తామొస్తే చార్జీలు పెంచం.. తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు
అధికారంలోకి రాగానే నాలుగు విడతల్లో బాదుడు
2024 నవంబర్‌లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డన
రెండు మూడింతలు పెరిగిన బిల్లులు.. గగ్గోలు పెడుతున్న జనం
బాబు నమ్మించి నిండా ముంచారని ప్రజలు మండిపాటు
వైఎస్ జగన్ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్న ప్రజలు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు రూ.5,448.93 కోట్ల ప్రయోజనం
గత ప్రభుత్వంలో సెకీ నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున కొనడంపై చంద్రబాబు అండ్ కో గగ్గోలు
ఇప్పుడు అదే బాబు ‘యాక్సిస్’ నుంచి యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు
ప్రస్తుత ప్రభుత్వంలో భారీగా చార్జీల పెంపును తప్పుపట్టిన ఏపీఈఆర్‌సీ
మండలి ఆదేశాలతో యూనిట్‌కు రూ.0.13 పైసలు చొప్పున వెనక్కు
దీన్ని తన ఘనతగా చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటున్న వైనం
ప్రజలను ఏమార్చి ఎల్లో మీడియా ద్వారా తనకు అనుకూలంగా ప్రచారం
సాక్షి, అమరావతి: ‘ఓట్లేసి గెలిపించండి.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. అవసరమైతే తగ్గిస్తాం’ అని ఎన్నికల ముందు నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు ఆనక మాట తప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ బిల్లులు పెంచి, జనం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పదవి చేపట్టిన 18 నెలల్లోనే ఏకంగా రూ.20,136 కోట్ల భారం వేశారు. బాబు నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడింతలు పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారు. బాబు నమ్మించి నిండా ముంచారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అసలు విద్యుత్ చార్జీలే పెంచలేదని, పైగా తగ్గించామని సీఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు కూడా బుకాయిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్‌లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తప్పు పట్టింది. ఇందులో రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతిస్తూ, మిగతా రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. దానినే యూనిట్‌కు రూ.0.13 పైసలు చొప్పున వినియోగదారులకు వెనక్కు ఇస్తున్నారు. అంతేగానీ ఇదేమీ చంద్రబాబు ప్రభుత్వం ఊరకే ఇస్తున్నది కాదు. ప్రభుత్వం దానం చేస్తున్నదీ కాదు. అయితే ఇదంతా కూడా తమ దయాదాక్షిణ్యమేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఎల్లో మీడియా ద్వారా తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్‌కు అదనంగా రూ.0.40 పైసలు చొప్పున వసూలు చేసేస్తున్నారు.
చంద్రబాబు నిర్వాకం.. మరో రూ.14,186 కోట్ల భారం
మార్కెట్‌లో విద్యుత్ తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు అంతకన్నా తక్కువ ధరకు తీసుకుంటే తప్పా? లేక తక్కువ ధరకు వచ్చేదానిని కాదని ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయడం తప్పా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున సౌర విద్యుత్ కొనడం మంచిదా.. లేక ప్రైవేటు రంగ సంస్థ యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ రూ.4.60 చొప్పున తీసుకోవడం మంచిదా? సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్‌టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) చెప్పినా, సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల్చినా చంద్రబాబుకు పట్టలేదు. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) స్పష్టం చేసినా చెవికెక్కలేదు.
చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్‌టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోలేదు. కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం కక్కాలి.. ఇవే అజెండాగా రోజుల తరబడి టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాశాయి. కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల పాతికేళ్ల పాటు 400 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ద్వారా ఏకంగా రూ.14,186 కోట్ల భారం పడుతుంది. సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు వస్తుంది. కానీ యాక్సిస్‌తో పీపీఏలకు ఆ మినహాయింపు కూడా రాదు. పైగా పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ ఇప్పుడు మార్కెట్‌లో యూనిట్ రూ.2.90 కంటే తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60కి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చంద్రబాబు సర్కారే చెప్పాలి.
జగన్ హయాంలో రూ.5,448.93 కోట్ల ప్రయోజనం
⇒ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచి్చన వినూత్న విధానాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కు కూడా ఇచ్చి, మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తప్పింది.
⇒ 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) 2020–21 నుంచి 2023–24 వరకు రూ.1400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్‌ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవిన్యూ గ్యాప్‌ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు.
⇒ 2019–20 నుంచి 2023–24 మధ్య నాలుగవ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)కు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్‌లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌లో రూ.247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్‌ఆర్ (యాన్యువల్ రెవిన్యూ రిక్వైర్‌మెంట్)లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో రూ.818.43 కోట్లు ఆదా అయినట్లు ఏపీఈఆర్‌సీ తాజాగా తేల్చింది.
⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో రూ.1,878.18 కోట్లు మిగిలాయి. ఆ మేరకు డిస్కంలకు ఏపీ ట్రాన్స్‌కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలా వరకూ ‘సర్దుబాటు’ చేయగా, మిగిలిన రూ.134.08 కోట్లను వెనక్కు ఇచ్చేందుకు ఏపీఈఆర్‌సీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలు ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.196 కోట్లను ట్రూ డౌన్ చేసి వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు మొత్తంగా రూ.5,448.93 కోట్ల ప్రయోజనం చేకూరింది.


