కశ్మీర్‌లో జైషే టాప్‌ కమాండర్‌ హతం | Jaish Terrorist Usman Eliminated In Billawar Encounter In Joint Operationn Army and CRPF | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో జైషే టాప్‌ కమాండర్‌ హతం

Jan 24 2026 6:29 AM | Updated on Jan 24 2026 6:29 AM

Jaish Terrorist Usman Eliminated In Billawar Encounter In Joint Operationn Army and CRPF

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కథువా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహమ్మద్‌కు చెందిన కరుడుగట్టిన విదేశీ ఉగ్రవాదిని హతమార్చాయి. బిల్లావర్‌లోని పర్హెటర్‌ ప్రాంతంలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ల సంయుక్త ఆపరేషన్‌లో జేషే కమాండర్‌ ఉస్మాన్‌ అలియాస్‌ అబూ మవియాను మట్టుబెట్టినట్లు జమ్మూ ఐజీ భీమ్‌ సేన్‌ టుటి తెలిపారు. మారుమూల గ్రామంలోని ఓ ఇంటిపై బలగాలు దాడి చేయగా లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. 

ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఉస్మాన్‌ హతమయ్యాయని చెప్పారు. ఘటనలో అత్యాధునిక ఎం4 ఆటోమేటిక్‌ రైఫిల్‌తోపాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా పట్టుబడ్డాయన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా ఓ విదేశీ ఉగ్రవాదిని చంపేసినట్లు ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది. ఆ ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతోందని కూడా వెల్లడించింది. ఈ నెల 7, 13వ తేదీల్లో కహోగ్, నజోట్‌ అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉస్మాన్‌ తప్పించుకున్నాడని పేర్కొంది. 

పాకిస్తాన్‌కు చెందిన ఇతడు రెండేళ్ల క్రితం దొంగచాటుగా సరిహద్దులు దాటి కశ్మీర్‌లోకి ప్రవేశించాడు. ఉథంపూర్‌– కథువా ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న జేషే మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా మారాడు. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో బలగాలు ఆదివారం ఆపరేషన్‌ త్రాషి–ఇ పేరుతో కూంబింగ్‌ చేపట్టాయి. ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పారాట్రూపర్‌ నేలకొరగ్గా, ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. నాలుగు రోజులపాటు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. గురువారం ఎదురుకాల్పుల సమయంలో ఉస్మాన్‌ మరికొందరు దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా మల్చుకుని పరారయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement