భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో బీవైడీ కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీలో 15 మిలియన్ల (1.5 కోట్లు) కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్పత్తి మాత్రమే కాకుండా.. బీవైడీ అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు కంపెనీ 4.182 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 11.3 శాతం ఎక్కువ. చైనాలో మాత్రమే కాకుండా.. సంస్థ ఇతర దేశాల్లో కూడా లక్షల కార్లను విక్రయించినట్లు వెల్లడించింది. మొత్తం మీద బీవైడీ ఆరు ఖండాల్లో.. 119 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.
BYD అభివృద్ధికి టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రధాన కారణం. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో.. కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయం 43.75 బిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు ఏడాది కంటే 31% ఎక్కువ. "ఎలిగాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ" వంటి వాటితో.. డెంజా మోడల్ ద్వారా సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా బహుళ ఆసియా మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా ప్రవేశించింది.
భారతదేశంలో బీవైడీ కార్లు
ఆట్టో 3 ఎలక్ట్రిక్ కారుతో.. భారతదేశంలో అడుగు పెట్టిన బీవైడీ కంపెనీ.. ఆ తరువాత సీల్, ఈమ్యాక్స్ 7, సీలియన్ 7 వంటి కార్లను లాంచ్ చేసింది. ఈ కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ప్రత్యర్ధ కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.


