
8,922 కోట్ల అప్పు తీరింది!
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) రుణ భారం తీరిపోతోంది. ‘ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన
⇒ ఉదయ్ పథకంతో డిస్కంలకు రుణ విముక్తి
⇒ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు అప్పు బదిలీ
⇒ అంతమేర బాండ్ల వేలానికి కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) రుణ భారం తీరిపోతోంది. ‘ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన (ఉదయ్)’పథకంలో చేరడంతో డిస్కంలకు సంబంధించిన 75 శాతం అప్పులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ మేరకు రూ.8,922.93 కోట్ల విలువైన బాండ్ల జారీకి కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపుల మేరకు బాండ్ల వేలానికి చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఆర్‌బీఐకి లేఖ రాసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని కోరింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల చివరి వారం, మార్చి తొలి వారంలో డిస్కంల అప్పుకు సరిపడే మొత్తాన్ని బాండ్ల విక్రయం ద్వారా సమీకరించేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది.
‘ఉదయ్’నిబంధల మేరకే..
విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపర్చడం, విద్యుదుత్పత్తి ఖర్చును తగ్గించడం లక్ష్యాలుగా కేంద్రం ‘ఉదయ్’పథకాన్ని చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అందులో చేరాయి. రెండు నెలల కింద తెలంగాణ కూడా ఉదయ్‌లో చేరడంపై కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్రంలోని రెండు డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ప్రస్తుతం డిస్కంలు ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లకు కలిపి రూ.11,897 కోట్ల అప్పులున్నాయి. తాజాగా ‘ఉదయ్’లో చేరడంతో అందులో రూ.8,922.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల నుంచి విముక్తి పొందడంతో పాటు ఏటా రూ.387 కోట్ల మేర వడ్డీ చెల్లించే భారం నుంచి ఉపశమనం లభిస్తోంది. ఇక మిగిలిన రుణాలకు విద్యుత్ పంపిణీ సంస్థలు బాండ్ల రూపంలో హామీ ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల వేలం ద్వారా రూ.13 వేల కోట్ల మేర అప్పులు చేసింది. తాజాగా డిస్కంల రుణ భారం కూడా తోడుకానుంది.