ఏపీఈఆర్‌సీ స్వతంత్ర అధికారాలకు కూటమి మంగళం
స్వతంత్ర సంస్థగా ఏపీఈఆర్‌సీ ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది
అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని బాబు మోసం చేశారు
స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలన్న లోకేశ్ ఇప్పుడు నోరుమెదపరే..!
విజయవాడలో జరిగిన ఏపీఈఆర్‌సీ అభిప్రాయ సేకరణలో మండిపడిన ప్రజలు
సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి ఓ రాష్ట్ర హైకోర్టుకు ఉన్నంత అధికారం ఉంటుంది. కానీ బాబు సర్కారు ఏపీఈఆర్‌సీ విద్యుక్తధర్మానికి తూట్లు పొడిచింది. స్వతంత్ర అధికారాలకు మంగళం పాడింది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా చేసింది’’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు(ఏపీఈపీడీసీఎల్),మధ్య(ఏపీసీపీడీసీఎల్), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (ఆగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్–ఏఆర్‌ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహిరంగ విచారణ నిర్వహించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి ఏపీఈఆర్‌సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి, ఇన్‌చార్జ్ చైర్మన్ హోదాలో అభిప్రాయాలను స్వీకరించారు.
లేఖలిస్తే సరా..డబ్బులివ్వరా
ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీ సొమ్ము 2025 సెప్టెంబర్ నాటికి రూ.12,718 కోట్లు ఉందని, పూర్తిగా డిస్కంలకు సర్కారు చెల్లించడం లేదని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్ ఎంవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రూ.4,495 కోట్లు కూడా సబ్సిడీ బకాయిలకు కలిశాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం లేఖ ఇస్తే సరిపోదని, డబ్బులూ సకాలంలో ఇవ్వాలని, అలా ఇవ్వకపోవడం వల్ల డిస్కంలు అప్పుల పాలవుతున్నాయన్నారు. దీనికి తోడు బిల్లుల బకాయిల రూ.15137 కోట్లు 2025 మార్చినాటికి ఉన్నాయన్నారు. ఇందులో ప్రైవేటు సంస్థలవి రూ.6,288 కోట్లు కాగా, మిగిలినవి ప్రభుత్వ సంస్థలవేనని విమర్శించారు.
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని చంద్రబాబు, లోకేశ్
సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం, తగ్గిస్తాం అని హామీ ఇచ్చారని, కానీ గడిచిన 18 నెలల్లో భారీగా చార్జీలు పెంచారని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. అదే విధంగా స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే పగలగొట్టాలని చెప్పిన మంత్రి లోకేశ్ ఇప్పుడు బలవంతంగా మీటర్లు పెట్టిస్తున్నా.. నోరు మెదపరేమని దుయ్యబట్టారు.
విద్యుత్ బిల్లులోని క్యూఆర్‌కోడ్ పనిచేయడం లేదని, అడ్డగోలు చార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వేధిస్తున్నారని పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేశారు.
ఆ చార్జీలను తొలగించాలి
ఇక శుక్రవారం మ«ద్యాహ్నం నుంచి ఆన్‌లైన్ (వర్చువల్) విధానంలో ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ట్రూ అప్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీలను తొలగించాలని, విద్యుత్ అధికారులు, వినియోగదారులకు సమన్వయ సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డిస్కంల సీఎండీలు పి.పుల్లారెడ్డి, శివశంకర్ లోతేటి, ఏపీఈఆర్‌సీ జాయింట్ డైరెక్టర్ డి.రమణయ్యశెట్టి, కార్యదర్శి పి.కృష్ణ, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీజీఎంలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 27న కర్నూలులో ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది.


