
భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశ పవర్ గ్రిడ్ల భద్రతపై చర్చ
భారత విద్యుత్ గ్రిడ్‌పై పాకిస్తాన్ సైబర్ దాడి చేసి 70 శాతం నిలిపివేసిందంటూ ప్రచారం
సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం
ఆ సమాచారం ఫేక్ అంటూ పీఐబీ ఫ్యాక్ట్–చెక్ ట్వీట్
సాక్షి, అమరావతి: యుద్ధంలో సైబర్ దాడులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయనేది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రుజువు చేసింది. ఒక దేశాన్ని చావుదెబ్బ కొట్టాలంటే ఆయుధాలతో కాకుండా సైన్స్, టెక్నాలజీతో సాధ్యమవుతుందని అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలతో నిరూపితమైంది. మన దేశంలోనూ పవర్ గ్రిడ్‌లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ సైబర్ దాడికి పాల్పడి భారతదేశ విద్యుత్ గ్రిడ్‌లో 70 శాతం నిలిపివేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దానిని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. సైబర్ దాడి అనేది పూర్తిగా అవాస్తవమంటూ పీఐబీ ఫ్యాక్ట్–చెక్‌లో ట్వీట్ చేసింది. అయితే విద్యుత్ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇంధనరంగ నిపుణులు అంటున్నారు.
పవర్ ఐలాండ్ సిస్టమ్‌తో పరిష్కారం
పవర్ ఐలాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం కేంద్రం నిర్ణయించింది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్(సీఎస్‌ఐఆర్‌టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్థల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. సీఈఏ గతేడాది విద్యుత్ రంగంలో సైబర్ సెక్యూరిటీపై కొత్త నిబంధనల్ని తెచ్చింది. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్త్రన్, నార్త్ ఈస్త్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్‌లు ఉన్నాయి.
వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌ల కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది.
ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి పవర్ ఐలాండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఈఏ ప్రతిపాదించింది. పవర్ ఐలాండ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరుచేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీని వల్ల పవర్ గ్రిడ్‌లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు.
రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాటు
రాష్ట్ర విద్యుత్ రంగంలో కచ్చితంగా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఐఎస్‌ఓ)ను నియమించాలి. భారత పౌరసత్వం కలిగిన సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను సీఐఎస్‌ఓగా నియమించాలి. వారు సంస్థ ఉన్నతాధికారికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అలాగే ప్రతి విద్యుత్ సంస్థ సైబర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్(సీసీఎంపీ)ని అభివృద్ధి చేసుకోవాలి. విద్యుత్ రంగంలోని కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌లు హ్యాకింగ్‌కు గురికాకుండా అడ్వాన్స్ ఫైర్‌వాల్స్, డిటెక్షన్ సిస్టమ్(డీఎస్), ప్రివెన్షన్ సిస్టమ్(పీఎస్)ను తయారు చేయాలి.
ట్రస్టెడ్ వెండర్ సిస్టమ్‌ను కూడా కచ్చితంగా పెట్టుకోవాలి. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా మాల్‌వేర్ కంప్యూటర్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వీటన్నిటిపైనా ఐటీ, టెక్నాలజీ విభాగాల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సీఈఏ వెల్లడించింది. కానీ ఇవన్నీ ఇంకా పూర్తి ఆచరణలోకి రాలేదు.
గత ప్రభుత్వం పటిష్ట చర్యలు
కేవలం పవర్ గ్రిడ్‌లే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు కూడా అంతర్గత సమాచార రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. అప్పటి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్ర ఇంధనశాఖ అనుసరించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది.
దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్‌లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ), మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఫిజికల్ పొజిషన్ ఎలా ఉందనేది ఈ జీఐఎస్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా గ్రిడ్ భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.