నేడు శాస్త్ర, సాంకేతికతలతో ప్రపంచం దూసుకుపోతోంది. మరో వైపు మూఢ నమ్మకాలు మనల్ని అధః పాతాళానికి నెడుతున్నాయి. వీటిని చదువురాని అమాయక ప్రజలే నమ్ముతారనే ఆలోచన సమాజంలో ఉంది. కానీ విద్యావంతులు, పాలకులు సైతం నమ్ముతున్న తీరు ఆశ్చర్య పరుస్తుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత కొన్ని నెలలుగా కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ దిష్టి కారణమని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం విస్మయం కలిగిస్తోంది. సముద్రపు నీరు వెనక్కి రావడం, మురుగు కాలువ నీటిలో లవణాల శాతం పెరగడం వంటివి అసలు కారణాలని నివేదికలు చెబుతుండగా, దిష్టి గురించి మాట్లాడటం పాలకుల అజ్ఞానానికి నిదర్శనం. ఇలాంటి మాటలు ప్రాంతీయ విద్వేషాలను కూడా రగిలిస్తున్నాయి.
ఇప్పటికే మంత్రగాళ్ల పేరుతో జనం మోస పోతున్నారు. బాణామతి, చేతబడులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. క్షుద్ర పూజల వంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తల్లి కడుపులోంచి పుట్టబోయే బిడ్డను ముహూర్తాలు చూసి కనే రోజులొచ్చాయి. మనిషి మరణానికి సైతం మంచీ చెడూ చూస్తు న్నారు. ప్రజల్లో అంధ విశ్వాసాలు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇటీవల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా గర్భిణులు, వితంతువులు కొబ్బరికాయలు కొట్టడానికి వెనుకాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు శాస్త్రీయ జీవన విధానాన్ని అవలంబించక పోవడం విచారకరం.
ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్
ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వ్యాధులను తగ్గించుకోవడానికి జంతుబలులు, నరబలుల జరిగే వార్తలు వినబడుతున్నాయి. మరోవైపు మంత్రాల నెపంతో దాడులు, హత్యలు పెరుగుతున్నాయి. మానసిక బలహీనత వలన విచక్షణ కోల్పోయి అతీంద్రియ శక్తులను నమ్మడం వల్లనే సమాజంలో ఇలాంటి దుర్ఘట నలు జరుగుతున్నాయి. ప్రజల్లో రోజురోజుకూ శాస్త్రీయ వైఖరి, ప్రశ్నించే తత్వం లోపించడమే ఈ గుడ్డి నమ్మకాలకు కారణం. ఇదే కాకుండా పాలకుల్లో కూడా శాస్త్రీయ వైఖరి లోపించడం దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మితి మీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు, ప్రభుత్వ విధానాలు ప్రజల్ని మరింత మూఢత్వం దిశగా ప్రేరేపిస్తున్నాయి. దేశంలో సైన్స్ ఆవిష్కరణల కన్నా సూడో సైన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సమాజ అభివృద్ధికి మూలం విజ్ఞాన శాస్త్రమే. కావున విద్యాసంస్థల్లో శాస్త్రీయ, ప్రగతిశీల అభ్యసనం జరగాలి. ప్రభుత్వాలు హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచన విధానాలను ప్రోత్సహించాలి.
– సంపతి రమేష్ మహారాజ్ , జన విజ్ఞాన వేదిక


