తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి.
ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.


