
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి తదితరులు
త్వరలోనే అన్ని అనుమతులు ఇస్తామన్న సీఎం
ఆర్థికపరమైన అంశాలపై అధ్యయనం చేయాలని సూచన
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ అధికారులు రూపొందించిన ప్రణాళికకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆర్థికపరమైన అంశాలపై మరింత అధ్యయనం చేయాలని సూచించారు. ఏయే సంస్థల నుంచి రుణాలు పొందే వీలుంది? ఎంత మేర రుణాలు తీసుకోవచ్చన్న దానిపై నిర్దిష్ట సమాచారం అందించాలని అధికారులకు చెప్పినట్టు తెలిసింది.
సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం రాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, జెన్‌కో ఎండీ హరీశ్‌రావు, సింగరేణి సీఎండీ బలరాం, డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, రెడ్‌కో చైర్మన్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఉచితాలన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి..: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ కొత్త డిస్కమ్ పరిధి పర్యవేక్షణలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని తాగునీటి సరఫరాను కొత్త డిస్కమ్ పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా రూపొందించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు డిస్కమ్‌లు కమర్షియల్ ఆపరేషన్ విధులు నిర్వర్తిస్తాయని, కొత్త డిస్కమ్ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ డిస్కమ్‌కు కావాల్సిన మానవ వనరులను రెండు డిస్కమ్‌ల పరిధి నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేయవచ్చని, కొంతమందిని తాత్కాలికంగా నియమించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
దీంతో డిస్కమ్ ఏర్పాటుకు కావాల్సిన నిధుల సమీకరణపై ప్రభుత్వం చర్చించాల్సి ఉందని, కేబినెట్ ఆమోదం తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని సీఎం అన్నట్టు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని అన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
రాజధానిలో అండర్ గ్రౌండ్ కేబుల్
రాష్ట్ర రాజధానితో పాటు, పరిసర జిల్లాల్లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న వైనాన్ని అధికారులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో స్మార్ట్ టెక్నాలజీతో నడిచే ట్రాన్స్‌ఫార్మర్లు, కేబులింగ్ వ్యవస్థ అవసరాన్ని తెలియజేశారు. ఇతర దేశాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం అమలులో ఉందంటూ.. దీన్ని రాజధానిలోనూ తీసుకొచ్చేందుకు రూపొందించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఎక్కువ స్థలం ఆక్రమించకుండా సబ్ స్టేషన్ల ఏర్పాటు విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆన్‌లైన్ విధానంలో సబ్ స్టేషన్లు, ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటి పనితీరును గుర్తించే వ్యవస్థ గురించి వివరించారు. సబ్ స్టేషన్ సామర్థ్యానికి మించి విద్యుత్ కనెక్షన్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ అంతరాయాలను అదుపు చేయాలని సీఎం ఆదేశించారు.
అవినీతిపై ఓ కన్నేయండి
విద్యుత్ శాఖ అవినీతిమయమైందన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నట్టు తెలిసింది. తాజాగా ఓ అధికారి ఏసీబీకి చిక్కడంపై ఆయన ఆరా తీశారు. విద్యుత్ సంస్థల్లో కీలకమైన అధికారులపైనా ఆరోపణలున్నాయని, ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శితో సీఎం అన్నట్టు తెలిసింది. ఏసీబీతో సమన్వయం చేసుకుని, అక్రమ ఆస్తులున్న వారి జాబితాను రూపొందించాలని ఆయన సూచించినట్లు సమాచారం. జెన్‌కోలో ఓ డైరెక్టర్ స్థాయి అధికారి అవినీతి వ్యవహారంపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది.