ప్రీ పెయిడ్‌ విద్యుత్‌ ‘సౌభాగ్య’o! | Pre-paid electricity by March 31, 2019 | Sakshi
Sakshi News home page

ప్రీ పెయిడ్‌ విద్యుత్‌ ‘సౌభాగ్య’o!

Oct 23 2017 2:35 AM | Updated on Sep 5 2018 4:12 PM

Pre-paid electricity by March 31, 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సదుపాయం లేని గృహాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి సహజ్‌ బిజ్లీ హర్‌ ఘర్‌ యోజన (సౌభాగ్య) పథకం కింద ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేయడంతోపాటు ప్రీ పెయిడ్‌/స్మార్ట్‌ మీటర్లను బిగించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా గృహాలకు ప్రీ పెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రతి నెల ముందస్తుగా బిల్లులు చెల్లించి విద్యుత్‌ వినియోగించుకునే కొత్త విధానం అమల్లోకి రానుంది. సౌభాగ్య పథకానికి సంబంధించి తాజాగా రాష్ట్రాలకు పంపిన ప్రాథమిక విధివిధానాల్లో కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విద్యుత్‌ సదుపాయం లేని గృహాలకు ఈ పథకం కింద 2019 మార్చి 31లోగా ఉచిత కనెక్షన్లు జారీ చేయాలని రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు గడువు సైతం నిర్దేశించింది.

ఈ ప్రాజెక్టు వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం గ్రాంట్‌గా ఇవ్వనుండగా, కనీసం 10 శాతాన్ని రాష్ట్రాల డిస్కంలు, మిగిలిన 30 శాతం వరకు వ్యయాన్ని డిస్కంలు రుణాలు సమీకరించి ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంటుంది. 2018 డిసెంబర్‌లోగా 100 శాతం గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేసిన రాష్ట్రాలకు కేంద్రం అదనంగా మరో 15 శాతం గ్రాంట్‌ అందించనుంది. ఈ అదనపు గ్రాంట్‌కు అర్హత సాధించిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి 75 శాతం గ్రాంట్లు రానుండటంతో ప్రాజెక్టు అమలుకు మొత్తం వ్యయంలో 15 శాతం రుణాలు తీసుకుంటే సరిపోనుంది. ఈ మేరకు సౌభాగ్య పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాల డిస్కంలకు పంపింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు లేవని కేంద్రం అంచనా వేసింది. వాటికి కనెక్షన్లు జారీ చేసేందుకు రూ.16,320 కోట్ల వ్యయం కానుండగా, రాష్ట్రాలకు రూ.12,320 కోట్ల నిధులను కేంద్రం అందించనుంది. 

కేంద్రం సూచనలివీ..
- సౌభాగ్య పథకం కింద ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌కు అర్హత సాధించని గృహాలకు కేవలం రూ.500 రుసుముతో కనెక్షన్లు జారీ చేయాలి. మిగిలిన వ్యయాన్ని నెలవారీ విద్యుత్‌ బిల్లుతో కలిపి 10 వాయిదాల్లో వసూలు చేయాలి. 
- బిల్లులు చెల్లించక విద్యుత్‌ కనెక్షన్లు కోల్పోయిన ఎగవేతదారులకు సౌభాగ్య పథకం కింద ఉచిత కనెక్షన్లు జారీ చేయరాదు. 
- గ్రామ పంచాయతీలు, ఇతర ప్రభుత్వ సం స్థల ద్వారా విద్యుత్‌ కనెక్షన్ల జారీకి దరఖాస్తుల స్వీకరణ, విద్యుత్‌ బిల్లుల పంపిణీ, బిల్లుల వసూళ్లు జరపాలి. 
- వినియోగదారులకు సంబంధించిన ఆధార్‌ నంబర్‌/మొబైల్‌ నంబర్‌/బ్యాంక్‌ ఖాతా నంబర్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఓటర్‌ ఐడీ తదితర వివరాలను దరఖాస్తుతోపాటు సేకరించాలి. 
- విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతా ల్లోని గృహాలకు సౌర విద్యుత్‌ ఫలకాలు బిగించడం ద్వారా విద్యుత్‌ అందించాలి. ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ నిల్వ కోసం 200–300 వాట్స్‌ బ్యాటరీతోపాటు ఇంటికి 5 ఎల్‌ఈడీ దీపాలు, ఒక ఫ్యాన్, ఒక పవర్‌ ప్లగ్‌ను ఉచితంగా ఇవ్వాలి. ఇళ్లకు ఏర్పాటు చేసే సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లపాటు మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement