ఆ సమావేశాల్లో తేలిందేమిటి? | Sakshi Guest Column On World Countries Meeting | Sakshi
Sakshi News home page

ఆ సమావేశాల్లో తేలిందేమిటి?

Nov 6 2025 3:41 AM | Updated on Nov 6 2025 4:36 AM

Sakshi Guest Column On World Countries Meeting

విశ్లేషణ

అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 1 వరకు ఏడు రోజులలో ఆసియాలో కీలకమైన ఆర్థిక సమావేశాలు వరుసగా జరిగాయి. జరిగింది ఆసియాలోని మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలలో అయినా, అమెరికా, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి. ఆ సమావేశాలలో జరిగిన చర్చలు, జరిగిన ఒప్పందాలు మొత్తం ప్రపంచ వాణిజ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. 

ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల విషయమై భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనా ధోరణులు ఏ విధంగా ఉండనున్నాయో ఆ సమావేశాలలో స్పష్టమైంది.  కానీ, అగ్రస్థాయి ఆసియా దేశం అయి ఉండి, ఆర్థిక పరిమాణంలో నాల్గవ స్థానానికి చేరిన ఇండియా ప్రధాని మోదీ మాత్రం ఆ సమావేశాలలో పాల్గొనక అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ప్రభుత్వం అధికారికమైన వివరణ కూడా ఏమీ ఇవ్వక ఊహాగానాలకు వదలివేసి మరింత ఆశ్చర్యపరిచింది.

ట్రంప్‌ వర్సెస్‌ ఇతర దేశాలు
మొదట మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ‘ఆసియాన్‌’, ఆర్‌సీఈపీ (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్ట్‌నర్‌షిప్‌), తర్వాత దక్షిణ కొరియా నగరం బూసాన్‌లో ఏపీఈసీ (ఆసియా– ఫసిఫిక్, ఎకనమిక్‌ కో–ఆపరేషన్‌) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అమెరికా, చైనా అధ్యక్షులు విడిగా సమావేశమయ్యారు. వీటి మధ్య అమెరికా అధ్యక్షుడు జపాన్‌ వెళ్లి అక్కడి ప్రధానితో చర్చలు జరిపారు. ‘ఆసియాన్‌’లో 11 దేశాలకు, ఆర్‌సీఈపీలో 15 దేశాలకు, ఏపీఈసీలో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. మొత్తం అన్ని ఖండాలకు చెందిన ఈ దేశాలను కలిపి చూస్తే, ప్రపంచ జనాభాలో, ఆర్థిక శక్తిలో, వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం వాటిదే. 

చర్చలు, తీర్మానాలు, ఒప్పందాల చివరన రెండు ధోరణులు స్పష్టంగా తేలాయి. ఒకటి – అమెరికా తన ‘అమెరికా ఫస్ట్‌’ నినాదా నికి అనుగుణంగా ఆ యా దేశాలతో విడివిడిగా చర్చించి ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం. చైనా మినహా మరెవరిపై సుంకాలు తగ్గించకపోవటం. ఆ యా సంస్థల సామూహిక చర్చలలో అధ్యక్షుడు ట్రంప్‌ అసలు పాల్గొనక పోవటం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల పట్ల విముఖత చూపటం. 

ఇందుకు భిన్నంగా, అమెరికాకు సన్నిహితంగా భావించే వాటితో సహా తక్కిన అన్ని దేశాలు, ఎటువంటి మినహాయింపు లేకుండా, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టు బడులు వర్తమాన ప్రపంచానికి తప్పనిసరి అవసరమని తీర్మానించాయి. వారిలో కొందరు ఒత్తిడి కారణంగానైతేనేమి, సైద్ధాంతిక మైత్రి వల్లనైతేనేమి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసు కున్నారు. ప్రధానంగా అరుదైన లోహాలు, ఖనిజాలు, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, రక్షణ, రవాణా పరికరాలకు సంబంధించి! అదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుకూలిస్తూ, ఒత్తిడులను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. 

పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ – ప్రొటెక్షనిజాన్నీ, ప్రపంచం తిరిగి ఆటవిక రాజ్య స్థితికి వెళ్లటాన్నీ విమర్శించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటైన కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ అయితే తాము వాణిజ్య పరంగా అమెరికాపై ఆధారపడే సాంప్రదాయిక స్థితి నుంచి దూరంగా జరగదలచుకున్నామనీ, రాగల కాలంలో అమెరికా బయటి దేశాలతో వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమనీ ప్రకటించారు. ఆ వెంటనే చైనా అధ్యక్షునితో సమావేశమై, ‘మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి’ చైనాతో కలిసి పనిచేయగలమన్నారు. త్వరలో చైనా సందర్శనకు అంగీకరించారు.

ప్రాంతీయ సంబంధాల సరళతరం
వాస్తవానికి ఒకవైపు అమెరికా, మరొకవైపు తక్కిన ప్రపంచపు ఈ విధమైన ధోరణులు కొంత కాలంగా కనిపిస్తున్నవే. అది ట్రంప్‌కు తెలియనిది కాదు. ఆయన తన విధానాలను ఈ ఆసియా సమావేశాల సందర్భంగా మార్చుకోగలరని కూడా ఎవరూ ఆశించి ఉండరు. అయితే రెండు ధోరణులు కూడా ఈ వారం రోజుల సమా వేశాల కాలంలో మరింత స్థిర రూపం తీసుకోవటమన్నది గమనించదగ్గది. అంతా మన మంచికే అన్న సామెత వలె, ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణకు మార్గాన్ని మరింత సుగమం చేయగలవు.

ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. అవి – సాధారణంగా అమెరికా పలుకుబడి కింద పని చేస్తాయనే పేరున్న ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్‌) ఈ సమావేశాలకు ముందు చెప్పిన మాటలు. నిబంధనలకు విరుద్ధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల దృష్ట్యా వివిధ దేశాలు తమ ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను సరళతరం చేసుకోవాలని ఐరాస వాణిజ్య విభాగం అధికారులు సూచించారు. 

తర్వాత ఆసియా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్‌ ఒక నివేదికను విడుదల చేస్తూ– ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వాణిజ్యంపై ఆధార పడి ఉందనీ, అందువల్ల అక్కడి దేశాలు సుంకాలు కాని ఇతర వాణిజ్య ఆంక్షలను తగ్గించుకోవటం, ప్రాంతీయ వాణిజ్యాన్ని సమీ కృత పరచుకోవటం, ఆ విధంగా అమెరికా సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోవటం, ప్రపంచ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవటం చేయాలనీ చెప్పింది. 

ఇండియా ఏం చేస్తున్నట్టు?
ఇంత ముఖ్యమైన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపిన భారత ప్రభుత్వం దీనంతటి నుంచి గ్రహించవలసింది చాలానే ఉంది. ఉదాహరణకు మనం ‘లుక్‌ ఈస్ట్‌’, ‘యాక్ట్‌ ఈస్ట్‌’ అని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాము గానీ, ఆర్‌సీఈపీలో సభ్యత్వమైనా లేదు. ఆసియాన్‌లో సభ్యత్వం లేకున్నా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదా ఉంది. ‘ఆసియాన్‌’ కూటమితో వాణిజ్య, ఆర్థిక సంబంధాల గణనీయమైన అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పని మందకొడిగానే సాగుతున్నది. 

చైనా 771 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, మన వాణిజ్యం విలువ 131 బిలియన్లు మాత్రమే. భౌతికంగా, డిజిటల్‌ పరంగా సంబంధాలు చాలా పరిమితం. పోతే... ఐరాస, ఐఎంఎఫ్‌ సూచనలను అన్వయించుకుని చూస్తే – ఇండియా ఉన్న దక్షిణాసియాలో, ‘సార్క్‌’లో ఆర్థిక సమన్వయం, వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్‌తో సమస్య వల్ల అథమ స్థాయిలో ఉన్నాయి. ‘బిమ్‌స్టెక్‌’ అనే మరొక సంస్థను పాకిస్తాన్‌ను మినహాయిస్తూ ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement