రూ.3,897.42 కోట్లతో విద్యుత్‌ వ్యవస్థ పటిష్టం 

Power system is strong with above Rs 3,897 crores - Sakshi

31,301 సర్క్యూట్‌ కిలోమీటర్ల లైన్లు బలోపేతం 

అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లకు కొత్త పరికరాలు  

తగ్గనున్న కరెంటు సాంకేతిక, సరఫరా నష్టాలు 

వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ ట్రాన్స్‌కో) ఆధ్వర్యంలో విద్యుత్‌ వ్యవస్థను పటిష్టపరిచే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందుకోసం మొత్తం రూ.3,897.42 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునికీకరణ, కొత్త విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చడం వంటి పనులతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులన్నీ పూర్తయితే సాంకేతిక, సరఫరా నష్టాలు తగ్గి విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా బలపడటంతోపాటు వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని అధికారులు చెబుతున్నారు.

ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 31,301 సర్క్యూట్‌ కిలోమీటర్ల (సీకేఎంల) మేర విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఉన్నాయి. వీటిలో 5,532.161 సర్క్యూట్‌ కిలోమీటర్ల (సీకేఎంల) 400 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, 12,200.9 సీకేఎంల 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, 13,568.18 సీకేఎంల పొడవున 132 కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఉన్నాయి. ఇవి 354 మార్గాల ద్వారా రాష్ట్ర, అంతర్‌రాష్ట్ర పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయి. ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 351 సబ్‌స్టేషన్లు ఉన్నాయి.

వీటిలో 400 కేవీ సామర్థ్యంగలవి 16, 220 కేవీ సామర్థ్యం ఉన్నవి 103, 132 కేవీ సామర్థ్యంగలవి 232 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ఈ 351 సబ్‌స్టేషన్ల ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణప్రాంత విద్యుత్‌ సంస్థలకు (డిస్కంలకు) ఏడాదికి సగటున 70 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ పంపిణీ జరుగుతోంది. ఆ విద్యుత్‌ను డిస్కంలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. వీటన్నిటినీ అధికారులు తనిఖీ చేయించనున్నారు. ఎక్కడైనా ఆయిల్‌ లీకేజీలు ఉన్నా, కాయిల్స్‌ మార్చాల్సి వచ్చినా, వైండింగ్‌ చేయాల్సినా, స్విచ్‌లు, ఇతర సామగ్రి పాడైనా గుర్తించి వాటిస్థానంలో కొత్తవి అమర్చాలని భావిస్తున్నారు.  

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌  
‘విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల అనేక నష్టాలను తగ్గించవచ్చు. ట్రాన్స్‌మిషన్‌ నష్టాలను పరిశీలిస్తే.. 2018–19లో 3.10 శాతం ఉండగా, 2022–23లో మే నెల నాటికి 2.83 శాతానికి తగ్గాయి. 2014–15లో ఇవి 3.37 శాతం ఉండేవి. అలాగే విద్యుత్‌ సరఫరా నష్టాలు 2020–21లో 7.5 శాతం ఉండగా, 2021–22లో 5 శాతానికి తగ్గాయి. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్‌ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా 2021–22లో 11 శాతమే ఉన్నాయి. ఇలా సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు, మరింత నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వ సహకారంతో పనులు జరుగుతున్నాయి.’  
– బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top