
2030కి రూ.32 వేల కోట్లు అవసరం
కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు,బలోపేతానికి నిధుల కొరత
విద్యుత్ పంపిణీ సంస్థల భవిష్యత్ ప్రణాళిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) ఏర్పాటుపై ఆ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఆధునీకరణ, పంపిణీ వ్యవస్థ బలోపేతమే ప్రధాన లక్ష్యాలుగా ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉచిత విద్యుత్‌ను ఉద్దేశించి డిస్కం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది. అయితే..ఇదెలా సాధ్యమని డిస్కం అధికారులు అంటున్నారు.
ఉచితాలు ప్రతీ డిస్కం పరిధిలో ఉంటాయని, వీటిని ఒకే డిస్కం పరిధిలోకి తేవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వద్దకు తీసుకెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఉచితాల విషయాన్ని తర్వాత పరిశీలిద్దామని, ముందుగా డిస్కం ఏర్పాటుపై ఆర్థిక పరమైన నివేదిక రూపొందించాలన్నారు. నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనిని బట్టి కొత్త డిస్కం ఏర్పాటు ఆర్థిక సంస్థల వద్ద నిధులు పొందడానికేనని డిస్కం ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
రూ. 32 వేల కోట్లు టార్గెట్
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు డిస్కంలున్నాయి. ఇవి అన్నివిధాలా ఆర్థిక రుణాలు పొందాయి. ఇవే డిస్కంలు తిరిగి పొందడానికి కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. అప్పులు చేస్తే తప్ప ఆర్థికంగా ముందుకెళ్లడం కష్టమని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. రాజధానితోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 96,596 ఎంయూల విద్యుత్ వినియోగం ఉంది.
ఇది 2030 నాటికి 1.22 లక్షల ఎంయూలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. 2033–24 నాటికి రాష్ట్రంలో 1.30 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కావొచ్చు. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలు ఇటీవల దీనిపై ఈ తరహా నివేదికలే ఇచ్చాయి. డిమాండ్‌ను చేరుకోవడానికి విద్యుత్ సంస్థల పనితీరును గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. తొమ్మిది 440 కేవీ సబ్‌స్టేషన్లు, 220 కేవీ సబ్‌స్టేషన్లు 34, 132 కేవీ సబ్‌స్టేషన్లు 75 ఏర్పాటు చేయాలని డిస్కంలు పేర్కొన్నాయి.
ఈ ప్రక్రియకు ట్రాన్స్‌కో, డిస్కంలకు కలిపి రూ. 32 వేల కోట్లు అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని విద్యుత్ సంస్థలు సమకూర్చుకోవడానికి కొత్త డిస్కం ఏర్పాటు మార్గమని భావిస్తున్నారు. పీఎఫ్‌సీ, ఇతర ఆర్థిక సంస్థలు కొత్త డిస్కంలకు రుణాలు ఇస్తాయని కన్సల్టెన్సీ సంస్థలు అధికారులకు సలహాలిచ్చాయి. ఈ దిశగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.