శ్రీసత్యసాయిబాబా సమాధి వద్ద అంజలి ఘటించి, నివాళి అర్పిస్తున్న ప్రధాని మోదీ
శ్రీసత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు
భగవాన్ ప్రేమతత్వం, సేవాస్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి
బాబా బోధనలు పుస్తకాలు, ఆశ్రమ గోడలకే పరిమితం కాలేదు
విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో ఆయన కార్యక్రమాలు కోట్ల మంది గుండెల్లో నిలిచాయి
గుజరాత్ భూకంప సమయంలో సత్యసాయి సేవాదళ్ సేవలు నిరుపమానం
బిల్లింగ్ కౌంటరే లేని ఆసుపత్రుల ద్వారా సేవలు సత్యసాయి ట్రస్టుకే సాధ్యం
పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సెంట్రల్ ట్రస్టు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని
సత్యసాయి జ్ఞాపికగా రూ. వంద నాణెం, పోస్టల్ స్టాంపు విడుదల
హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, సచిన్, ఐశ్వర్యారాయ్
సాక్షి, పుట్టపర్తి: ‘భగవాన్ శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఈ తరానికి ఒక వేడుక మాత్రమే కాదు.. దైవ ఆశీర్వాదం. భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ, బోధనలు, సేవాస్ఫూర్తి నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి. సత్యసాయి చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి..’అని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం పుట్టపర్తి చేరుకున్న ప్రధాని మోదీ తొలుత భగవాన్ మహా సమాధి వద్ద నివాళులర్పించారు.
అనంతరం స్థానిక హిల్ వ్యూ స్టేడియంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మీకతను మానవ సేవకు పునాదిగా చేసిన మహానుభావుడు సత్యసాయి బాబా అని కొనియాడారు. ‘సాయిరామ్..’అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. పవిత్ర భూమి పుట్టపర్తిలో గడపడం తనకు ఆధ్యాత్మీక, భావోద్వేగ అనుభూతిని కలిగిస్తున్నాయన్నారు. బాబా శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
సేవ, ఆధ్యాత్మీకత వేర్వేరు కాదని..
‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్..’అని చెప్పిన శ్రీసత్యసాయి మాటలు ప్రేమను సేవగా మార్చే ఆధ్యాత్మీక సందేశమని ప్రధాని మోదీ అభివర్ణించారు. బాబా బోధనలు పుస్తకాలు, ఆశ్రమ గోడలకే పరిమితం కాలేదన్నారు. పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య, ఆరోగ్య, సేవా రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు కోట్ల మంది గుండెల్లో ఉన్నాయన్నారు.
రాయలసీమకు తాగునీరు అందించేందుకు 3,000 కి.మీ మేర పైప్‌లైన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ భూకంప సమయంలో సత్యసాయి సేవాదళ్ సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఒడిశాలో వరద బాధితులకు వెయ్యి ఇళ్ల నిర్మాణం సాయి సంస్థల సేవకు నిదర్శనమన్నారు. బిల్లింగ్ కౌంటర్ లేని ఆసుపత్రుల ద్వారా సేవలందించడం సత్యసాయి ట్రస్టుకే సాధ్యమని ప్రశంసించారు.
20 వేల మందికి సుకన్య యోజన ఖాతాలు
శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదేళ్ల లోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. దాదాపు 20 వేల మంది బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో వంద గోవులను పేద రైతులకు దానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ప్రధాని చెప్పారు.
కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జి.కిషన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సినీనటి ఐశ్వర్య బచ్చన్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష దైవ స్వరూపం సాయి: సీఎం చంద్రబాబు
భగవాన్ శ్రీసత్యసాయి బాబా భూమిపై మనం చూసిన దైవ స్వరూపమని, ప్రజలకు ప్రేమ, సేవ, శాంతి, సౌభాగ్య మార్గాలను చూపించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్..’అని చెప్పిన సాయి మాటలు ప్రపంచానికి దిక్సూచిలా మారాయన్నారు. బాబా శతజయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ప్రకటించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు.
నాస్తికులను కూడా ఆధ్యాత్మీక మార్గం వైపు నడిపించిన సత్యసాయి సమ్మోహన శక్తి అరుదైనదన్నారు. వందలాది దేశాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఆయన దివ్య అనుగ్రహం లభించిందన్నారు. సత్యసాయి సంస్థల ద్వారా అందుతున్న సేవలు ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు.
జన్మభూమి మాత్రమే కాదు.. కర్మభూమి కూడా – ఆర్‌జే రత్నాకర్
పుట్టపర్తి.. భగవాన్ సత్యసాయి జన్మభూమి మాత్రమే కాదు, ఆయన కర్మభూమి కూడా అని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ, మానవతా విలువలను ఇక్కడి నుంచే ప్రసారం చేశారన్నారు. సత్యసాయి విద్యాసంస్థల్లో చదివిన వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవ చేస్తుండటం గర్వంగా ఉందన్నారు. భగవాన్ బోధించిన ప్రేమ, సేవ, ధర్మం మార్గాన్ని భవిష్యత్ తరాలకు మరింతగా విస్తరించడం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రధాన ధ్యేయమన్నారు.
బాబా తోడుంటే భయం ఉండదు: సచిన్ టెండూల్కర్
సత్యసాయి బాబా తనకు చిన్నతనం నుంచే దైవ సంబంధం లాంటి అనుభూతిని ఇచ్చారని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు బాల సత్యసాయిలా ఉన్నావని అందరూ చెప్పేవారన్నారు. తర్వాత బాబాతో ఏర్పడిన అనుబంధం ఆ మాటలకు అర్థం చూపిందన్నారు. 1990లో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో భగవాన్ సత్యసాయి దర్శనం పొందిన సందర్భాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు.
మనం అడగకపోయినా మన మనసులో ఏముందో, ఏ సందేహం ఉందో బాబా ముందుగానే చెప్పేవారని తెలిపారు. ఇది నమ్మశక్యం కాకపోయినా.. తాను అనుభవించిన సత్యమన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై బాబా బోధనలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయన్నారు. 2011 వరల్డ్ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి ఉండేవని సచిన్ గుర్తు చేసుకున్నారు.
బెంగళూరులో తమ క్యాంపు జరుగుతున్నప్పుడు బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించానని చెప్పారని, అది తనలో అనూహ్యమైన విశ్వాసాన్ని నింపిందని తెలిపారు. 2011లో ముంబైలో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌లో భారత జట్టు గెలిచి ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో గోల్డెన్ మూవ్‌మెంట్ అన్నారు. బాబా మన వెంట ఉంటే భయం అనే మాట ఉండదని, ఆయనను స్మరించడం ఆశీర్వాదం లాంటిదని సచిన్ చెప్పారు.
ఆయన సేవ బతికే ఉంది: ఐశ్వర్య బచ్చన్
‘భగవాన్ సత్యసాయిబాబా దివ్య స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాల్లో సజీవంగా ఉంది. ఆయన ప్రేమ, సేవ, దయకు సరిహద్దుల్లేవు. మానవసేవే మాధవసేవ అని చేసి చూపించారు. బాబా చేసిన ప్రజాసేవ, ప్రేమ, దయ, పరిపూర్ణత ప్రపంచానికి ఆదర్శం’అని ప్రముఖ సినీనటి ఐశ్వర్య బచ్చన్ పేర్కొన్నారు. భగవాన్ బోధించిన క్రమశిక్షణ, అంకితభావం, భక్తి, దృఢ సంకల్పం, వివేకం అనే ఐదు సూత్రాలు మన జీవితానికి దిక్సూచిలా నిలుస్తాయన్నారు.
విద్య, వైద్య సేవల్లో సత్యసాయి సంస్ధల సేవలు అమూల్యమని తెలిపారు. బాల వికాస్ స్కూళ్లలో నైతిక బోధనలు భవిష్యత్ తరాలకు వెలుగులు చూపుతున్నాయన్నారు. పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం పూర్తి ఉచితంగా అందించడం బాబా కరుణామయ హృదయానికి నిదర్శనమన్నారు. జలసేవ, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారతలో బాబా చేపట్టిన కార్యక్రమాలు చరిత్రాత్మకమని అన్నారు.
22న పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము
సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్–2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం వివరించింది.


