ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతోనే రూ.1,000 కోట్ల భారం
ప్రతి కుటుంబానికీ నెలకు రూ.150 అదనపు మోత
టెలీస్కోపిక్ విధానంలో మార్పులు
ఏడాది సగటును లెక్కించి చార్జీల వసూలు
నేడు కేబినెట్ ముందుకు ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలు!
మొత్తం రూ.7 వేల కోట్ల లోటు భర్తీపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు షాక్ ఇవ్వబోతున్నాయి. అయితే ఈసారి పేద వర్గాలనూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో మొత్తంగా రూ.7 వేల కోట్లు రాబట్టేందుకు సమాయత్తమయ్యాయి. ఒక్క ఫిక్స్‌డ్ చార్జీల పెంపుతోనే రూ.1,000 కోట్ల మేర వసూలు చేయబోతున్నాయి. టెలీస్కోపిక్ విధానం మార్పుతో చార్జీల పెంపు ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలపై మరింత భారం పడే వీలుంది.
దొడ్డిదారి వడ్డనలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకను డిస్కమ్‌లు ఆదర్శంగా తీసుకున్నాయి. విద్యుత్ సంస్థల వార్షిక ఆదాయం, అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్) డిస్కమ్‌లు ఈ నెలాఖరులోగా విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొత్త టారిఫ్‌లపై డిస్కమ్‌లు కసరత్తు పూర్తి చేశాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలను మంగళవారం జరిగే కేబినేట్ సమావేశం ముందుంచే వీలుంది.
‘లోడ్ చార్జీ’పెంపు
రాష్ట్రంలో కోటికిపైగా గృహ విద్యుత్ వినియోగదారులున్నారు. విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ చార్జీ లు ప్రతీ నెలా వసూలు చేస్తారు. ప్రస్తుతం ఇది కిలోవాట్‌కు రూ.10గా ఉంది. కర్ణాటకలో ఫిక్స్‌డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ.190 వసూలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కిలోవాట్‌కు రూ.50కి పెంచాలని డిస్కమ్‌లు భావిస్తున్నాయి. విద్యుత్ కనెక్షన్ లోడ్‌ను బట్టి కిలోవాట్లను లెక్కగడతారు. సగటున ప్రతీ వినియోగదారుడికి మూడు కిలోవాట్ల లోడ్ ఉంటుంది.
ఈ లెక్కన కిలోవాట్‌కు రూ. 50 పెంచితే, ఒక్కొక్కరిపై నెలకు రూ.150 భారం పడుతుంది. అంటే ఏడాదికి ఒక్కరిపై రూ.1,800 చొప్పున పడుతుంది. ఇందులో ఉచిత విద్యుత్, కొన్ని వర్గాలకు ఇచ్చే రాయితీలు తీసివేసినా కనీసం రూ.1,000 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు విద్యుత్ డిమాండ్ లేని సమయంలో వాడే కరెంట్‌కు తక్కువ చార్జీ వేస్తారు. ఈ విధానం ఎత్తివేయడం వల్ల మరో రూ.600 కోట్లు మిగులుతాయని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి.
70 లక్షల మందిపై భారం!
విద్యుత్ టారిఫ్ విధానంలోనూ మార్పులను డిస్కమ్‌లు ప్రతిపాదిస్తున్నాయి. ప్రస్తుతం నెలకు 50 యూనిట్ల లోపు వాడకం ఉంటే యూనిట్‌కు రూ.1.95 వసూలు చేస్తున్నారు. 51–100 యూనిట్ల వాడకం అయితే యూనిట్‌కు రూ. 3.10 టారిఫ్ ఉంది. బి కేటగిరీలో 0–100 యూనిట్ల వాడకానికి రూ.3.40, 101–200 యూనిట్లకు రూ.4.80 వసూలు చేస్తున్నారు. అయితే అయితే విద్యుత్ వినియోగాన్ని ఏ నెలకు ఆ నెల లెక్కిండం కాకుండా ఏడాది సగటును కొలమానంగా తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు.
అంటే సగటున 50కి మించి 51 యూనిట్ల వాడకం నమోదైనా టారిఫ్‌ను యూనిట్‌కు రూ.1.95 నుంచి రూ.3.10 వరకు వసూలు చేస్తారు. దీనివల్ల బిల్లు భారీగా పెరిగే వీలుంది. ఇక ‘బి’కేటగిరీ వినియోగదారుల సగటు వినియోగం కూడా నెలకు 101 వస్తే రూ.3.40 నుంచి రూ. 4.80 శ్లాబ్‌లోకి తీసుకెళ్ళాలని ప్రతిపాదిస్తున్నాయి. దీనివల్ల సుమారు 70 లక్షల మంది పేద, మధ్య తరగతి వర్గాలపై భారం పడే వీలుంది.
లోటు రూ.22 వేల కోట్లపైనే..
ఆదాయానికి వ్యయానికి మధ్య రెండు డిస్కమ్‌ల పరిధిలో ప్రస్తుతం రూ.22 వేల కోట్ల మేర లోటు ఉన్నట్టు డిస్కమ్‌ల అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి సింగరేణి బొగ్గు ధర తగ్గినప్పటికీ, పీక్ అవర్స్‌లో విద్యుత్ కొనుగోలుకు ఎక్కువ వెచ్చించడంతో నష్టం పెరిగింది. ప్రభుత్వం గత ఏడాది రూ.13 వేల కోట్ల వరకూ సబ్సిడీ ఇచి్చంది. దీనిని ఈ ఏడాది మరో రూ.2 వేల కోట్ల మేర పెంచాలని డిస్కమ్‌లు కోరుతున్నాయి. ఇంకా ఉండే రూ.7 వేల కోట్ల లోటును ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో చార్జీల ద్వారా రాబట్టుకోవాలని భావిస్తున్నాయి.


