విద్యుత్‌ చార్జీలు పెంచం

Balineni Srinivasareddy Comments On Electricity Charges - Sakshi

ఎన్ని ఇబ్బందులున్నా భారం వేయం

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి, అమరావతి: ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్‌ చార్జీలు మాత్రం పెంచబోమని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌(ఏపీఎస్‌ఈసీఎం) కొత్త లోగోను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్న విషయాలను చంద్రశేఖరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా సంక్షోభంతో విద్యుత్‌ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయినా కూడా ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.

ఇందులో భాగంగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్‌సీకి సమర్పించాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని మంత్రి చెప్పారు. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు.

గృహ విద్యుత్‌ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు. చౌక విద్యుత్‌ లక్ష్య సాధన కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నూతన విధానాలను అధ్యయనం చేయాలని విద్యుత్‌ సంస్థలకు మంత్రి సూచించారు. కాగా.. గ్రామ, మున్సిపల్‌ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్‌ లైన్‌మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సంస్థల పనితీరు మెరుగుపడిందని మంత్రికి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి వివరించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top