Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!  | FactCheck: Smart Meters Are For Quality Electricity In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు! 

Published Fri, Jan 5 2024 4:59 AM

Smart meters are for quality electricity - Sakshi

సాక్షి, అమరావతి: అర్హత ఉన్నవారెవరైనా స్మార్ట్‌ మీటర్ల టెండర్‌ ప్రక్రియలో పాల్గొనవచ్చని స్పష్టంగా చెప్పి.. వచ్చిన టెండర్లలో పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి తక్కువ ధర వచ్చేలా రివర్స్‌ టెండరింగ్‌ కూడా జరిపి.. అప్పుడు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగించే టెండర్‌ను ఖరారుచేసినా ఈనాడు రామోజీరావు పెడబొబ్బలు పెడుతున్నారు. అదేదో ఘోరమైనట్లు తన విషపుత్రిక ఈనాడులో  పిచ్చి రాతలు రాసిపారేస్తున్నారు. తమకు అభ్యంతరంలేదని రైతులే చెబుతున్నా స్మార్ట్‌మీటర్లపై ఆ పత్రిక పదే పదే విషం కక్కుతోంది.

ఇందులో భాగంగానే ‘స్మార్ట్‌గా మేసేస్తున్నారు’ పేరుతో గురువారం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కానీ, ఎప్పటిలాగే రామోజీ రాతల్లో ఏమాత్రం వాస్తవంలేదని.. అయినా రైతులకు లేని అభ్యంతరం ఆయనకెందుకని ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీ కె. సంతోషరావు, తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌లు తెలిపారు. శాస్త్ర, సాంకేతికతపై అవగాహనా లేమితో ఈనాడు కథనం వాస్తవానికి దూరంగా వుందని వారు తెలిపారు. ఈ మేరకు సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..

నాణ్యమైన విద్యుత్‌ కోసమే స్మార్ట్‌ మీటర్లు..
పూర్వం వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు మీటర్ల ద్వారా విద్యుత్‌ వినియోగం జరిగేది. ఆ తర్వాత మోటార్‌ హార్స్‌ పవర్‌ ప్రాతిపదికన వినియోగాన్ని లెక్కించడంతో మీటర్ల వాడకం తగ్గింది. ఆ తర్వాత విద్యుత్‌ సంస్థలు విడతల వారీగా వినియోగదారులకు కెపాసిటర్లను అందించినప్పటికీ కాలక్రమేణా వాటిని రైతులే తీసేశారు. దీంతో సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓ ఎంఎస్‌. 22, తేదీ : 01.09.2020) జారీచేసింది.

దీని ప్రకారం.. ఃనాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు విద్యుత్‌ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమచేస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఒక్కో వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుకు అనుబంధ పరికరాలకు రూ.12,128.71పై.. పన్నులతో కలిపి రూ.14,455ల వ్యయంతో మీటరు బాక్స్‌తో పాటు పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్‌ పరికరాలను ఏర్పాటుచేస్తున్నాం. తద్వారా ‘ఆర్డీఎస్‌ఎస్‌’ పథకంలో 60 శాతం గ్రాంటు రూపంలో డిస్కంలకు సమకూరుతుంది’.. అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ప్రమాదాలను తగ్గించవచ్చు..
అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, మీటరు అమర్చడానికి, అవి పాడైపోకుండా వుండేందుకు వీలుగా మీటరు బాక్సులను ఏర్పాటుచేస్తున్నాం. ఎంసీబీ ద్వారా ఓవర్‌ లోడ్‌ ప్రొటెక్షన్‌ జరుగుతుంది. తద్వారా విద్యుత్‌ ప్రమాదాలను తగ్గించడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్యూర్స్‌ను కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఏటా సగటున 45,098 వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఏటా రూ.102 కోట్ల వ్యయాన్ని డిస్కంలు భరించాల్సి వస్తోంది. కెపాసిటర్లను అమర్చడం ద్వారా నాణ్యమైన ఓల్టేజ్‌తో రైతులకు విద్యుత్‌ సరఫరా చేయవచ్చు.

మహారాష్ట్రతో పోలికేంటి?
మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎంఎస్‌ఇడీసీఎల్‌) సంస్థ పరిధిలో హెచ్‌వీడీఎస్‌ పథకం కింద వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు వాల్‌ మౌంటెడ్‌ ఎస్‌ఎంసీ మీటరు బాక్సును మాత్రమే రూ.2,100లతో ఏర్పాటుచేశారు. అయితే, మన రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఎస్‌ఎంసీ మీటరు బాక్సులో అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్తింగ్‌ పరికరాలు కూడా వుండడంతో మీటరు బాక్సు సైజు సుమారు రెండింతలు వుంటుంది. మహారాష్ట్ర స్మార్ట్‌ మీటర్లు గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం అమర్చుతున్నారు. ఇక్కడ పూర్తిగా వ్యవసాయ విద్యుత్‌ ఆధారిత సర్వీసులకు మాత్రమే పెడుతున్నాం. వ్యవసాయ స్మార్ట్‌ మీటర్‌ అమర్చడంతో గృహ, వాణిజ్య అవసరాల కోసం అమర్చిన స్మార్ట్‌ మీటర్లను పోల్చడం సరికాదు. 

మీటర్లతో అందరికీ మేలు..
మీటర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్సిడీ మొత్తం మిగులుతుంది. ఈ మిగులు డబ్బుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. డిస్కంకు జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో రాష్ట్రవ్యాప్తంగా వున్న వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో లోడ్‌ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్‌ ప్రణాళికను రూపొందించుకునే సౌలభ్యం వుంటుంది.

అంతేకాక.. సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్‌ హెచ్చుతగ్గులను రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకే పనులను అప్పగించాం. ఈ ప్రక్రియలో ఎలాంటి గోప్యతకు ఆస్కారం లేదు. విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌) పథకంలో భాగంగా స్మార్ట్‌ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు­చేస్తున్నా­మని సీఎండీలు వివరించారు.

తెలియకపోతే తెలుసుకోండి..
విద్యుత్‌ సంస్థల్లో డీబీటీ విధానం కోసం 93 నెలల కాలపరిమితితో టెండర్లను ఆహ్వానించాం. అనుబంధ పరికరాలకు సంబంధించిన టెండరును విక్రాన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకోవడంతో ఆ సంస్థ అనుబంధ పరికరాలను బాక్సులో అమర్చి సరఫరా చేసి వ్యవసాయ సర్వీసు వద్ద అమర్చుతోంది. అంతేతప్ప అది ఖాళీ బాక్సులు ఇస్తున్నట్లు కాదు. 

♦ స్మార్ట్‌ మీటర్ల టెండర్లను దక్కించుకున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ విక్రాంత్‌ సంస్థ అమర్చిన అనుబంధ పరికరాలతో కూడిన మీటరు బాక్సులో మీటరు సరఫరా, అమరిక, అనుసంధానం పనులు చేపడుతోంది. 
♦ ఈ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సెంట్రల్‌ సర్వర్లతో అనుసంధానం అయిన ప్రతి సర్వీసు మీటర్‌ డేటా ఆన్‌లైన్‌ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. 
♦సరఫరాలో అంతరాయాలను, ఓల్టేజ్‌ హెచ్చు­తగ్గులను నివారించడంతో పాటు రైతులు, సంస్థ మధ్య పారదర్శకతను పెంపొందించేందుకు అవకాశం వుంటుంది. 
♦  ఒప్పందం ప్రకారం డేటా నమోదైన సర్వీసు­లకు మాత్రమే ప్రతినెలా బిల్లింగ్‌ చేయడం జరుగుతుంది. 
♦ మీటర్‌ రీడింగ్‌లో సర్వే, జీఎస్‌ మ్యాపింగ్, అనుసంధానం, హెచ్‌ఏఎస్, ఎంఏఎస్, ఎంఎంఎస్, సిమ్‌కార్డ్‌ రెంటల్, నెట్‌వర్క్‌ కాస్ట్, ఆపరేషన్‌–మెయింటినెన్స్‌ వంటి సేవలను పొందుపరిచారు. 
♦ వ్యవసాయ సర్వీసులు దూరంగా వుండడంవల్ల నెట్‌వర్క్‌ హెచ్చు­తగ్గులు ఉన్నచోట మీటరు దగ్గరకు వెళ్లి మీటరు డేటా స్వీకరిస్తున్నారు. 
∙దీని అంచనా సుమారు 15 శాతంగా నిర్ణయించాం. ఈ అంచనా వ్యయం అధ్యయనం చేసిన తర్వాత నెలకు ఒక మీటరుకు రూ.197.05 పైసలుగా నిర్ణయించాం.

Advertisement
 
Advertisement