ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్‌కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్‌మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.
ప్రియమైన వారసుడు
మహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.
పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్‌ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.
మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్‌మోహన్‌రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.
బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.
అవిశ్రాంత యోధుడు
జగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్‌మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.
అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.
అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది.
అయినా జగన్‌మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.
సహృదయ నాయకుడు
జనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.
పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.
అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.
ఒకే ఒక్కడు
2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.
తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.
ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చి
దిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు.
పిల్లలను స్కూల్‌కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్‌టాప్‌లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.
ధీరోదాత్తుడు
దేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.
గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు.
వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్


