దట్టమైన పొగమంచు ముప్పు
ఢిల్లీలో 105కు పైగా విమానాల రద్దు
450 విమానాలు ఆలస్యం
జమ్మూ కశ్మీర్‌లో హిమపాతం
రాంచీ/న్యూఢిల్లీ/రాజౌరీ/జమ్మూ: ఉత్తర భారత దేశంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి పోయింది. అటు జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో హిమపాతం కారణంగా కీలక రహదారులు మూతపడగా, ఇటు జార్ఖండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో వాతావరణ శాఖ ’ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. మరోవైపు, దట్టమైన పొగమంచు ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో విమాన సర్వీసులు స్తంభించి, ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జార్ఖండ్‌లో ‘ఆరెంజ్, ఎల్లో అలర్ట్’
జార్ఖండ్ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోవడంతో.. భారత వాతావరణ శాఖ ఆదివారం ’ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గర్వా, పలాము, లాతేహార్, చత్రా, హజారీబాగ్ జిల్లాల్లో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ’ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. గర్వా, పలాము, చత్రా, లాతేహార్, లోహర్దగా జిల్లాలకు చలి తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
విమానాలకు తీవ్ర ఆటంకం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆదివారం మంచు కారణంగా దృశ్యమానత లోపించడంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 105కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఫైట్‌రాడార్24 వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. సుమారు 450 విమానాలు ఆలస్యంగా నడిచాయి. సగటున ప్రతి విమానం 36 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. కాగా, విమానాశ్రయ కార్యకలాపాలు సాఫీగానే సాగుతున్నాయని ’డైల్’ సంస్థ ఎక్స్ వేదికగా ఆదివారం సాయంత్రం ప్రకటించింది. సాధారణంగా ఈ విమానాశ్రయం రోజుకు దాదాపు 1,300 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది. కొన్ని రోజులుగా ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటం తెలిసిందే.
కశ్మీర్‌ను కలిపే మార్గాల్లో నిలిచిన రాకపోకలు
జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో మోస్తరు హిమపాతం కారణంగా కశ్మీర్ లోయను కలిపే ప్రత్యామ్నాయ మార్గాలైన ’మొఘల్ రోడ్డు’, ’సింథాన్ టాప్’ రహదా రులపై ఆదివారం ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఏకైక కీలక మార్గమైన 270 కిలోమీటర్ల జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. సుమారు ఒకటిన్నర నెలల సుదీర్ఘ పొడి వాతావరణం తర్వాత కురిసిన జల్లుల మధ్య ఇక్కడ ట్రాఫిక్ సాఫీగానే సాగుతోంది.
ముగ్గురు వ్యాపారుల్ని రక్షించిన పోలీసులు
పీర్ కీ గలీ ప్రాంతంలో చిక్కుకుపోయిన ముగ్గురు టీ వ్యాపారులను పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ చేపట్టి రక్షించారు. తమను రక్షించాలంటూ వారు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ద్వారా విజ్ఞప్తి చేయడంతో అధికారులు వెంటనే స్పందించారు. ‘ప్రతికూల వాతావరణం, తక్కువ దృశ్యమానత ఉన్నప్పటికీ, పోలీస్ బృందం వేగంగా స్పందించి సమన్వయంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు’.. అని పోలీస్ ప్రతినిధి తెలిపారు.


