చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు! | TDP leaders get spot billing contracts in power distribution companies | Sakshi
Sakshi News home page

చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు!

Oct 1 2025 4:04 AM | Updated on Oct 1 2025 4:04 AM

TDP leaders get spot billing contracts in power distribution companies

రాజమహేంద్రవరం ఎస్‌ఈకి కాంట్రాక్టర్లు సమర్పించిన వినతిపత్రం

విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో కూటమి నేతలకే స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టులు

అర్హత లేనివారికీ టెండర్లు కట్టబెడుతున్న డిస్కంలు 

ధరలు పెంచిమరీ కాంట్రాక్ట్‌లు 

విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌ తీస్తున్న వారికి మంగళం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, సబ్‌ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, బూడిద, బొగ్గు టెండర్లలో అందిన కాడికి దోచుకుంటున్న టీడీపీ నేతలు చివరకు స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టులనూ వదలడం లేదు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్‌ పాత కాంట్రాక్టర్ల కాలపరిమితి కొన్ని నెలల క్రితం పూర్తయ్యింది. కొంతకాలం పాటు డిస్కంలు తమ సిబ్బందిలోని లైన్‌మెన్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్ల ద్వారా విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌ చేయించాయి. తర్వాత ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్‌లో టెండర్లు ఖరారు చేసి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్‌లో టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ప్రక్రియ మొత్తం చినబాబు కనుసన్నల్లోనే నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అసలు కాంట్రాక్టర్లను ఎగరగొట్టి.. 
చినబాబు దెబ్బకి స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టర్లు ఎగిరిపోతున్నారు. డిస్కంలలో జిల్లాలు (సర్కిళ్లు), డివిజన్లు (సెక్షన్లు) వారీగా స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టర్లు ఉంటారు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్‌లో సుమారు వంద మంది బిల్లింగ్‌ కాంట్రాక్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 10కి పడిపోయింది. ఈపీడీసీఎల్‌ లో ఉన్న దాదాపు 70 మంది కాంట్రాక్టర్లకు మంగళం పాడే ప్రక్రియ మొదలైంది.

సాంకేతిక అర్హతలు లేనివారు చినబాబు పేషీ నుంచి ఫోన్లు  చేయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పాత వారిని కాదని టెండర్లు వారికే ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ సరి్టఫికెట్‌ లేనివారిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాజమండ్రి, భీమవరం సర్కిళ్ల సూపరింటెండెంట్‌ ఇంజినీర్లకు పాత కాంట్రాక్టర్లు వినతిపత్రాలు అందజేశారు. 

టెండర్‌ ముగిశాక పెంచేసుకున్నారు 
రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 1.95 కోట్ల విద్యుత్‌ సర్విసులున్నాయి. వాటిలో 20 శాతం నుంచి 30 శాతం వరకూ పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్విసులుంటాయి. మిగతా సర్వీసులకు ప్రతినెలా విద్యుత్‌ బిల్లులను స్పాట్‌ బిల్లింగ్‌ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టులు ఇస్తుంటాయి. కాంట్రాక్టర్‌కు గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కమీషన్‌ నిర్ణయించి ఇస్తున్నారు. అలా 2023–25లో నిర్ణయించిన రేట్లతోనే తాజాగా టెండర్లు పిలిచారు.

ఆ ధరలు గిట్టుబాటు కావడం లేదని సీపీడీసీఎల్‌ కాంట్రాక్టర్‌ చెప్పడంతో టెండర్‌ ఇచ్చిన 8 నెలల తరువాత ధర పెంచారు. తొలుత ఒక్కో సర్విసుకు పట్టణ ప్రాంతంలో రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు. కాంట్రాక్టర్‌ కోరడంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ.0.75 పైసలు చొప్పున పెంచారు. రెండేళ్లపాటు ఇవే ధరలతో కాంట్రాక్టు కొనసాగనుంది.

ఇప్పుడు ఇవే ధరలను ఈపీడీసీఎల్‌లోనూ అమలు చేయాలంటూ కాంట్రాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా స్పాట్‌ బిల్లింగ్‌ పనులు చేస్తున్న తమను కాదని, యువనేత సిఫారసులకు పెద్దపీట వేయడం అన్యాయమని పాత కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ కాకపోయినా టెండర్‌ దక్కేలా పిలిచిన టెండర్లను రద్దుచేసి, అందరికీ అవకాశం కల్పిస్తూ మరలా టెండర్లు పిలవాలని కోరుతున్నారు. 

కాంట్రాక్టరుకు లాభం.. రీడర్లకు కష్టం 
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా కలిపి దాదాపు 10 వేల మంది మీటర్‌ రీడర్లు పనిచేస్తున్నారు. వీరు నెలలో రెండుసార్లు స్పాట్‌ బిల్లింగ్‌ మెషిన్‌ ద్వారా రీడింగ్‌ తీసి బిల్లును వినియోగదారులకు ఇస్తుంటారు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మీటర్‌ రీడర్లను తీసుకుంటారు. వీరు 8 రోజుల బిల్లింగ్‌ పూర్తిచేసిన తర్వాత  మిగతా 22 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది.

కనీసం విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం, మీటర్లు మార్చడం, మొండి బకాయిలున్న సర్వీసులను తొలగించడం వంటి పనులకైనా తమకు అవకాశం ఇవ్వాలని రీడర్లు అడుగుతున్నారు. కానీ.. వారి విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోవడం లేదు. డిస్కంలు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కాగా.. కాంట్రాక్టర్ల వద్ద పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. పైగా వారికి ఇస్తున్న వేతనం నుంచి కూడా కొంత మొత్తాన్ని ప్రతినెలా కాంట్రాక్టర్లు కమీషన్‌గా తీసేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement