వాణిజ్య వడ్డన..! ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్‌ సంస్థల దృష్టి | Sakshi
Sakshi News home page

వాణిజ్య వడ్డన..! ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్‌ సంస్థల దృష్టి

Published Thu, May 23 2024 4:37 AM

Power companies focus on ways to increase revenue in Telangana

వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలకు విద్యుత్‌ చార్జీల పెంపు యోచన

ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్‌ సంస్థల దృష్టి

ఎన్నికల కోడ్‌ ముగియగానే ఈఆర్సీకి టారిఫ్‌ ప్రతిపాదనలు 

నిజానికి ఏప్రిల్‌ నుంచే అమల్లోకి రావాల్సిన కొత్త టారిఫ్‌లు 

ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదనలు సమర్పించని డిస్కంలు 

కాంగ్రెస్‌ సర్కారు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే జూన్‌లోనే ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: నష్టాలు, అప్పుల భారంతో సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్‌ చేశాయి. గృహ వినియోగం మినహా.. వాణిజ్య, పారిశ్రామిక, ఇతర కేటగిరీల విద్యుత్‌ చార్జీలను పెంచాలని ప్రాథమికంగా ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి త్వరలో ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. జూన్‌ 6వ తేదీతో రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియనుంది. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గత నెల (ఏప్రిల్‌) ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ టారిఫ్‌ అమల్లోకి రావాలి. ఎన్నికలు, ఇతర కారణాలతో డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించక పోవడంతో ఉన్న చార్జీలనే కొంతకాలం కొనసాగించేందుకు ఈఆర్సీ అనుమతినిచ్చింది. 

జనవరి 31 వరకే గడువు ఇచ్చిన ఈఆర్సీ.. 
విద్యుత్‌ టారిఫ్‌ నిబంధనల ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్‌ 30వ తేదీలోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్, కొత్త టారిఫ్‌ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాలి. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని వినియోగదారులకు ఎన్ని మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది? దానికి ఎంత ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్‌ చార్జీలతో వచ్చే ఆదాయం ఎంత? వ్యత్య్సాం (ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వమిచ్చే విద్యుత్‌ సబ్సిడీలు పోగా మిగిలే లోటును భర్తీ చేసేందుకు.. ఎంత మేర విద్యుత్‌ చార్జీలు పెంచాలి? వంటి అంశాలు ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనల్లో ఉంటాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే 2024–25 ఆర్థిక సంవత్సర ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలను సిద్ధం చేసినా.. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. అప్పట్లో డిస్కంల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 31 వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో మూడు నెలలు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేసినా.. ఈఆర్సీ తిరస్కరించింది. వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించింది. 

ప్రస్తుతం ప్రతినెలా రూ1,386 కోట్లలోటు.. 
డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగిపోయినట్టు గతంలో విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించింది. డిస్కంలు సగటున ప్రతి నెలా రూ.1,386 కోట్ల లోటు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. 

కోడ్‌ ముగిస్తే వారికీ ఉచిత విద్యుత్‌.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించలేదు. ఆ జిల్లాలోని 8 లక్షల గృహ కనెక్షన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పొందిన విద్యుత్‌ కనెక్షన్లకు ఎన్నికల కోడ్‌ ముగిశాక ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం గృహజ్యోతి పథకంతో నెలకు రూ.120 కోట్ల భారం పడుతోందని.. అది రూ.150 కోట్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గృహజ్యోతి అమలుకు అనుమతిస్తూ ఈఆర్సీ జారీ చేసిన ఆదేశాల మేరకు... రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ముందస్తుగానే డిస్కంలకు ఈ సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తోంది. ఓ వైపు 200 యూనిట్లలోపు వినియోగించే వారికి ఉచితంగా విద్యుత్‌ అందిస్తూ.. అంతకు మించి విద్యుత్‌ వినియోగించే వారి బిల్లులను పెంచడం సమంజసం కాదనే భావన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గృహేతర కేటగిరీల విద్యుత్‌ చార్జీలను మాత్రమే పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది.  

పెంచకపోతే సర్కారే భరించాలి! 
లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియనుండటంతో ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించేందుకు డిస్కంలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక గృహేతర కేటగిరీల విద్యుత్‌ చార్జీలను ఏ మేర పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు హైదరాబాద్, వరంగల్‌లలో బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. 

తర్వాత కొత్త టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్‌ చార్జీల వివరాలు అందులో ఉంటాయి. ఒకవేళ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. డిస్కంల ఆదాయ లోటును ప్రభుత్వమే విద్యుత్‌ సబ్సిడీల రూపంలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎలాంటి చార్జీల పెంపు లేకుండానే కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ను ఈఆర్సీ ప్రకటిస్తుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement