తిరుపతి: పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సీఐడీ విచారణ జరిగిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.
‘‘మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు?. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు?. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
..చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.


