,598 కోట్లు ఖర్చు పెట్టారు. రావాల్సిన దానికన్నా రూ.5,259 కోట్లు తక్కువ రెవెన్యూ వచ్చింది. ఏటా వడ్డీలు, కొత్త ట్రూ–అప్ రూపంలో రూ.4,747 కోట్లు వెరసి రూ.19,604 కోట్ల ట్రూ–అప్ ఇప్పుడు కమిషన్ ముందుకొచ్చింది. ► ట్రూ–అప్పై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలొస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌లు ఎందుకిలా చేశాయి? అనుమతి లేకుండా అధిక రేట్లకు విద్యుత్ ఎందుకు కొన్నాయి? ఇంత మొత్తాన్ని కమిషన్ దృష్టికి ఏటా ఎందుకు తేలేదు? అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. -
గృహ విద్యుత్తు వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ
సాక్షి, అమరావతి: గృహ విద్యుత్తు వినియోగదారులకు రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వం రూ.1,707 కోట్ల మేర సబ్సిడీలను అందచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఆక్వా, నర్సరీలు, దోబీఘాట్లు, సెలూన్లు, స్వర్ణకారులతోపాటు ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నారు. మరోవైపు ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు సకాలంలో చెల్లిస్తోంది. గత సర్కారు డిస్కమ్‌లకు అతి కష్టం మీద ఏటా రూ. 4 వేల కోట్లు సబ్సిడీగా ఇస్తుండగా ఇప్పుడది రూ.11,311.65 కోట్లకు చేరింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీనే రూ. 8,354 కోట్లు ఉంది. డిస్కమ్‌ల అప్పులు తీర్చే మార్గాలను అన్వేషించడంతో పాటు సబ్సిడీలను ఎప్పటికప్పుడు ఇవ్వడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. బడ్జెట్లోనూ ఈ సబ్సిడీలను పొందుపరుస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు అప్పగించింది. మరోవైపు అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ బిల్లులను సగటు (ర్యాండమ్)గా పరిశీలన చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్ బిల్లులు పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివరాలను ఇంధనశాఖ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వినియోగదారుల్లో ఉన్న అపోహలను దూరం చేయడానికి బిల్లులను పారదర్శకంగా వారి సమక్షంలోనే తనిఖీ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు ఏ విధంగా తీశామో... వినియోగదారులకు భారం ఏ విధంగా తగ్గించామో వివరించాలి. ఇంకా అనుమానాలుంటే అధికారులు వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. ► డిస్కమ్‌లు తమ వెబ్సైట్లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత రెండేళ్ల విద్యుత్ వినియోగ వివరాలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు తమ కస్టమర్ ఐ.డీ నంబరు ఫీడ్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేయాలి. ► 60 రోజులకు మీటర్ రీడింగ్ తీసినా.. ఏ నెలకు ఆ నెల విద్యుత్ వినియోగం మేరకే కరెంటు బిల్లు అందిస్తాం. ఎంత వాడితే అంతే కరెంటు బిల్లు వస్తుంది. శాస్త్రీయ పద్ధతిలోనే బిల్లులు రెండు నెలల వినియోగాన్ని విభజించి మార్చి నెల వినియోగానికి 2019–20 టారిఫ్ కేటగిరీ వర్తింప చేశామని, అలాగే ఏప్రిల్ వినియోగానికి 2020–21 నూతన టారిఫ్ ప్రకారం బిల్లులు జారీ చేశామని శ్రీకాంత్ స్పష్టం చేశారు. దీని వల్ల ఏప్రిల్‌లో విద్యుత్ బిల్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మే నెలకు కూడా విడిగానే బిల్లులు తయారుచేస్తామని వివరించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మే విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువును జూన్ 30 వరకు పెంచినట్టు తెలిపారు. విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 45 రోజుల పాటు పొడిగించారు. అప్పటిదాకా ఎలాంటి అపరాధ రుసుములు ఉండవన్నారు. -
రానున్నాయి 266 ‘చార్జింగ్ బంక్‌లు’
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణకు ఉపక్రమించాయి. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర భారీ పరిశ్రమలు, పట్టణాభివృద్ధి సంస్థలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర పురపాలక, విద్యుత్ శాఖలు సంసిద్ధమయ్యాయి. రాష్ట్రంలో స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద ఎంపికైన నగరాల్లో మొదటి దశలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. ఇందుకోసం 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లు (చార్జింగ్ బంక్‌లు) నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, ఇంధన శాఖలకు సమాచారం ఇచ్చింది. రాష్టంలో స్మార్ట్ సిటీల పథకం కింద ఎంపికైన విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు ఆ నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని విద్యుత్ పంపిణీ సంస్థలతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇందుకు అవసరమైన స్థలాలను సేకరించి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రానికి కేటాయించిన 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లలో 1,412 చార్జర్లు ఉంటాయని భావిస్తున్నారు. 266 స్టేషన్లలో 133 స్లో చార్జింగ్, మరో 133 స్పీడ్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. స్లో చార్జింగ్ స్టేషన్లలో వాహనం మోడల్‌ను బట్టి చార్జింగ్ చేయడానికి 2 నుంచి 6 గంటల సమయం పడుతుంది. స్పీడ్ చార్జింగ్ స్టేషన్లలో అయితే వాహనం మోడల్‌ను బట్టి అరగంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్క చార్జింగ్ స్టేషన్లో ఒకేసారి సగటున 5 వాహనాలకు చార్జింగ్ చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు ‘ఫేమ్’ డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఈవీల వాడకాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల సత్వర తయారీ, వాడకం (ఫేమ్) పథకాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేయడమనేది ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి దేశంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద 100 నగరాలు ఎంపిక కాగా.. మొదటి దశలో 62 నగరాల్లో 2,636 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించారు. ఇందుకు ఆసక్తి గల సంస్థల నుంచి భారీ పరిశ్రమల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 106 సంస్థలు ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపించగా.. నిపుణుల కమిటీ వాటిలో 19 కంపెనీలను ఎంపిక చేసింది. మున్సిపాల్టీల్లోనూ ఏర్పాటు చేసే యోచన రాష్ట్రంలో 31 పట్టణాలు అమృత్ పథకం కింద ఎంపికయ్యాయి. స్మార్ట్ సిటీలకు మంజూరు చేసిన 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లలో కొన్నిటిని అమృత్ పథకం కింద ఎంపికైన మున్సిపాల్టీల్లో కూడా నెలకొల్పితే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని మరింతగా ప్రోత్సహించినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంది. కేంద్రం ఆమోదిస్తే 31 మున్సిపాలిటీలలో రెండేసి చొప్పున, మిగిలిన 204 స్టేషన్లను స్మార్ట్ సిటీలైన విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతిలలో నెలకొల్పాలని యోచిస్తున్నారు. అందుకు నిబంధనలను అనుమతించకపోతే మొత్తం స్టేషన్లను ఎంపికైన నాలుగు నగరాల్లోనే ఏర్పాటు చేస్తారు. కేంద్రం ఎంపిక చేసిన సంస్థలు ఈవీ చార్జింగ్ స్టేషన్లను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు, డిస్కంలతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
విద్యుత్ చార్జీలు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయని, డిస్కంలను పరిరక్షించేందుకు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచాల్సిందేనని విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.రాష్ట్రంలో భారీగా పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు విద్యు త్ సరఫరా చేసేందుకు డిస్కంలు భారీగా వ్యయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చేయనున్న ప్రతిపాదనలను ఆమోదించాలని రాష్ట్ర విద్యుత్ ని యంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. డిస్కంల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన మేరకు విద్యుత్ రాయితీలు విడుదల చేయించాలని కోరాయి. గత నెల 29న ఈఆర్సీ నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ సలహా సంఘం సమావేశంలో ఉద్యోగ, కార్మిక సంఘాల నేత లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని చార్జీల పెంపు తప్పనిసరని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో చర్చించిన విషయాల(మీటింగ్ మినిట్స్)ను ఈఆర్సీ బుధవారం బహిర్గతం చేసింది. డిస్కంల ప్రయోజనాల పరిరక్షణకు విద్యుత్ చార్జీల పెంపు తప్పనిసరి అని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ అధ్యక్షుడు జి.సాయిబాబు సమావేశంలో డిమాండ్ చేశారు. ఆర్థిక నష్టాల్లో ఉన్నామని డిస్కంల యాజమాన్యాలు ఉద్యోగ సంఘాలతో జరిపే సమావేశాల్లో పేర్కొంటున్నా యని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు కె.ప్రకాశ్ తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచితే డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూని యన్ (327) అధ్యక్షుడు ఈ.శ్రీధర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకూ డి స్కంల వద్ద డబ్బులుండడం లేదని, వీటి కోసం కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎంఏ వజీర్ ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేటగిరీల వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాలని కోరారు. -
న్యూఇయర్‌లో పవర్ షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు చార్జీల పెంపును ప్రతిపాదించనున్నాయి. జనవరి 25తో మునిసిపల్ ఎన్నికలు ముగియనుండగా, 31న ఈఆర్సీకి డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో భాగంగా ఈ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. 2019–20 ముగిసే నాటికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 11,000 కోట్లకు చేరనుందని, బడ్జెట్లో ప్రభుత్వం కేటా యించిన రూ.6,079 కోట్ల విద్యుత్ రాయితీలు పోగా మొత్తం రూ.5,000 కోట్ల ఆర్థిక లోటు మిగలనుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సబ్సిడీలు తీసేసినా, 2020–21లో ఆర్థిక లోటు రూ. 6,000 కోట్లకు చేరనుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. అన్ని రకాల కేటగిరీలపై ప్రభావం... చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని డిస్కంలు భావిస్తున్నాయి. దీంతో గృహ, వాణిజ్య తదితర అన్ని కేటగిరీలపై వినియోగదారులపై మోస్తారుగా విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం పడనుంది. నెలకు 100–200 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి, 300 యూనిట్లపైగా వినియోగించే ఎగువ తరగతి కుటుంబాలపై చార్జీల పెంపు ప్రభావం చూపే చాన్సుంది. పారిశ్రామిక కేటగిరీ చార్జీలను స్వల్పంగా పెంచే అవకాశాలున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి 2020–21కి సంబంధించిన టారీఫ్ ఉత్తర్వులను జారీ చేయనుంది. దీంతో 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు అమల్లోకి రానుంది. -
అవసరానికి మించి కొనుగోలు చేశారు
