
స్వయం పాలన వారి ప్రాథమిక హక్కు: పాక్ ప్రధాని
చర్చలకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ భారత ప్రభుత్వమే కారణ మని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ విమర్శించారు. నిష్పక్షపాతంగా ప్రజాభి ప్రాయ సేకరణ జరగాలని జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నా రని, వారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. స్వయం పాలన వారి ప్రాథమిక హక్కు అని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.
ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది తమపై యుద్ధంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
నాలుగు రోజులపాటు ఘర్షణ జరిగిందని, పాక్ వైమానిక దళం దాడుల్లో భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అన్ని కీలక అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అన్ని రకాల వివాదాలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. భారత్‌తో సంప్రదింపులకు నిజాయితీతో కృషి చేస్తున్నామని చెప్పారు.
నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదిస్తున్నాం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాసియాలో భారీ యుద్ధం ఆగిందంటే అదంతా ట్రంప్ చలవేనని తేల్చిచెప్పారు. భారత్, పాక్‌ల మధ్య శాంతికోసం ట్రంప్ ఎంతగానో చొరవ తీసుకున్నారని వెల్లడించారు. ఆయన వల్లే యుద్ధం ఆగిపోయిందన్నారు. ట్రంప్ సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్ పేరును నామినేట్ చేస్తోందని తెలియజేశారు.