సాధ్యం కాదన్న అధికారులు
కొత్త అప్పుల కోసం కొత్త డిస్కమ్ ఆలోచన
రుణ సంస్థలు కుదరదనడంతో వెనక్కి..!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నిర్దిష్ట అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పంపిణీ సంస్థలు ఇంధన శాఖకు తెలిపాయి. దీంతో ఇంధన శాఖ ప్రభుత్వానికి ఈ మేరకు నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌కు అదనంగా కొత్త డిస్కమ్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది.
సంక్షేమ పథకాలైన వ్యవసాయ ఉచిత విద్యుత్, గృహజ్యోతి కనెక్షన్లను దీని పరిధిలోకి తేవాలని భావించింది. వాస్తవానికి డిస్కమ్ అనేది కొన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. సంక్షేమ పథకాల కింద ఇచ్చే ఉచితాలు, తదితరాలు అన్ని డిస్కమ్‌ల పరిధిలోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వీటి కోసం ప్రత్యేకంగా డిస్కమ్ ఎలా అనే అంశంపై అధికారులు గందరగోళానికి గురయ్యారు. పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాత దీనిపై స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చారు.
పాత డిస్కమ్‌ల రుణాలకు నిబంధనల అడ్డంకి
డిస్కమ్ ఏర్పాటు ద్వారా రుణాలు పొందే ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు డిస్కమ్‌లు అన్ని విధాల పూర్తిస్థాయిలో ఆర్థిక రుణాలు పొందాయి. ఇవే డిస్కమ్‌లు అవసరాల రీత్యా తిరిగి రుణాలు పొందడానికి కొన్ని నిబంధనలు (ఎఫ్‌ఆర్‌బీఎం) అడ్డంకిగా మారుతున్నాయి. రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో 96,596 ఎంయూలు విద్యుత్ వినియోగం ఉంది. ఇది 2030 నాటికి 1.22 లక్షల ఎంయూలకు చేరే వీలుందని అంచనా వేస్తున్నారు.
2033–24 నాటికి 1.30 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అయ్యే అవకాశం ఉంది. ఈ డిమాండ్‌ను చేరుకోవడానికి విద్యుత్ సంస్థల సామర్థ్యం గణనీయంగా పెరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 440 కేవీ సబ్ స్టేషన్లు 9, 220 కేవీ సబ్‌స్టేషన్లు 34, 132 కేవీ సబ్ స్టేషన్లు 75 ఏర్పాటు చేయాలని డిస్కమ్‌లు భావించాయి.
ఇందుకోసం ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు కలిపి రూ.32 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే కొత్త డిస్కమ్ ఏర్పాటే మార్గమనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. పీఎఫ్‌సీ, ఇతర ఆర్థిక సంస్థలు కొత్త డిస్కమ్‌లకు రుణాలు ఇచ్చే వీలుందని కన్సల్టెన్సీ సంస్థలు సలహాలిచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే ప్రత్యేక అవసరాల కోసం రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని రుణ సంస్థలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు సమాచారం.


