రూ.వేలకోట్లకు సంబంధించిన విచారణలను ఒకే అధికారితో జరిపిస్తున్న ప్రభుత్వం
ఇప్పటికే సాంకేతిక పరిశీలన చేయకుండానే డిస్కంల ప్రతిపాదనలకు ఆమోదం
మొక్కుబడి బహిరంగ విచారణకు హాజరవుతున్నది పదిమందిలోపే
న్యాయమూర్తి స్థాయి చైర్మన్‌తో నడిపించాల్సిన మండలిని భ్రష్టుటపట్టించిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ముఖ్యమంత్రి చంద్రబాబు కబంధహస్తాల్లో బందీ అయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో దోపిడీకి తెరలేపిన పాలకులు తమకు అనుకూలంగా ఆదేశాలు వెలువరించేందుకు వీలుగా ఏపీఈఆర్‌సీని భ్రషు్టపట్టిస్తున్నారు.
రూ.వేలకోట్ల విద్యుత్‌సంస్థల లావాదేవీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వంటి ఆరి్థక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తీర్పులు ఇవ్వడం ఈ కమిషన్‌పై ఉన్న అతిపెద్ద బాధ్యత. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఏపీఈఆర్‌సీకి ఇప్పుడు పెద్దదిక్కు లేకుండా పోయింది. ఏడాదికిపైగా చైర్మన్ లేరు. 11 నెలలుగా ఒకే ఒక్క సభ్యుడితో నెట్టుకొస్తోంది.
చైర్మన్ వస్తే కష్టమని..
చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్‌సీకి 2024 అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి చైర్మన్ లేరు. గతేడాది ఫిబ్రవరిలో మరో సభ్యుడు కూడా పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఒకే ఒక్కరు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా, సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జూలైలో ఒక సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం దాన్ని కూడా సాగదీస్తోంది.
చట్టబద్ధమైన సంస్థకు చైర్మన్‌ను నియమించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తిని ఏపీఈఆర్‌సీకి చైర్మన్‌గా నియమించాల్సి ఉంది. అయితే ఆ స్థాయివారు చైర్మన్‌గా ఉంటే తామనుకున్న పనులు జరగవని కూటమి నేతలు భావిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కొంతకాలం కిందట ఈ విషయంపై సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కలుగజేసుకుంది. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు.
గత ప్రభుత్వంలో ఏపీఈఆర్‌సీకి వెలుగు
1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్‌సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే. కానీ మండలి హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. అప్పుడు ఏపీకి తీసుకురాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని 2023 ఆగస్టు 25న నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
కమిషన్‌కు రెండెకరాల స్థలంలో రూ.25 కోట్లకుపైగా నిధులు వెచి్చంచి 15 వేల చదరపు అడుగుల కార్యాలయ భవనం, 5వేల చదరపు అడుగుల అతిథిగృహం నిరి్మంచింది. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్‌సీ క్యాంపు కార్యాలయాన్ని గత ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగష్టు 18న ప్రారంభించారు.
అన్నిటికీ ఒక్కరే
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లపై ఈ నెల 20 నుంచి ఏపీఈఆర్‌సీ విజయవాడ, కర్నూలు, తిరుపతిల్లో బహిరంగ విచారణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని సైతం ఇన్‌చార్జి చైర్మన్‌గా ఉన్న సభ్యుడితోనే పూర్తి చేయిస్తోంది. ఆ క్రమంలోనే అనతి కాలంలోనే పలు ప్రైవేటు సంస్థలతో అత్యధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు మండలి నుంచి ఆమోదం తెచ్చుకుంది.
సాంకేతిక పరిశీలన వంటివి లేకుండానే విద్యుత్ సంస్థల పిటిషన్లను యథాతథంగా అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి తెచి్చంది. బహిరంగ విచారణలు సైతం మొక్కుబడిగానే అరకొరగా జరుగుతున్నాయి. అదికూడా ఆన్‌లైన్ విధానంలోనే. విచారణకు వస్తున్నవారు కూడా పదిమందికి మించి ఉండటం లేదు. తమకు మేలు చేయాల్సిన ఏపీఈఆర్‌సీని చంద్రబాబు ఇష్టానుసారం నడిపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.