సాక్షి, అమరావతి: అవసరానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్ల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టపోతాయని గతంలోనే డిస్కమ్‌లు స్పష్టంగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని తొలిదశలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు, అయినప్పటికీ వీటిని అనుమతించడం వల్లే పంపిణీ సంస్థలు ఈ ఐదేళ్లలో భారీగా నష్టాన్ని మూటగట్టుకున్నాయని వివరించారు. రాష్ట్ర విద్యుత్‌రంగ పరిస్థితిపై ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితి, ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, విద్యుత్ కొనుగోళ్ల గురించి ఆయనకు విద్యుత్ అధికారులు వివరించారు. కేంద్రం పెట్టిన లక్ష్యానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లు జరిగాయంటూ.. 2015–16లో 5 శాతం లక్ష్యమైతే 5.59 శాతం, 2016–17లో 8.6 శాతం కొనుగోలు చేశారని, 2017–18లో 9 శాతం తీసుకోవాల్సి ఉంటే 19 శాతం తీసుకున్నారని, 2018–19లో 11 శాతం లక్ష్యానికిగాను ఏకంగా 23.4 శాతం ప్రైవేటు పవన, సౌర విద్యుత్ తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 2015–16 నుంచి 2018–19 నాటికి విద్యుత్ సంస్థలపై రూ.5,497 కోట్ల అధిక భారం పడిందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు(ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌లు) రూ.65 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు. 2016–17లో అధిక రేట్లకు 10,478 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారని, చౌకగా లభించే థర్మల్ విద్యుదుత్పత్తిని 2017–18లో 12,014 మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,628 మిలియన్ యూనిట్ల మేరకు తగ్గించినందువల్ల విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందంటూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ ముందు పెట్టారు. గడచిన ఐదేళ్లలో కమిషన్ అనుమతించిన దానికన్నా అధికంగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని, ఆ మొత్తాన్ని(ట్రూ–అప్) కమిషన్‌కు సమర్పించలేదని, ఈ లోటును పూడ్చడానికి అడ్డగోలుగా అప్పులు చేసిన విషయాన్ని వారు వివరించారు. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. అవినీతిని అరికట్టాలి ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థల్లో అవినీతికి కళ్లెం వేయాలని డిస్కమ్‌ల సీఎండీలకు ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి సూచించారు. గ్రీవెన్స్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పురోగతిని వివరించాలని కోరారు. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. కమిషన్ పెట్టిన పరిమితికి మించి అయ్యే ఖర్చు(ట్రూ ఆప్)ను ఎప్పటికప్పుడు ఏపీఈఆర్సీకి సమర్పించాలన్నారు. విద్యుత్‌రంగ వాస్తవ పరిస్థితిని ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని, ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి ఈ భేటీని ఏర్పాటు చేయాలని కమిషన్ చైర్మన్ సూచించినట్టు చెప్పారు. రబీ సీజన్, వేసవిలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌ను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు రఘు, రామ్మోహన్, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి, హరినాథ్ పాల్గొన్నారు. -
మహిళలకు అవకాశం కల్పించకపోవడమేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలకు అవకాశం కల్పించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మహిళలు అంతరిక్షాన్ని చుట్టి వస్తున్న ఈ రోజుల్లో వారికి అవకాశాలు కల్పించకపోవడం ఏమిటంటూ ప్రశ్నించింది. జేఎల్ఎం పోస్టుల విషయంలో కోర్టును ఆశ్రయించిన మహి ళా అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి, వారిని ఎంపిక ప్రక్రి యకు అనుమతించాలని ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించింది. అలాగే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు జేఎల్ఎం పోస్టుల తుది ఫలితాలను ప్రకటించవద్దని స్పష్టం చేస్తూ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జేఎల్ఎం పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన హుమేరా అంజుమ్, మరో ఆరుగురు మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవా ది వాదనలు వినిపిస్తూ.. ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో మహిళా ఉద్యోగులకు 33 1/3 శాతం రిజర్వేషన్ ఉందని తెలిపారు. మొత్తం 2,553 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు, ఒక్క పోస్టును మహిళలకు కేటాయించకపోవడం వివక్ష చూపడమేనన్నారు. పలు రంగా ల్లో మహిళలు కీలక పదవులు నిర్వహిస్తూ రాణిస్తున్నారని, కానీ ఎన్పీడీసీఎల్ అధికారులు మహిళలను గుర్తించడం లేదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి, ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
ప్రీ పెయిడ్ విద్యుత్ ‘సౌభాగ్య’o!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సదుపాయం లేని గృహాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడంతోపాటు ప్రీ పెయిడ్/స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా గృహాలకు ప్రీ పెయిడ్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రతి నెల ముందస్తుగా బిల్లులు చెల్లించి విద్యుత్ వినియోగించుకునే కొత్త విధానం అమల్లోకి రానుంది. సౌభాగ్య పథకానికి సంబంధించి తాజాగా రాష్ట్రాలకు పంపిన ప్రాథమిక విధివిధానాల్లో కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విద్యుత్ సదుపాయం లేని గృహాలకు ఈ పథకం కింద 2019 మార్చి 31లోగా ఉచిత కనెక్షన్లు జారీ చేయాలని రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు గడువు సైతం నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం గ్రాంట్‌గా ఇవ్వనుండగా, కనీసం 10 శాతాన్ని రాష్ట్రాల డిస్కంలు, మిగిలిన 30 శాతం వరకు వ్యయాన్ని డిస్కంలు రుణాలు సమీకరించి ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంటుంది. 2018 డిసెంబర్‌లోగా 100 శాతం గృహాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేసిన రాష్ట్రాలకు కేంద్రం అదనంగా మరో 15 శాతం గ్రాంట్ అందించనుంది. ఈ అదనపు గ్రాంట్‌కు అర్హత సాధించిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి 75 శాతం గ్రాంట్లు రానుండటంతో ప్రాజెక్టు అమలుకు మొత్తం వ్యయంలో 15 శాతం రుణాలు తీసుకుంటే సరిపోనుంది. ఈ మేరకు సౌభాగ్య పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాల డిస్కంలకు పంపింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు లేవని కేంద్రం అంచనా వేసింది. వాటికి కనెక్షన్లు జారీ చేసేందుకు రూ.16,320 కోట్ల వ్యయం కానుండగా, రాష్ట్రాలకు రూ.12,320 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. కేంద్రం సూచనలివీ.. - సౌభాగ్య పథకం కింద ఉచిత విద్యుత్ కనెక్షన్‌కు అర్హత సాధించని గృహాలకు కేవలం రూ.500 రుసుముతో కనెక్షన్లు జారీ చేయాలి. మిగిలిన వ్యయాన్ని నెలవారీ విద్యుత్ బిల్లుతో కలిపి 10 వాయిదాల్లో వసూలు చేయాలి. - బిల్లులు చెల్లించక విద్యుత్ కనెక్షన్లు కోల్పోయిన ఎగవేతదారులకు సౌభాగ్య పథకం కింద ఉచిత కనెక్షన్లు జారీ చేయరాదు. - గ్రామ పంచాయతీలు, ఇతర ప్రభుత్వ సం స్థల ద్వారా విద్యుత్ కనెక్షన్ల జారీకి దరఖాస్తుల స్వీకరణ, విద్యుత్ బిల్లుల పంపిణీ, బిల్లుల వసూళ్లు జరపాలి. - వినియోగదారులకు సంబంధించిన ఆధార్ నంబర్/మొబైల్ నంబర్/బ్యాంక్ ఖాతా నంబర్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ ఐడీ తదితర వివరాలను దరఖాస్తుతోపాటు సేకరించాలి. - విద్యుత్ సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతా ల్లోని గృహాలకు సౌర విద్యుత్ ఫలకాలు బిగించడం ద్వారా విద్యుత్ అందించాలి. ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ నిల్వ కోసం 200–300 వాట్స్ బ్యాటరీతోపాటు ఇంటికి 5 ఎల్ఈడీ దీపాలు, ఒక ఫ్యాన్, ఒక పవర్ ప్లగ్‌ను ఉచితంగా ఇవ్వాలి. ఇళ్లకు ఏర్పాటు చేసే సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లపాటు మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది. -
వచ్చే ఏడాదీ ప్రస్తుత విద్యుత్ చార్జీలే...
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంచుతూ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు రాష్ట్రంలో ప్రస్తుత చార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18)లో కూడా అమలు కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇంకా సమర్పించకపోవడంతో వచ్చే ఏడాదికి సంబంధించి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోయామని తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో తదుపరి నిర్ణయం వరకు ప్రస్తుత చార్జీలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనల సమర్పణకు డిస్కంలు ఏప్రిల్ 15 వరకు గడువు కోరాయి. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి కొత్త టారిఫ్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కనీసం 45 రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశముందని ఈఆర్సీ వర్గాలు తెలిపాయి. -
8,922 కోట్ల అప్పు తీరింది!
⇒ ఉదయ్ పథకంతో డిస్కంలకు రుణ విముక్తి ⇒ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు అప్పు బదిలీ ⇒ అంతమేర బాండ్ల వేలానికి కేంద్రం అనుమతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) రుణ భారం తీరిపోతోంది. ‘ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన (ఉదయ్)’పథకంలో చేరడంతో డిస్కంలకు సంబంధించిన 75 శాతం అప్పులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు రూ.8,922.93 కోట్ల విలువైన బాండ్ల జారీకి కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల మేరకు బాండ్ల వేలానికి చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఆర్బీఐకి లేఖ రాసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని కోరింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల చివరి వారం, మార్చి తొలి వారంలో డిస్కంల అప్పుకు సరిపడే మొత్తాన్ని బాండ్ల విక్రయం ద్వారా సమీకరించేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ‘ఉదయ్’నిబంధల మేరకే.. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చడం, విద్యుదుత్పత్తి ఖర్చును తగ్గించడం లక్ష్యాలుగా కేంద్రం ‘ఉదయ్’పథకాన్ని చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అందులో చేరాయి. రెండు నెలల కింద తెలంగాణ కూడా ఉదయ్‌లో చేరడంపై కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్రంలోని రెండు డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం డిస్కంలు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లకు కలిపి రూ.11,897 కోట్ల అప్పులున్నాయి. తాజాగా ‘ఉదయ్’లో చేరడంతో అందులో రూ.8,922.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల నుంచి విముక్తి పొందడంతో పాటు ఏటా రూ.387 కోట్ల మేర వడ్డీ చెల్లించే భారం నుంచి ఉపశమనం లభిస్తోంది. ఇక మిగిలిన రుణాలకు విద్యుత్ పంపిణీ సంస్థలు బాండ్ల రూపంలో హామీ ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల వేలం ద్వారా రూ.13 వేల కోట్ల మేర అప్పులు చేసింది. తాజాగా డిస్కంల రుణ భారం కూడా తోడుకానుంది. -
‘గ్రేటర్’కు కాసుల పంట..
జీహెచ్ఎంసీకి భారీగా సమకూరిన ఆదాయం ► ఆస్తి పన్ను కింద శుక్రవారం ఒక్కరోజే రూ.50 కోట్ల రాబడి ► గ్రేటర్ లో వివిధ ప్రభుత్వ సంస్థలకు రూ.100 కోట్ల వసూలు ► కిటకిటలాడిన ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవా సెంటర్లు ► 14వ తేదీ వరకూ పన్ను చెల్లింపుల గడువు పొడిగింపు ► సెలవు దినాల్లోనూ పన్నులు, వినియోగ చార్జీల చెల్లింపునకు అవకాశం ► ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను, నీటి, విద్యుత్ బిల్లులు తదితర ఫీజులను పాత రూ.500, రూ.1,000 నోట్ల ద్వారా చెల్లించేందుకు వినియోగదారులకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ గడువు ఇవ్వడంతో ‘గ్రేటర్’కు కాసుల పంట పండింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను చెల్లింపుల కింద శుక్రవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు రూ.48 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తం రూ.50 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్నే. సాధారణ రోజుల్లో రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలవుతుంది. కానీ శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 50 కోట్ల వరకూ ఆస్తి పన్ను వసూలవ్వడం గమనార్హం. కాగా, అన్ని రకాల బిల్లులు, పన్నులు వెరసి గ్రేటర్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలకు దాదాపు రూ.100 కోట్ల రాబడి వచ్చింది. పాత నోట్లతో పన్నులు, వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ప్రజలు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ పౌరసేవా కేంద్రాలు(సీఎస్సీలు), మీసేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను మొత్తంతోపాటు పాత బకాయిల చెల్లింపులకూ అవకాశం ఉండటంతో అనేక మంది బకాయిలతో సహా చెల్లించారు. మరికొందరు అడ్వాన్సగా రెండు, మూడేళ్ల ఆస్తి పన్ను ముందస్తుగానే కట్టేందుకు ముందుకొచ్చినా.. వాటిని స్వీకరించలేదు. జీహెచ్ఎంసీలోని పౌరసేవా కేంద్రాలతోపాటు బిల్ కలెక్టర్లకు.. మీసేవా, ఏపీ ఆన్లైన్, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లించారు. మీసేవా కేంద్రాల ద్వారా దాదాపు లక్షమంది వివిధ రకాలైన పన్నులు, ఫీజుల్ని చెల్లించినట్టు సమాచారం. భారీ మొత్తంలో బకాయిలు ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులతో జీహెచ్ఎంసీ అధికారులు సంప్రదింపులు జరపడంతో పలువురు బకాయిలు చెల్లించారు. మొత్తంగా ఆరు వేల మందికి పైగా తమ ఆస్తిపన్ను చెల్లించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సంస్థల ఆదాయం జీహెచ్ఎంసీ : రూ.50 కోట్లు జలమండలి : రూ.15 కోట్లు విద్యుత్‌శాఖ : రూ.30 కోట్లు హెచ్ఎండీఏ : రూ.4.10 కోట్లు డిస్కంకు రూ.71 కోట్లు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు పాత నోట్ల స్వీకరణతో శుక్రవారం ఒక్కరోజే రాత్రి 7 గంటల వరకు రూ.71 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు సర్కిళ్ల నుంచి రూ.30 కోట్ల బిల్లులు రాగా, జిల్లాల నుంచి రూ.41 కోట్లు వసూలైనట్లు డిస్కం ఆపరేషన్స డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. 14 వరకూ చెల్లింపులు జరపొచ్చు.. తమ పిలుపునకు స్పందించిన ప్రజలకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం మరో 72 గంటలపాటు పాత నోట్లను చెల్లింపులకు అనుమతించడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచు కోవాలని మేయర్ సూచించారు. భవన నిర్మాణ అనుమతులకు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో ఫీజు సమా చారం జనరేట్ అరుున వారు, పాత బకారుులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చెల్లింపుల కోసం శుక్రవారం పౌరసేవా కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు సోమవారం వరకు కొనసాగుతాయని చెప్పారు. సెలవు దినాల్లోనూ పనిచేస్తాయ న్నారు. ట్రేడ్ లెసైన్సుల రెన్యువల్, వేకెంట్ ల్యాండ్ టాక్స్ తదితర మైన వాటికి పాతనోట్లతో చెల్లింపులు జరపొచ్చని స్పష్టం చేశారు. సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజుల కోసం చెల్లించే పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించిన వారు వాటిని ఉపసంహరించుకుని పాతనోట్లతో నగదు చెల్లించవచ్చన్నారు. పాతనోట్లతో చెల్లించే ఈ పన్నులకు, ఇన్‌కమ్‌ట్యాక్స్‌కు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జలమండలికి రికార్డు ఆదాయం.. పాత నోట్ల స్వీకరణతో జలమండలికి శుక్రవారం రికార్డు స్థారుులో ఆదాయం సమకూరింది. క్యాష్ కౌంటర్లు, ఆర్టీజీఎస్, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా సుమారు 53 వేల మంది వినియోగదారులు పెండింగ్ నీటి బిల్లులు చెల్లించారు. దీంతో రూ.15 కోట్ల ఆదాయం లభించినట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. పాతనోట్ల స్వీకరణ గడువును కేంద్రం పొడిగించడంతో జలమండలికి సుమారు రూ.50 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు వసూలవుతాయని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, జలమండలికి నెలవారీగా నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీ ద్వారా సుమారు రూ.90 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. -
బడాబాబులకి దోచిపెట్టి.. భారం ప్రజలపైనా?
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాగ్రహం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలపై విద్యుత్ భారం మోపడం ఏమిటని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రజా సంఘాలు నిలదీశాయి. పంపిణీ సంస్థల నష్టాలకు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు కారణం కాదా అని ప్రశ్నించాయి. కాంట్రాక్టుల విషయంలో సాక్షాత్తూ సీఎంపైనే అవినీతి ఆరోపణలు వచ్చిన వైనాన్ని గుర్తుచేశాయి. రూ. 5,145 కోట్ల వార్షిక ఆర్థిక లోటు ఉన్నట్టు తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి తెలిపాయి. దీనిని పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతినివ్వాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ కార్యాలయంలో సోమవారం బహిరంగ ప్రజా విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రఘు, రామ్మోహన్ పాల్గొన్నారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు: జెన్కో ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టు వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. సోలార్ ప్రాజెక్టులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలవి కావా? అని ప్రశ్నించారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. -
వివాదంలో థర్మల్ ‘పవర్’
థర్మల్ పవర్‌టెక్ నుంచి 570 మెగావాట్ల కొనుగోళ్లకు డిస్కంల ఒప్పందం అక్రమాలు జరిగాయని ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లిన నిపుణులు సాక్షి, హైదరాబాద్: థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీపీసీఐఎల్) సంస్థ నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వస్తున్నాయి. యూనిట్‌కు రూ. 4.15 చొప్పున 570 మెగావాట్ల కొనుగోళ్లకు సంబంధించిన ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ సంస్థ కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాలరావు ఆరోపించారు. టెండర్లలో థర్మల్ పవర్‌టెక్ కంపెనీ ఒకటే ‘సింగిల్ బిడ్’గా పోటీలో మిగిలేలా డిస్కంలు చక్రం తిప్పాయని పేర్కొన్నారు. బహిరంగ విచారణ నిర్వహించకుండా ఆమోదించిన ఈ ఒప్పందంపై పునః సమీక్ష జరపాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీ) చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్‌కు ఆయన గురువారం వినతి పత్రం అందజేశారు. రూ. 2,784 కోట్ల భారం... థర్మల్ పవర్‌టెక్ సంస్థ తొలిదశ ప్రాజెక్టు నుంచి యూనిట్‌కు రూ.3.58 చొప్పున 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్లకు మూడేళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగు డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నా యి. అందులో స్థిరచార్జీ రూ.1.82 మాత్రమే. తాజా గా తెలంగాణలోని రెండు డిస్కంలు ఇదే కంపెనీ రెండోదశ ప్లాంట్ల నుంచి యూని ట్‌కు రూ.4.15 చొప్పున 570 మెగావాట్ల కొనుగోళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతేగాకుండా రెండోదశ స్థిర చార్జీలను యూనిట్‌కు రూ.2.64గా నిర్ణయించారు. తొలిదశతో పోల్చితే ఈ స్థిర చార్జీలు యూనిట్‌కు 82పైసలు అధికం. ఈ లెక్కన వినియోగదారులపై ఏటా రూ. 348 కోట్ల చొప్పున 8 ఏళ్ల ఒప్పంద కాలంలో రూ. 2,784 కోట్ల అదనపు భారం పడుతుందని వేణుగోపాలరావు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. థర్మల్ పవర్టెక్తో డిస్కంలు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్ అండ్ ఆపరేట్(డీబీఎఫ్ఓఓ) పద్ధతిలో కొనుగోళ్ల కోసం కేంద్రం రూపొం దించిన ప్రామాణిక బిడ్డింగ్ డాక్యుమెంట్‌కు రెండు పర్యాయాలు సవరణలు జరిపి థర్మల్‌పవర్ టెక్ మాత్రమే బిడ్డింగ్‌లో మిగిలే విధంగా టెండర్లను నిర్వహించారని పేర్కొన్నారు. పారదర్శకత కోసం ఈ ఒప్పందంపై సుమోటోగా పునః సమీక్ష జరపాలని కోరారు. థర్మల్ పవర్‌టెక్ కంపెనీ ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందినది కావడం గమనార్హం. -
సిబ్బంది తక్కువ... ఒత్తిడి ఎక్కువ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని జిల్లా ఇంజినీర్లు గగ్గోలు పెడుతున్నారు. ఒత్తిడి భారంతో లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. దీంతో వీరికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేస్తున్నారు. ఓ వైపు కొత్త నియామకాలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లేకపోవడం, మరోవైపు ఉన్న సిబ్బంది సెలవులు పెట్టడం, వ్యక్తిగత విషయాలపై విధులకు హాజరుకాలేకపోవడంతో ఆరునెలలుగా ఆదాయ సేకరణలో(సంస్థకు రెవెన్యూ రప్పించడం) వెనుకబడిపోతున్నారు. వాస్తవానికి తమది సర్వీస్ విభాగ మేనని ఈపీడీసీఎల్ చెబుతున్నా నెలవారీ రెవెన్యూ వసూళ్లలో వెనుకబడిన ఇంజినీర్లకు మెమోలిస్తుండడంతో ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో కనీసం 1200మంది కొత్త సిబ్బందిని ఇప్పటికిప్పుడు నియమించాల్సిందేనని అధికారులు తేల్చి ప్రభుత్వానికి లేఖ రాసినా అటు నుంచి స్పందన లేదు. పనిభారం ఎక్కువ జిల్లాలో సుమారు ఏడువేల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు(డీటీ) ఉన్నాయి. 34 సెక్షన్లలో ఒక్కోసెక్షన్ పరిధిలో కనీసం 20 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క సర్వీసుకు సగటున 75 యూనిట్ల విద్యుత్ వినిమయం అవుతోంది. యూనిట్ ధర కనీసం రెండు రూపాయలైతే వీటి ద్వారా నెలకు సుమారు రూ. 22 కోట్ల(లోవర్, హై టెన్షన్ కనెక్షన్ల ద్వారా) ఆదాయం వస్తోంది. ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే 60 వేల కనెక్షన్లకు రూ. 7కోట్ల వరకూ రెవెన్యూ జమ అవుతోంది. వీటిల్లో 90 శాతం గృహ విద్యుత్ కనెక్షన్లే. ఆయా కనెక్షన్ల పరిధిలో కండెక్టర్ల నిర్వహణ, ఫ్యూజ్ ఆఫ్ కాల్, 600 ట్రాన్స్ఫార్మర్ల పర్యవేక్షణకు కేవలం ఇద్దరు ఏఈలు, ఒక ఏడీఈ, 30 మంది సిబ్బంది(వర్క్‌మెన్) ఉన్నారు. పట్టణం సహా శ్రీకాకుళం రూరల్, గార మండలాల కనెక్షన్లూ వీరే పర్యవేక్షించాలి. దీంతో వీరికి పనిభారం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ప్రతి 500 కనెక్షన్లకూ ఓ ఇంజినీర్ అవసరం అని అప్పట్లోనే గుర్తించారు. నాలుగు సెక్షన్లలో కనీసం నలుగురు ఇంజినీర్లు ఉండాలన్నది నిబంధన. వీరంతా పై విధులతో పాటు విద్యుత్ స్తంభాల మరమ్మతులు కూడా చేయించాలి. ఇదంతా చూస్తూనే నెలవారీ 100 శాతం రెవెన్యూ కలెక్షన్లు చేయాలంటూ ఆదేశాలొస్తున్నాయని ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే మెమోలు తప్పవంటున్నారు. రికవరీలకు సంబంధించి ఆర్ఆర్ యాక్ట్ అమలుపైనా తమపై ఒత్తిడి పడుతోందని వాపోతున్నారు. అధికారుల పరిస్థితీ అంతే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఓ ఎస్ఈ స్థాయి అధికారి, 34 సెక్షన్ల ఇంజీనీర్లు, రెండు డివిజన్లకు డీఈలు, 10 మంది ఏడీఈలు, 600 మంది వర్క్‌మెన్ ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లుంటే విద్యుత్ శాఖ పరిధిలో ఇద్దరే అధికారులు ఉన్నారు. అదే విధంగా 13 మంది ఉండాల్సిన ఏడీఈలు 10మందే ఉన్నారు. కనీసం 1000 మంది ఉండాల్సిన వర్క్‌మెన్ కేవలం 600 మందే పనిచేస్తున్నారు. ప్రతీసెక్షన్కూ ఓ ఇంజినీర్ తప్పనిసరి అంటున్నా ఉన్న ఏఈలు ఇతర విధులకు కూడా హాజరుకావాల్సివస్తోంది. ఎల్డీసీ స్థాయి నుంచి చీఫ్ ఇంజినీర్(సీజీఎం స్థాయితో కూడా) వరకు భారీ స్థాయిలో పోస్టులు ఖాళీలు ఉన్నా కొన్నాళ్ల నుంచి భర్తీ చేయకపోవడంపైనా ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లుంటే భవిష్యత్‌లో పనిచేయలేం అని కిందిస్థాయిలో ఉన్న వర్క్‌మెన్ కూడా చెప్పేస్తున్నారు. చాలా ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న సిబ్బంది స్థానంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టేస్తుండడంతో కార్పొరేషన్‌ను కూడా ప్రైవేటీకరణ చేసేస్తారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ లోడ్ టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పలాస, పాతపట్నం, సోంపేట, రాజాం, సీతంపేట, శ్రీకాకుళం, రూరల్ సబ్ డివిజన్ల పరిధిలో 38 సెక్షన్లకు ఒక్కో ఇంజినీర్ అధికారి ఉన్నప్పటికీ కిందిస్థాయి, పై స్థాయి అధికారుల సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో వర్క్‌మెన్ పని కూడా కొన్ని చోట్ల ఏఈలే చేయాల్సివస్తోంది. ఈ నెలాఖరువరకు పరిస్థితి చూస్తాం అని అధికారులు, సంస్థలో మార్పు కనిపించకపోతే మూకుమ్మడి ఆందోళనకు రంగం సిద్ధం చేసుకుంటామని ఓ ఇంజినీర్ స్పష్టం చేశారు. -
ఉద్యోగ భర్తీ నిబంధనల సవరణపై పిటిషన్లు
♦ పోస్టులన్నీ తెలంగాణ వారితోనే భర్తీ చేసే యత్నం ♦ ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ♦ హైకోర్టుకు నివేదించిన పిటిషనర్లు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ నిబంధనలకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోలతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలు సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు విద్యుత్ సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం చేపడతామంది. చల్లా నర్సింహారెడ్డి, మరికొందరు దాఖలుచేసిన ఈ వ్యాజ్యాలను తొలుత విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ రెడ్డి కాంతారావు.. ఇవి ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి వస్తాయి కాబట్టి, వీటిని ధర్మాసనం విచారించడమే సబబంటూ వాటిని ధర్మాసనానికి నివేదించారు. ఈ నేపథ్యంలో వీటిని బుధవారం ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ, ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్లుగా విభజించాయని తెలిపారు. ఈ రెండు జోన్లలో ఏదో ఒక జోన్లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి విద్యాభ్యాసం చేసిన వారిని స్థానికులుగా పరిగణిస్తారన్నారు. 70 శాతం తెలంగాణలో రెండు జోన్లకని చెబుతూ, మిగిలిన 30 శాతం పోస్టులను స్థానికేతరులకు అంటున్నారని, ఆ 30 శాతం తెలంగాణలోని అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారని వివరించారు. ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఒకవేళ అటువంటి రిజర్వేషన్లు కల్పించాలంటే అది పార్లమెంట్ మాత్రమే చేయాలని, విద్యుత్ సంస్థలు కాదన్నారు. ప్రాథమికంగా ఈ వాదనల్లో కొంత బలముందని, కాబట్టి పూర్తి వివరాలను తమ ముందుంచాలని విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
♦ ఆ మేర పంపిణీ సంస్థలను ఆదేశించండి ♦ హైకోర్టులో ప్రొఫెసర్ హరగోపాల్ పిల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను పంపిణీ సంస్థలు క్రమబద్ధీకరించేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వారికి ఇతర ఉద్యోగుల్లాగానే చట్ట ప్రకారం సమాన జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్కో, ట్రాన్స్‌కో డెరైక్టర్లు, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ పంపిణీ సంస్థల ఎండీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. కొత్తగూడెం, భూపాలపల్లి, శ్రీరామ్‌సాగర్, రామగుండం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల పరిధిలోని సబ్స్టేషన్లు, ఇతర విద్యుత్ పంపిణీ కేంద్రాల్లో మూడు దశాబ్దాలుగా 2,500 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారని, వీరి సర్వీసులను ఇప్పటివరకు క్రమబద్ధీకరించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హరగోపాల్ పిటిషన్లో పేర్కొన్నారు. కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వివాద పరిష్కారానికి తాను మధ్యవర్తిగా వ్యవహరించానని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పష్టమైన హామీనిచ్చినా నేటికీ నిలబెట్టుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న షిఫ్ట్ ఇన్చార్జి, ఆపరేటర్ల జీతాలకు, శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న షిఫ్ట్ ఇన్చార్జి, ఆపరేటర్ల జీతాలకు ఎంతో వ్యత్యాసం ఉందని, ఇది ఒకే పనికి ఒకే జీతం చెల్లించాలన్న చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని వినతిపత్రాల ద్వారా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. -
పవర్ షాక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ వినియోగదారులకు త్వరలో చార్జీల షాక్ కొట్టనుంది. చార్జీలను పెంచుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. త్వరలో ఈ చార్జీల పెంపునకు సర్కారు సైతం అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది. దీంతో జిల్లాలోని వినియోగదారులపై రూ.185.07కోట్ల భారం పడనుంది. చార్జీల పెంపు ప్రక్రియను పలు శ్లాబులుగా విభజించి పంపిణీ సంస్థలు వాత పెట్టనున్నాయి. అయితే 100 యూనిట్లు వాడే వినియోగదారులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మిగతా అన్ని కేటగిరీలపైనా చార్జీల భారం పడనుంది. పెంచిన చార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతంలో 21,52,737 విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందుకు ప్రతిరోజు 23.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందు లో గృహావసరాలకు 6.11 మిలియన్ యూనిట్లు, పరిశ్రమలకు 5.17 మిలియన్ యూనిట్లు, వ్యవసాయానికి 7.05 మిలియన్ యూనిట్లు, ఇతర అవసరాలకు 5.17 యూనిట్లు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ ద్వారా జిల్లా నుంచి పంపిణీ సంస్థకు వార్షికాదాయం రూ.3,214.36 కోట్లు సమకూరుతుంది. తాజాగా చార్జీలను పెంచనుండడంతో జిల్లా నుంచి అదనంగా రూ.185.07 కోట్ల ఆదాయం డిస్కంలకు పెరగనుంది. ఈ లెక్కన పంపిణీ సంస్థ జిల్లా నుంచి ఆరు శాతం ఆదాయం అధికం కానుంది. విభజించి.. వడ్డించి.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపులో వంద యూనిట్లలోపు వాడే వినియోగదారులకు చార్జీలో పెంపు లేదు. కానీ అంతకు ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా చార్జీలు పెరగనున్నాయి. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన గణాంకాల ప్రకారం.. నెలకు 150 యూనిట్లు వాడే వినియోగదారుడికి ప్రస్తుతం రూ.440 బిల్లు వస్తుంది. తాజా పెంపుతో ఈ బిల్లు రూ.457.50కు పెరగనుంది. 200 యూనిట్లు వినియోగిస్తున్న వారికి ప్రస్తుత బిల్లు రూ.620 వస్తుండగా.. పెంపు ప్రక్రియతో ఈ బిల్లు రూ.645కు చేరనుంది. నెలకు 200 యూనిట్లు దాటితే నెలబిల్లులో రూ.50, అదేవిధంగా 250 యూనిట్లు దాటితే నెల వారీ బిల్లులో రూ.70 పెరుగుతుంది. ఇలా కేటగిరీల వారీగా విభజించి వినియోగదారులకు వాతలు పెట్టింది. -
పవర్ షాక్
ఏడాదికి రూ.495 కోట్లు మధ్య తరగతిపై విద్యుత్ భారం వంద యూనిట్ల లోపు పాత ఛార్జీలే 20 లక్షల మందిపై భారం సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులు ఇకపై మరింత పొదుపుగా విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే భారీగా బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లులు పెంచడం ద్వారా నగర వాసులకు సర్కారు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల మహా నగరంలోని 20 లక్షల మంది వినియోగదారులపై విద్యుత్ బిల్లుల రూపంలో ఏడాదికి రూ.495 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే నిత్యవసరాలు, ఇతరత్రా పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులు ఈ దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. 2015-16 సంవత్సరానికి విద్యుత్తు పంపిణీ సంస్థ సమర్పించిన కొత్త చార్జీల ప్రతిపాదనల ప్రకారం.. వివిధ కేటగిరీల్లో 4 నుంచి 5.75 శాతం వరకు పెరిగాయి. ఒక్కో యూనిట్‌పై కనిష్ఠంగా 10 పైసల నుంచి 48 పైసల వరకు పెంచుతూ ప్రతిపాదించారు. కొత్త టారిఫ్ ప్రకారం వంద యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు పాత చార్జీలే వర్తిస్తాయి. 101-200 యూనిట్ల మధ్య వినియోగించే గృహాలకు నాలుగు శాతం చార్జీలు పెరుగుతాయి. మిగిలిన అన్ని కేటగిరీలకూ 5.75 శాతం వడ్డించారు. పరిశ్రమల కేటగిరిలో చార్జీలు 4.75 శాతం పెరగనున్నాయి. 200 యూనిట్లు దాటితే బాదుడే... 200 యూనిట్లు దాటితే శ్లాబ్ పద్ధతిలో రేట్లు వర్తిస్తాయి. దీంతో వినియోగదారులపై భారీగానే భారం పడనుంది. 200 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి గృహాల కరెంటు బిల్లు రూ.600 నుంచి రూ.625కు పెరగనుంది. ఆ పైన ఒక్క యూనిట్ విద్యుత్ అదనంగా వాడినా అమాంతం రూ.872.75కు చేరనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్ల వివరాలు గృహ విద్యుత్ కనెక్షన్లు : 30.90 లక్షలు వాణి జ్య : 5.50 లక్షలు చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు : 40 వేలు ప్రకటనలు, వీధి దీపాలు : 40 వేలకు పైనే -
బకాయిలు రూ.1,500 కోట్లు
ప్రభుత్వ విభాగాల కరెంటు బిల్లుల తీరిది నెలనెలా పెరిగిపోతుండడంతో డిస్కంలపై ఆర్థిక భారం ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయాలని ఇంధనశాఖ ప్రతిపాదన హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలకు చెందిన కరెంటు బకాయిలు రూ.1,500 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇవి మరింత షాక్ కొడుతున్నాయి. ఏటా సబ్సిడీల భారంతో పాటు సర్కారు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు డిస్కంలకు తడిసి మోపెడవుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు రాబట్టుకోకపోతే వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక డిస్కంలను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీ ఏమూలకు సరిపోవటం లేదని డిస్కంలు పదేపదే చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రతి నెలా రూ.100 కోట్ల సబ్సిడీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే తరహాలో సర్కారు విభాగాల కరెంటు బకాయిలను సర్దుబాటు చేస్తే డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఇటీవలే ఇంధన శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నివేదిక ప్రకారం 13 విభాగాలు డిస్కంలకు రూ.1,453 కోట్లు బకాయి పడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు వరకే టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.961 కోట్లు, టీఎస్ఎన్పీడీసీఎల్కు రూ. 492 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడచిన మూడు నెలల్లో ఈ బకాయిల భారం మరో రూ.50 కోట్లు పెరిగిందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. తాగునీటి, సాగునీటి అవసరాలు, వీధిదీపాలతో ముడి పడి ఉన్న నాలుగు విభాగాలకు చెందిన బకాయిలే 80 శాతానికి మించి ఉన్నాయి. అత్యధికంగా పంచాయతీరాజ్ విభాగం రూ.885 కోట్లు, మున్సిపాలిటీలు రూ.153 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై విభాగాల రూ. 145 కోట్ల కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్షేత్ర స్థాయి నుంచి వసూలు చేయకుండా.. శాఖాపరమైన పద్దుల సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. -
కృష్ణపట్నం.. డబుల్ దగా
రెండో యూనిట్ ట్రయల్ రన్ ఈ వారం నుంచే ప్రయోగాత్మక ఉత్పత్తి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వాటాల పంపిణీ వ్యత్యాసం పెరిగిపోతోంది. తెలంగాణకు కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్తు వాటాల లోటు రెండింతలకు పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణపట్నంలో రెండో యూనిట్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. సోమవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వారం నుంచే ఇన్ఫర్మ్ పవర్ (ప్రయోగాత్మక దశ) ఉత్పత్తి మొదలవనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం ప్లాంట్‌లో 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఉత్పత్తి కొనసాగుతోంది. మార్చి నుంచి ఇప్పటివరకు అందులో ఒక్క యూనిట్‌నూ తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ అడ్డుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి 53.89 శాతం విద్యుత్తు తెలంగాణ డిస్కంలకు రావాల్సి ఉంది. వాటా ప్రకారం మొదటి యూనిట్ విద్యుత్తు రాకపోవటంతో గడచిన తొమ్మిది నెలల్లో దాదాపు రూ.120 కోట్లు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రెండో యూనిట్ కూడా ప్రారంభమవుతుండటంతో... ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ చేస్తుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొండికేస్తే.. విద్యుత్తు వాటాల పంపిణీపై మరింత పట్టు పట్టాలని తెలంగాణ జెన్కో, డిస్కం అధికారులు భావిస్తున్నారు. చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాల పంపిణీ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఇటీవలే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం రెండో యూనిట్లో విద్యుదుత్పత్తి ఎటువైపు మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. -
బకాయిల భారం
కడప అగ్రికల్చర్: వివిధ ప్రభుత్వ శాఖలు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ నష్టాల షాక్‌కు గురవుతోంది. అధిక ధరలకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంతో సంస్థ తీవ్ర రుణ భారంలో చిక్కుకు పోయింది. ఈ ఊబి నుంచి బయట పడేందుకు సంస్థ సాధారణ వినియోగదారుడిపై భారాల బండమోపుతోంది. పదులు, వందల్లో ఉన్న బిల్లులు చెల్లించడం ఆలస్యమైతేనే సామాన్యులను నానా విధాలుగా వేధించే విద్యుత్ అధికారులు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, చిన్న, పెద్ద పరిశ్రమల బకాయిలపై ఎందుకు ఔదార్యం ప్రదర్శిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రూ.114 కోట్ల బకాయిలు.. 14 విద్యుత్ రెవెన్యూ ఆఫీసుల పరిధిలో శాఖకు రావాల్సిన బకాయి ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.1.08 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.6.36 కోట్లు ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి వీధి దీపాలు, తాగునీటి పంపింగ్ స్కీములు, పంచాయతీ కార్యాలయాల నుంచి రూ.51.44 కోట్లు, కోర్టుల్లో వివిధ కేసులు ఉండటం వల్ల రూ.12.53 లక్షలు, ఆర్ఆర్ యాక్టు ఉపసంహరించుకోవడం వల్ల రూ.83 వేలు, సర్వీసుల తొలగింపు బకాయి రూ.18.40 కోట్లు, లైవ్ సర్వీసుతో ఆగిన బకాయి రూ.4.16కోట్లు, బిల్లులు నిలిపి వేయడంతో ఆగిన బకాయి రూ.13.48 కోట్లు విద్యుత్ సంస్థకు రావాల్సి ఉంది. అలాగే హెచ్‌టీ సర్వీసుల నుంచి మరో రూ.10.26 కోట్లు బకాయి అందాల్సి ఉంది. ఈ మొండి బకాయిలను రాబట్టేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇటీవల సీఎండీ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ప్రతి రోజు అధికారులు బకాయి ఎంత రాబట్టింది పక్కాగా ఒక నివేదికను జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో అందిస్తున్నారు. ఆ నివేదికను తిరుపతిలోని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కార్యాలయానికి పంపుతున్నారు. నిన్న మొన్నటి వరకు నోటీసులకే పరిమితమైన అధికారులు ఏకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బకాయిల వసూలుకు దిగారు. ఇటీవల జిల్లా పరిషత్ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేయడంతో ఆగమేఘాల మీద పెండింగ్ బకాయిలో కొంత మొత్తాన్ని చెల్లించినట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. ఈ పద్ధతిని మిగిలిన శాఖల కార్యాలయాలకు కూడా వర్తింప చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పెషల్ డ్రైవ్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న అధికారులు.. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు గ్రాంటు నిధులు విడుదల చేసినప్పుడు అందులో కొంత మొత్తాన్ని విద్యుత్ బకాయిల కింద తమ శాఖకు కొంత మొత్తాన్ని బదలాయించి ఉంటే సంస్థకు ఇబ్బంది వచ్చేది కాదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల నుంచి దాదాపు రూ.55 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయని ఆయా సంస్థల ఉన్నతాధికారుల కార్యాలయాలకు ఇది వరకే నోటీసులు పంపినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. భీష్మించిన స్థానిక సంస్థల అధ్యక్షులు.... జిల్లాలో స్థానిక సంస్థలకు ఎన్నికైన అధ్యక్షులు విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే 13 ఫైనాన్స్ గ్రాంటు నుంచి విడుదలైందని ఆ నిధులన్నీ రూ. 51.44 కోట్లు విద్యుత్ పాత బకాయిలకు చెల్లిస్తే ఇక అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. గతంలోని అధ్యక్షులు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. -
అల్పాదాయ వర్గాలకు ఉపశమనం!
* విద్యుత్ చార్జీల పెంపుపై డిస్కంల కసరత్తు పూర్తి * 200 యూనిట్ల వరకు 50 పైసలు పెంచాలని ప్రతిపాదన * ఉన్నత వర్గాలు, పరిశ్రమలపైనే అధిక భారం * కనీసం యూనిట్‌కు రూ. 2 పెంచాలని యోచన * హెచ్‌టీ కేటగిరీల విలీనంతో మరింత ఆదాయం * ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించాక తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతి పాదనలపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. విద్యుత్ కోతలతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో వెనుకాముందాడుతోంది. పేద, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా చార్జీల పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు సూచించింది. దీంతో వార్షిక సగటు రాబడి అంచనా(ఏఆర్ఆర్)ల తయారీలో డిస్కంలు ఆఖరి కసరత్తు చేస్తున్నాయి. ‘ఏఆర్ఆర్ల తయారీ దాదాపుగా పూర్తయింది. ఈఆర్సీ ఇచ్చిన గడువు ప్రకారం 12వ తేదీన సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొత్త రాష్ట్రం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై భారం మోపకూడదనేది సర్కారు ఆలోచన. 0-200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు దాదాపు ఇప్పుడున్న చార్జీలే అమలవుతాయి. ఒక్కో యూనిట్‌పై కనీసం 50 పైసలు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రికి నివేదించేందుకు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేశాం. అల్పాదాయ వర్గాలపై 50 పైసల చొప్పున పెంచితే వారిపై ఎంత భారం పడుతుంది... ఇప్పుడున్న రేటునే కొనసాగిస్తే విద్యుత్ సంస్థలకు ఎంత నష్టం వస్తుంది వంటి విశ్లేషణలను అందులో పొందుపరిచాం. 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడే ఎల్టీ, హెచ్‌టీ కేటగిరీలన్నింటిలోనూ ఒక్కో యూనిట్‌పై కనీసం రూ. 2 చొప్పున పెంచాలనే ఆలోచన ఉంది. హెచ్‌టీ కేటగిరీలను విలీనం చేసే ప్రతిపాదనలున్నాయి. పీక్ అవర్స్‌లో అదనపు చార్జీలు కొనసాగుతాయి. అధికాదాయ వర్గాలు, పరిశ్రమల నుంచి ఎక్కువ చార్జీలను రాబట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి సూచనల మేరకు చార్జీల పెంపు ప్రతిపాదనల్లో తుది మార్పులు చేస్తాం’ అని ఏఆర్ఆర్ తయారీలో పాలుపంచుకున్న ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పెంపును 20 శాతానికి కట్టడి చేసే యత్నం చార్జీల పెంపు ద్వారా వచ్చే ఏడాదిలో రూ. 4695 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకునేం దుకు డిస్కంలు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ప్రస్తుతమున్న చార్జీలను 22.52 శాతం పెంచాల్సి ఉంటుంది. కానీ అల్పాదాయ వర్గాలపై భారం లేకుండా సర్దుబాటు చేయడానికి ఈ పెంపును 15 నుంచి 20 శాతానికి కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం హెచ్‌టీ విభాగంలోని ఏడు కేటగిరీలను విలీనం చేస్తే ఆదాయం పెరుగుతుందని డిస్కంలు యోచిస్తున్నాయి. పరిశ్రమలు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కాలనీలు, సీజనల్ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు వంటివి వివిధ కేటగిరీలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు రూ. 4.58 నుంచి రూ. 5.41 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ కేటగిరీని తొలగించి ఇతర పరిశ్రమలతో విలీనం చేస్తే తమపై చార్జీల భారం ఎక్కువగా పడుతుందని ఆ పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏఆర్‌ఆర్‌లు సమర్పించే గడువును తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) ఈ నెలాఖరుకు పొడిగించే అవకాశముంది. షెడ్యూల్ ప్రకారం 12వ తేదీలోగా ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని డిస్కంలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈఆర్సీ చైర్మన్‌తోపాటు సభ్యులంతా ప్రస్తుతం అధికారిక పర్యటనపై కొచ్చిన్‌లో ఉన్నారు. వారంతా ఈ నెల 13న తిరిగి విధులకు హాజరవుతారు. దీంతో ఏఆర్ఆర్ల సమర్పణకు గడువు పొడిగించనున్నట్లు తెలిసింది. -
ఆధార్ కోసం వేధించకండి: అజయ్ జైన్
సాక్షి, హైదరాబాద్: ఆధార్ సంఖ్య ఇవ్వని రైతుల వ్యవసాయ కనెక్షన్లు తొలగించవద్దని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. సరఫరా నిలిపివేస్తే తమ దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. అన్ని రకాల సమాచారం కోసమే కనెక్షన్లకు ఆధార్ లింకేజీ పెట్టామని, ఇది కేవలం వ్యవసాయ వినియోగదారులకే పరిమితం కాదని స్పష్టం చేశారు. దీనికి గడువు విధించడం సరికాదని, ఇలా చేసినందుకు డిస్కమ్‌ల అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తామంటుంటే, ఆపివేసే అధికారం తమకెక్కడిదన్నారు. ‘ఆధార్ లేకుంటే ఉచిత విద్యుత్ కట్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వార్త ప్రచురితమైన నేపథ్యంలో అజయ్ జైన్ డిస్కమ్‌ల సీఎండీలతో చర్చించారు. అనంతరం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. రైతుల వ్యవసాయ కనెక్షన్లు తొలగించొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఆధార్‌కు, ఉచిత విద్యుత్‌కు ఎంతమాత్రం సంబంధం ఉండబోదని అన్నారు. అయినప్పటికీ రైతులు ఆధార్ నంబర్లు అందజేయాలని కోరారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను శాస్త్రీయంగా లెక్కగట్టాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. -
లోటు 3 మిలియన్ యూనిట్లు
వ్యవసాయానికి 3 నుంచి 4 గంటలే విద్యుత్ సరఫరా అధికారికంతోపాటు అనధికారిక కోతలు లైన్‌క్లియర్ పేరిట ప్రాంతాల వారీగా అమలు ఎండుతున్న పంటలు ఆందోళనలో రైతులు హన్మకొండ సిటీ :డిమాండ్‌కు తగిన విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లాకు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా... 9 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. లోటు 3 మిలియన్ యూనిట్లు ఉండడంతో అధికారులు ఇప్పటికే అప్రకటిత కోతలకు తెరతీశారు. తాజాగా ఎండలు మండుతున్న క్రమంలో విద్యుత్ వినియోగం పెరగడంతో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చేతులెత్తేసింది. వ్యవసాయ సాగుకు సైతం కరెంట్ కోతలను పకడ్బందీగా అమలు చేస్తోంది. లోడ్ ఒక్కసారిగా పెరగడం తో రోజుకు విడతల వారీగా మూడు, నాలుగు గంటలు కూడా సరఫరా చేయడం లేదు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ అం దించాల్సి ఉండగా... ఐదు గంటలు సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ.. ఆచరణలో విపలమయ్యూరు. మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చే స్తామని పలు సందర్భాల్లో చెప్పారు. అవన్నీ ఉపన్యాసాలకే పరిమితమయ్యూరుు. లోటు విద్యుత్ నేపథ్యంలో కోతల వేళలు కాకుండా ప్రాంతాల వారీగా అధికారులు లైన్‌క్లియర్ పేరిట కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇలా అప్రకటిత కోతలకు తోడు లోఓల్టేజీ, హై ఓల్టేజీతో కరెంట్ తరచుగా ట్రిప్ అవుతుండడం వంటి సమస్యలతో పంట తడులు అందించలేని దుస్థితి నెలకొంది. పంట చేతికొచ్చే సమయంలో విధిస్తున్న కోతలు వారిని అతలాకుతలం చేస్తున్నారుు. పంటలు చేతికందే సమయంలో... ఖరీప్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం తగ్గా... అదును దాటిన తర్వాత కురిసిన వర్షాలతో కొన్ని పంటలు దెబ్బతిన్నారుు. ఆ తర్వాత వర్షాలు మొహం చేటేశారుు. రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులైన బావులు, బోర్లు, వాగుల కింద కరెంట్‌ను నమ్ముకుని 30 శాతం మాత్రం వరి సాగు చేస్తే.. రోజులు నాలుగు గంటలు కూడా సక్రమంగా సరఫరా కాకపోవడంతో జిల్లాలో అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నారుు. చేతికొచ్చిన మొక్కజొన్న, పత్తి, మిర్చి లాంటి పంటలు దెబ్బతింటున్నారుు. నాలుగు రోజులుగా ఎండ వేడి పెరగడంతో పత్తి, మిర్చి పూత, కాత రాలిపోతోంది. డ్రైస్పెల్ సుదీర్ఘకాలం ఉండడంతో పంటలన్నీ వాడిపోతున్నారుు. ఇలాంటి సమయంలో విధిలేని పరిస్థితుల్లో అమలు చేస్తున్న విద్యుత్ కోతలు రైతులను నిరాశకు గురిచేస్తున్నారుు. ఈ నేపథ్యం లో రైతులు ఆందోళనలు తీవ్రం చేయడంతో ఎన్పీడీసీఎల్ అధికారులు పరిశ్రమలకు, గృహా వసరాలకు కోతల సమయం పెంచారు. -
సొమ్ము ఇచ్చుకో..పోస్టు పుచ్చుకో...
ఈపీడీసీఎల్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కావాలనుకుంటున్నారా! అయితే రూ.ఐదు లక్షలు ఇచ్చుకునే స్తోమత ఉందా? అంత ఇచ్చుకోలేకపోతే.. కనీసం అధికార పార్టీ నేతకు దగ్గరవారైఉంటే రూ.మూడు లక్షలకు పనైపోతుంది.మరెవరో కాదు.. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నిర్ణయించిన రేటు ఇది. జిల్లాలో కొనసాగుతున్నఈ దందాను చూసీచూడనట్టు పోవాలంటూ అధికారులకు సైతం వారు హుకుం జారీ చేస్తున్నారు. సాక్షి, రాజమండ్రి :తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో జిల్లాలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు ధరలు నిర్ణయించారు అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు. పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నా, తమతో బేరసారాలు కుదుర్చుకోకపోతే ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. గతనెలలో జేఎల్‌ఎంల నియామకాల్లో 92 మంది ఆన్‌డ్యూటీ ఆపరేటర్లు జేఎల్‌ఎంలుగా నియమితులయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాల్సి ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు ఆ పోస్టులకు ‘ప్రైస్ ట్యాగ్’లు బిగించారు. ఒకొక్క పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సిఫారసు చేసిన అభ్యర్థులకు మాత్రమే పోస్టులు కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు అంతసొమ్ము ఎలా తీసుకొస్తామని డీలా పడతున్నారు. పోస్టుల ఖాళీలు ఇలా.. ఈపీడీసీఎల్‌కు జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, జగ్గంపేట డివిజన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కాంట్రాక్టు పద్ధతిలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 1559 మందిలో 92 మంది ఆగస్టులో జరిగిన జేఎల్ఎం నియామకాల్లో ఎంపికయ్యారు. ఖాళీ అయిన ఆ స్థానాలను ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాంట్రాక్టు షిఫ్ట్ ఆపరేటర్‌కు రూ.9829 వేతనంగా ఇస్తున్నారు. ఈ చిన్న పోస్టుకు కూడా రూ.లక్షల్లో బేరాలు సాగిస్తున్నారు. అధికారులను గుప్పెట్లో పెట్టుకుని.. ఆగస్టులో జిల్లాలో 197 జేఎల్‌ఎంల నియామకాలను ఈపీడీసీఎల్ అధికారులు చేపట్టారు. అప్పట్లో అధికార పార్టీ వారికి కూడా అవకాశం లేకుండా, పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తిచేశారు. కొన్నిచోట్ల నేతల సిఫారసు లేఖలను కూడా తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారిపై గుర్రుగా ఉన్న నేతలు ఆయనను బదిలీ చేయించేందుకు సైతం విశ్వప్రయత్నం చేసినట్టు తెలిసింది. అది సాధ్యపడక పోవడంతో ఈసారైనా షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో తమ దందా సాగించేలా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. లేకపోతే ఈసారి బది లీ వేటు తప్పదని బెదిరించడంతో.. ఆ ఉన్నతాధికారి తలవంచక తప్పలేదని తెలుస్తోంది. ఈ రేట్లలో కూడా ఆ ప్రజాప్రతినిధులు కాస్త కనికరం చూపుతున్నట్టు తెలిసింది. అభ్యర్థి తమకు కావాల్సిన వాడు, పార్టీ కార్యకర్త, నమ్మిన బంటు వంటి వాళ్లయితే రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు ఇస్తే చాలని అంటున్నట్టు ఓఅభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశాడు. లేదంటే రూ.ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మధ్యలో చెల్లించుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారని గ్రామీణ ప్రాంతానికి చెందిన కొందరు అభ్యర్థులు చెబుతున్నారు. -
విజయవాడ కేంద్రంగా మరో పవర్ డిస్కం
వారంలోగా ప్రభుత్వ ప్రకటన పాలనా సౌలభ్యం కోసం ఏపీఎస్పీడీసీఎల్ విభజన నిర్ణయం కొత్త డిస్కం కింద కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు విజయవాడ బ్యూరో: విజయవాడ కేంద్రంగా మరో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కం)ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఈ కొత్త డిస్కం పరిధిలోకి తెస్తుందని సమాచారం. కొత్త డిస్కం ఏర్పాటు ప్రాంతంగా మొదట గుంటూరు పేరు తెరమీదకు వచ్చినప్పటికీ.. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉంటే అక్కడే డిస్కం కార్యాలయం ఉండాలన్న ఉన్నతాధికారుల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. మరో వారంలోగా దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరిస్తూ ప్రభుత్వం జీవోను తీసుకురానుందని విద్యుత్ అధికార వర్గాల సమాచారం.ఇందుకు కసరత్తు జరుగుతోందని చెప్తున్నారు. తిరుపతి దూరం.. పాలన భారం... రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ డిస్కంలు ఉన్నాయి. ఇందులో మొదటిది తిరుపతి, రెండోది విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఉభయగోదావరి జిల్లాల వరకూ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఉండగా.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ క ంపెనీ కింద ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత అప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఏపీఎస్పీడీసీఎల్ పరిధి 8 జిల్లాలకు పెరిగి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డిస్కంగా మారింది. అది కృష్ణా, గుంటూరు జిల్లాలకు దూరంగా తిరుపతిలో ఉంది. దీంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను రెండుగా విభజించి విజయవాడలో కొత్త డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నూతన డిస్కం ఏర్పాటు అనివార్యమని రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలోని కాటన్ మిల్లుల పారిశ్రామికవేత్తలు, స్పిన్నింగ్ మిల్లుల యజమానులు సీఎం బాబును కలిసి కొత్త డిస్కం ఏర్పాటుపై దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీన్ని ధ్రువపరుస్తూ రాష్ట్రమంత్రి అచ్చెంనాయుడు రెండు రోజులు కిందట విజయవాడ కేంద్రంగా డిస్కం ఏర్పాటు జరుగుతుందని ప్రకటించారు. గుంటూరులో తాత్కాలిక కార్యాలయం.. విజయవాడలో డిస్కం కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పక్షంలో అనువైన భవనాలు, ఖాళీస్థలాలు ఎక్కడ ఉన్నాయన్న దానిపై కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొదట కార్యాలయాన్ని అద్దె భవనంలో ప్రారంభించి ఆపైన అనువైను సొంత స్థలాల్లో కొత్త భవనాలను నిర్మించుకునే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర్లోని పాత పవర్ హౌస్‌కు పక్కనే ఉన్న 2 ఎకరాల ఖాళీస్థలం, యనమలకుదురులోని 2 ఎకరాలు, ఆగిరిపల్లి దారిలోని 5 ఎకరాల్లో ఎక్కడైనా నూతన భవనాలు నిర్మించుకునే వీలుంది. గుంటూరు సంగడిగుంట ఏరియాలో ఇప్పటికే నిర్మించి ఉన్న విశాల విద్యుత్ భవనాల్లో తాత్కాలికంగా కార్యాలయాన్ని నడుపుకుంటూ, విజయవాడలో కొత్త భవనాలు పూర్తయ్యాక అక్కడికి తరలించే అవకాశాలు ఉన్నాయి. -
తెలంగాణకు కరెంటు షాక్ కొట్టనుంది.
-
తెలంగాణకు ‘కరెంటు’ షాక్
* జెన్కో పీపీఏలు రద్దు! * అదే జరిగితే తెలంగాణకు 370 మెగావాట్ల నష్టం * ఎక్కడి ప్లాంట్లు అక్కడే: ఏపీ జెన్కో ఈఆర్సీ, డిస్కంలకు లేఖ * నేటి ఈఆర్సీ భేటీలో నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కరెంటు షాక్ కొట్టనుంది. ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) అన్నీ రద్దవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)తో పాటు తెలంగాణలోని రెండు డిస్కంలు (సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్), ఆంధ్రాలోని రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లకు ఏపీ జెన్కో మంగళవారం ఈ మేరకు లేఖ రాసింది. దీనిపై బుధవారం ఈఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకవేళ పీపీఏల రద్దుకు అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికే చెందనున్నాయి. అంటే ఏ రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ ఆ రాష్ట్రానికే చెందనుంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం సుమారు 370 మెగావాట్లు, అంటే 9 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్‌ను నష్టపోనుందని అంచనా. పీపీఏలు రద్దయ్యూక ఏ రాష్ట్రంలోని డిస్కంలతో ఆ రాష్ట్రంలోని జెన్కో పీపీఏలు చేసుకోవచ్చంటున్నారు. ఈ దెబ్బకు తెలంగాణలో విద్యుత్ కోతలు మరింత పెరగవచ్చని విద్యుత్ రంగ నిపుణులంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,450 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుత్ ప్లాంటు నిర్మాణంలో ఉండగా తెలంగాణలో కేవలం 960 మెగావాట్ల ప్లాంట్లే నిర్మాణంలో ఉన్నాయి. పైగా వాటి పీపీఏలకు కూడా ఈఆర్సీ అనుమతివ్వలేదు. అంటే వాటి పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే చందం కానుంది. అలా కూడా తెలంగాణ రాష్ట్రం భారీగానే నష్టపోనుంది. ఈఆర్సీ అనుమతి లేక... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జెన్కోకు 8924.9 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్లున్నాయి. వీటిలో 6,530 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్లతో నాలుగు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏలు 2002తో ముగిశాయి. వాటిని కొనసాగించాలంటూ 2009లో జెన్కో, డిస్కంలు లేఖలు రాసినా ఈఆర్సీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మిగతా కొత్త విద్యుత్ ప్లాంట్లకు జెన్కో, డిస్కంలు 2009లోనే పీపీఏలు కుదుర్చుకున్నారుు. వాటిని అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నా ఈఆర్సీ ఇప్పటిదాకా అధికారికంగా అనుమతివ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారమే పీపీఏలు కొనసాగుతాయని ఆ మేరకే ఇరు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుందని పేర్కొంది. ఫలితంగా పీపీఏలకు అనుగుణంగా ప్లాంట్లు ఎక్కడున్నాయన్న దానితో నిమిత్తం లేకుండా తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా అవుతోంది. అరుుతే పీపీఏలకు అధికారికంగా ఈఆర్సీ అనుమతివ్వలేదు గనుక అవి కొనసాగుతున్నట్టు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇందుకనుగుణంగా గతంలో తాము సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను పరిశీలించాల్సిన అవసరం లేదని ఈఆర్సీకి రాసిన లేఖలో పేర్కొంది. గతంలో నాలుగు డిస్కంలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది. విభజన చట్టంలోనే పేర్కొన్నట్టుగా ఎక్కడి విద్యుత్ ప్లాంట్లు అక్కడికే చెందుతాయని కూడా తెలిపింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ పూర్తిగా ఆ రాష్ట్రానికే చెందనుంది. ఈఆర్సీ నుంచి అనుమతి వచ్చినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కో ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉండబోదని ఇంధన శాఖ వర్గాలంటున్నాయి. అదేవిధంగా తెలంగాణలోని ప్లాంట్లు కూడా ఆ రాష్ట్రానికే చెందనున్నాయి. అయితే ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం తక్కువ. ఆ కారణంగా తెలంగాణకు వెంటనే విద్యుత్ నష్టం వాటిల్లనుంది. నష్టం ఇలా... - ఉమ్మడి రాష్ట్రంలో జెన్కోకు 8924.9 మెగావాట్ల ప్లాంట్లున్నాయి. ఇందులో తెలంగాణలో 4235.3 ఎంవీ, ఆంధ్రప్రదేశ్‌లో 4689.6 ఎంవీ ప్లాంట్లున్నారుు - వర్షాకాలంలో నడిచే హైడల్ ప్లాంట్లను మినహాయిస్తే నిరంతరం విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్లు ఆంధ్రప్రదేశ్‌లో 2810 మెగావాట్లు, తెలంగాణలో 2282.5 మెగావాట్ల మేరకున్నాయి. వీటిలో ప్రస్తుతం తెలంగాణకు 53.89 శాతం లెక్కన 2651.9 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం లెక్కన 2440.5 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. - పీపీఏల రద్దు అమల్లోకి వస్తే ఏ రాష్ట్ర ప్లాంట్లు ఆ రాష్ట్రానికే చెందుతాయి. దాంతో తెలంగాణకు 2282.5 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 2810 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. అంటే తెలంగాణ 369.5 మెగావాట్ల (సుమారు 9 ఎంయూ) విద్యుత్‌ను నష్టపోనుంది. మనమెందుకు అనుమతివ్వలేదు? పీపీఏల రద్దు కోరుతూ మీడియాలో కథనాలు, జెన్కో నుంచి లేఖ అందడం తదితరాల నేపథ్యంలో ఈఆర్సీ చైర్మన్ భాస్కర్ తాజాగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పీపీఏల కోసం 2009లో దరఖాస్తు చేసుకున్నా మనమెందుకు అనుమతివ్వలేదనే ప్రశ్నను భేటీలో లేవనెత్తారని సమాచారం. పీపీఏల రద్దుపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి బుధవారం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఈఆర్సీ అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. మరోవైపు జెన్కో-డిస్కంల మధ్య ఏటా పీపీఏ ప్రకారమే పెట్టుబడి వ్యయం, విద్యుత్ కొనుగోలు, అమ్మకం ప్రక్రియ జరుగుతున్నందున పీపీఏలు అమల్లో ఉన్నట్టేననే అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తమ్మీద పీపీఏల భవితవ్యం ఈఆర్సీ తీసుకునే నిర్ణయంతో తేలనుంది. పీపీఏ రద్దు లేఖ అందింది ‘‘పీపీఏలను రద్దు చేసుకుంటామంటూ ఏపీ జెన్కో రాసిన లేఖ మాకందింది. దాన్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. ఈ లేఖపై బుధవారం విద్యుత్ సౌధలో సమావేశమై కార్యాచరణను నిర్ణయిస్తాం’’ - తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేశ్ చందా -
కరెంటు ‘షాక్’
న్యూఢిల్లీ: కరెంటు చార్జీలు పెంచడానికి అనుమతించాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఎన్నికల సంఘానికి (ఈసీ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. టారిఫ్ ఖరారు చేసే ముందు బహిరంగ నోటీసులు జారీ చేసే ప్రక్రియకు దాదాపు నెల రోజులు పడుతుంది కాబట్టే ముందస్తుగా అనుమతి కోరుతున్నట్టు వివరణ ఇచ్చింది. భారీ నష్టాల కారణంగా జాతీయ గ్రిడ్, ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు సాధ్యం కావడం లేదని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సి ల్ (ఎన్డీఎంసీ), విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) డీఈఆర్సీకి మొరపెట్టుకున్నాయి. కాబట్టి చార్జీలను పెంచాలని కోరాయి. డిస్కమ్‌లు ఖాతాలను తారుమారు చేసి కృత్రిమ నష్టాలను చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉండడంతో, వాటి ఖాతాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చార్జీలను 60 శాతం దాకా పెంచాలని అవి ప్రభుత్వాన్ని కోరుతుండడం విశేషం. ఒక్కో యూనిట్‌కు సగటున రూ.నాలుగు చొప్పున పెంచాలని ఇవి డీఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. కొత్త టారిఫ్ ఖరారైతే ఇది జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. నిబంధనల ప్రకారం చార్జీల పెంపుపై అభ్యంతరాలు/సలహాలు/అభిప్రాయాలు కోరుతూ సంబంధిత సంస్థలు, వ్యక్తులు, ప్రజలను డీఈఆర్సీ సంప్రదిం చాల్సి ఉంటుంది. ఇందుకు నోటీసులు జారీ చేయడంతోపాటు బహిరంగ సమావేశాలూ నిర్వహిస్తుంది. వీటిలో ప్రజలు సగటు రాబడి అవసరాల (ఏఆర్ఆర్) దరఖాస్తులపై అభిప్రాయాలు, సలహా లు, సూచనలు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగానూ తెలియజేయవచ్చు. వీటన్నింటినీ పరిశీలించాక డీఈఆర్సీ 2014-2015 ఆర్థిక సంవత్సరానికి కరెంటు టారిఫ్‌ను ఖరారు చేస్తుందని సంస్థ ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో వివరించింది. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే కొత్త టారిఫ్‌ను అమలు చేస్తామని సంస్థ ప్రధాన నోడల్ అధికారి అంకుర్ గార్గ్ ఈసీకి వివరణ ఇచ్చారు. భారీగా పెంపు కోరుతున్న డిస్కమ్‌లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.9,361 కోట్ల ఆదాయం (ఏఆర్ఆర్) అవసరమని రిలయ న్స్ అధీనంలో డిస్కమ్ బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) డీఈఆర్సీకి సమర్పించిన పిటిషన్లో పేర్కొంది. తనకు రూ.5,527 కోట్ల ఆదాయం కావాలని బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) కోరింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి తనకు రూ.6,079 కోట్ల నిధులు కావాలని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) డీఈఆర్సీకి విన్నవించింది. డిస్కమ్‌లు చూపిస్తున్న ఈ నష్టాలను డీఈఆర్సీ అంగీకరించి టారిఫ్ ఖరారు చేస్తే చార్జీలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. వినియోగాన్ని బట్టి ఫిక్స్డ్ చార్జీలను 60 శాతం వరకు పెంచాలని, ఇంధన చార్జీలను గరిష్టంగా 18 శాతం దాకా పెంచాలని ఎన్డీఎమ్సీ కోరింది. ప్రతి నెలా 200 యూనిట్ల దాకా వాడుకునే వాళ్లకు యూనిట్‌కు రూ.3.90 చొప్పున, 2001- 400 యూనిట్ల వరకు రూ.ఐదు చొప్పున, 401-800 యూనిట్ల వరకు రూ.6.20 చొప్పున, 800 యూనిట్లు దాటితే రూ.తొమ్మిది చొప్పున పెంచాలని ఎన్డీఎమ్సీ డీఈఆర్సీని కోరిం ది. ఇదిలా ఉంటే ఆదాయాల పెంపులో భాగంగా టైం ఆఫ్ ద డే (టీఓడీ) ప్రతిపాదనను కూడా డిస్కమ్‌లు ముందుకు తెచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకా రం... విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో కరెంటు చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. అదే వినియోగం తక్కువగా ఉండే సమయంలో బిల్లులను కాస్త తగ్గిస్తారు. ఇక వినియోగం సాధారణంగా ఉండే సమయంలో అప్పటి వాతావరణానికి అనుకూలంగా రేట్లను నిర్ణయిస్తారు. దీని వల్ల అంతిమంగాా వినియోగదారుడే నష్టపోతాడనే వాదనలు ఉన్నాయి. -
ఆడిటింగ్‌కు డిస్కంలు సహకరించటం లేదు
న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆడిటింగ్ తమతో సహకరించడంలేదని ఢిల్లీ హైకోర్టుకు బుధవారం కాగ్ నివేదించింది. అనిల్ అంబానీ, టాటా గ్రూపులకు చెందిన ప్రైవేట్ పంపిణీ కంపెనీలు ఏర్పాటు దగ్గరనుంచి వాటి ఆర్థిక వ్యవహారాల ఆడిటింగ్‌కు గత ఆప్ సర్కార్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై స్టే విధించాలని జనవరి 24న ఆయా కంపెనీలు హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బుధవారం కోర్టుకు కాగ్ తన నివేదికను అందజేసింది. ఆయా కంపెనీలు ఆడిటింగ్‌కు సహకరించడంలేదని అందులో కాగ్ ఆరోపించింది. కాగా, ఆయా కంపెనీల సహాయ నిరాకరణ విషయమై కాగ్ మూడు వారాల్లో దరఖాస్తుచేయాలని ఆదేశించి, కేసు తదుపరి విచారణను మే 16కు వాయిదావేసింది. దేశ రాజధానిలో మూడు ప్రైవేట్ కంపెనీలు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. షీలాదీక్షిత్ సర్కార్ సమయంలో విద్యుత్ టారిఫ్‌లు నగరంలో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆప్ ఉద్యమాలు నిర్వహించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీపార్టీ తాము అధికారంలోకి వస్తే కరెంటు పంపిణీ కంపెనీల వ్యవహారంపై కాగ్‌తో ఆడిటింగ్ జరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2013 డిసెంబర్ 27న ఆయా ప్రైవేట్ విద్యుత్ పంపిణీ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై ఆడిటింగ్‌కు కాగ్‌ను ఆదేశించింది. డిస్కంల ఆర్థిక వ్యవహారాలు, ఎకౌంట్లు సరిగా ఉంటే కాగ్ ఆడిటింగ్‌కు భయపడాల్సిన అవసరం ఏముందని ఆప్ సర్కార్ ప్రశ్నించింది. డిప్యూటీ సెక్రటరీ (విద్యుత్) అల్కా శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ మేరకు నిలదీశారు.‘ప్రజాస్వామ్యంలో ఆడిట్ అనేది చాలా ముఖ్యమైన ఆయుధం.. డిస్కంలు దీనికి ఎందుకు భయపడుతున్నాయో.. ఎందుకు స్టే విధించాలని కోరుతున్నాయో అర్థం కావడంలేదు..’ అని అఢిడవిట్లో పేర్కొన్నారు. ఆయా డిస్కంలలో 49 శాతం వాటా ప్రభుత్వానికి ఉన్నందున ప్రజల్లో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రభుత్వం ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. ప్రైవేట్ కంపెనీలు దాఖలుచేసిన స్టే పిటిషన్‌ను తిరస్కరించి కాగ్ ఆడిటింగ్‌కు అంగీకరించేలా వాటిని ఆజ్ఞాపించాలని కోర్టును కోరారు. కొంతసేపు వాదనలు విన్న తర్వాత జస్టిస్ మన్మోహన్ మాట్లాడుతూ ఈ మొత్తం విషయాన్ని డివిజన్ బెంచ్‌కు నివేదిస్తానని చెప్పారు. దీనికి డిస్కంలు ఆమోదించగా ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇదిలా ఉండగా గత జనవరి 24వ తేదీన జస్టిస్ మన్మోహన్ ఇచ్చిన తీర్పుపై డిస్కంలు వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. జనవరి 24వ తేదీన జరిగిన వాదనల్లో జస్టిస్ మన్మోహన్ డిస్కంల స్టే దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా కాగ్ ఆడిటింగ్ పూర్తిగా సహకరించాలని ఆయా కంపెనీలను ఆదేశించారు. రాజధాని నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో 2002 నుంచి ఈ ప్రైవేట్ కంపెనీలు ఢిల్లీలో విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి. కాగా, కాగ్ ఆడిటింగ్‌కు డిస్కంలు సహకరించడంలేదని కాగ్ న్యాయవాది వాదించడంపై బుధవారం బీఎస్ఈఎస్ విద్యుత్ సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆడిటింగ్ సక్రమంగా జరుగుతోందని, వారి అడిగే సమాచారాన్నంతా తాము ఆడిటింగ్ అధికారులకు అందజేస్తున్నామని వారి తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. -
‘పనితీరు’కు గ్యారంటీ కావాల్సిందే!
జెన్కోనూ వదలని విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకుసాగని సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న జెన్కో పనితీరుకు గ్యారంటీ కావాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంటున్నాయి. జెన్కో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలంటే పెర్ఫార్మెన్స్ గ్యారంటీ చెల్లింపు తప్పనిసరి అని డిస్కంలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రభుత్వరంగ సంస్థ అయిన తమకు గ్యారంటీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని జెన్కో కోరుతోంది. ఇందుకు డిస్కంలు ససేమిరా అంటున్నాయి. దీంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఇప్పటి వరకు జెన్కో ముందడుగు వేయలేకపోతోంది. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు జెన్కోకు మొదటి నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌కో పిలిచిన 1,000 మెగావాట్ల సోలార్ బిడ్డింగ్‌లో జెన్కో పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. బిడ్డింగ్‌తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జెన్కో సమాయత్తమయ్యింది. అయితే, వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లు (కారిడార్) ఏర్పాటు చేయలేమని ట్రాన్స్‌కో కొర్రీ వేసింది. దీనిపై సాక్షిలో వార్త ప్రచురితమయ్యింది. దీంతో కారిడార్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రైవేటు ప్లాంట్లతో సమానంగా పనితీరుకు గ్యారంటీ మొత్తం చెల్లించాలని అంటోంది. ఒకవైపు జెన్కోకు సుమారు రూ. 3 వేల కోట్ల మేరకు డిస్కంలు బకాయిపడ్డాయి. మరోవైపు గ్యారంటీకి జెన్కోను పట్టుబడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను జెన్కో చేపట్టాలని భావిస్తోంది. ఈ లెక్కన ఒక్కో మెగావాట్‌కు రూ. 10 లక్షల చొప్పున రూ. 10 కోట్లు ముందస్తుగా జెన్కో చెల్లించాల్సి రానుంది. ఒకేసారి ఇంత మొత్తం చెల్లించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన జెన్కోను వెంటాడుతోంది.