
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో మహిళలకు అవకాశం కల్పించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మహిళలు అంతరిక్షాన్ని చుట్టి వస్తున్న ఈ రోజుల్లో వారికి అవకాశాలు కల్పించకపోవడం ఏమిటంటూ ప్రశ్నించింది. జేఎల్‌ఎం పోస్టుల విషయంలో కోర్టును ఆశ్రయించిన మహి ళా అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి, వారిని ఎంపిక ప్రక్రి యకు అనుమతించాలని ఎన్‌పీడీసీఎల్ అధికారులను ఆదేశించింది. అలాగే తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు జేఎల్‌ఎం పోస్టుల తుది ఫలితాలను ప్రకటించవద్దని స్పష్టం చేస్తూ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన హుమేరా అంజుమ్, మరో ఆరుగురు మహిళలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవా ది వాదనలు వినిపిస్తూ.. ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో మహిళా ఉద్యోగులకు 33 1/3 శాతం రిజర్వేషన్ ఉందని తెలిపారు. మొత్తం 2,553 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు, ఒక్క పోస్టును మహిళలకు కేటాయించకపోవడం వివక్ష చూపడమేనన్నారు. పలు రంగా ల్లో మహిళలు కీలక పదవులు నిర్వహిస్తూ రాణిస్తున్నారని, కానీ ఎన్‌పీడీసీఎల్ అధికారులు మహిళలను గుర్తించడం లేదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించి, ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.