అవసరానికి మించి కొనుగోలు చేశారు

Losses with Wind and solar power says Nagarjuna Reddy - Sakshi

పవన, సౌర విద్యుత్‌తోనే నష్టాలు

అందుకే రాష్ట్రంపై అధిక భారం

గతంలోనే కమిషన్‌ దృష్టికి తెచ్చాం

ఏపీఈఆర్‌సీ ముందు డిస్కమ్‌లు

విద్యుత్‌ అధికారులతో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ భేటీ

సాక్షి, అమరావతి: అవసరానికి మించి పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్ల వల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టపోతాయని గతంలోనే డిస్కమ్‌లు స్పష్టంగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి విద్యుత్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని తొలిదశలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు, అయినప్పటికీ వీటిని అనుమతించడం వల్లే పంపిణీ సంస్థలు ఈ ఐదేళ్లలో భారీగా నష్టాన్ని మూటగట్టుకున్నాయని వివరించారు. రాష్ట్ర విద్యుత్‌రంగ పరిస్థితిపై ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు.

విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితి, ఉత్పత్తి, విద్యుత్‌ డిమాండ్, విద్యుత్‌ కొనుగోళ్ల గురించి ఆయనకు విద్యుత్‌ అధికారులు వివరించారు. కేంద్రం పెట్టిన లక్ష్యానికి మించి పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లు జరిగాయంటూ.. 2015–16లో 5 శాతం లక్ష్యమైతే 5.59 శాతం, 2016–17లో 8.6 శాతం కొనుగోలు చేశారని, 2017–18లో 9 శాతం తీసుకోవాల్సి ఉంటే 19 శాతం తీసుకున్నారని, 2018–19లో 11 శాతం లక్ష్యానికిగాను ఏకంగా 23.4 శాతం ప్రైవేటు పవన, సౌర విద్యుత్‌ తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 2015–16 నుంచి 2018–19 నాటికి విద్యుత్‌ సంస్థలపై రూ.5,497 కోట్ల అధిక భారం పడిందన్నారు.

రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు(ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లు) రూ.65 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు. 2016–17లో అధిక రేట్లకు 10,478 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేశారని, చౌకగా లభించే థర్మల్‌ విద్యుదుత్పత్తిని 2017–18లో 12,014 మిలియన్‌ యూనిట్లు, 2018–19లో 7,628 మిలియన్‌ యూనిట్ల మేరకు తగ్గించినందువల్ల విద్యుత్‌ సంస్థలకు నష్టం వాటిల్లిందంటూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాన్ని ఏపీఈఆర్‌సీ ముందు పెట్టారు. గడచిన ఐదేళ్లలో కమిషన్‌ అనుమతించిన దానికన్నా అధికంగా విద్యుత్‌ కొనుగోళ్లు జరిగాయని, ఆ మొత్తాన్ని(ట్రూ–అప్‌) కమిషన్‌కు సమర్పించలేదని, ఈ లోటును పూడ్చడానికి అడ్డగోలుగా అప్పులు చేసిన విషయాన్ని వారు వివరించారు. పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్లపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ చైర్మన్‌ ఆదేశించినట్టు అధికారవర్గాలు చెప్పాయి.

అవినీతిని అరికట్టాలి
 ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ నాగార్జునరెడ్డి
విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో అవినీతికి కళ్లెం వేయాలని డిస్కమ్‌ల సీఎండీలకు ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ నాగార్జునరెడ్డి సూచించారు. గ్రీవెన్స్‌ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పురోగతిని వివరించాలని కోరారు. విద్యుత్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. కమిషన్‌ పెట్టిన పరిమితికి మించి అయ్యే ఖర్చు(ట్రూ ఆప్‌)ను ఎప్పటికప్పుడు ఏపీఈఆర్‌సీకి సమర్పించాలన్నారు. విద్యుత్‌రంగ వాస్తవ పరిస్థితిని ఏపీఈఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ సమన్వయ కమిటీ సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని, ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి ఈ భేటీని ఏర్పాటు చేయాలని కమిషన్‌ చైర్మన్‌ సూచించినట్టు చెప్పారు. రబీ సీజన్, వేసవిలో వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారన్నారు. సమావేశంలో ఏపీఈఆర్‌సీ సభ్యులు రఘు, రామ్మోహన్, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్‌ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి, హరినాథ్‌ పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top