18 నెలల్లో రూ.20 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారమా !
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు
ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణలో ప్రభుత్వాన్ని నిలదీసిన జనం
తిరుపతి, విజయవాడ, కర్నూలులో ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ
వినియోగదారుల అభ్యంతరాలకు సమాధానం చెప్పలేకపోయిన సీఎండీలు
విద్యుత్ నియంత్రణ మండలి దుస్థితిపై తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. అవసరమైతే ఉన్న చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల చార్జీల భారాన్ని వేయడం అన్యాయమని, నమ్మినందుకు ఇంతగా మోసం చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్–ఏఆర్‌ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) నాలుగు రోజులపాటు బహిరంగ విచారణ నిర్వహించింది.
ఈ నెల 20న తిరుపతిలో మొదలుపెట్టి.. 22, 23 తేదీల్లో విజయవాడ, 27న కర్నూలులో బహిరంగ విచారణల ద్వారా 71 మంది నుంచి అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏపీఈఆర్‌సీ స్వీకరించింది. నేరుగా 32 మంది, వర్చువల్ (ఆన్‌లైన్) ద్వారా 39 మంది అభ్యంతరాలను వెల్లడించారు. బహిరంగ విచారణలో వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్‌సీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. దాని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వస్తుంది.
చేస్తాం.. చూస్తాం
బహిరంగ విచారణలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై విద్యుత్ సంస్థల సీఎండీలు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్‌చంద్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వచి్చన అభ్యంతరాలకు వివరణ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అందిన ఫిర్యాదులపై సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి స్పందిస్తూ.. కెపాసిటర్లు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్లనే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
ప్రభుత్వ విభాగాల విద్యుత్ బకాయిలను, ప్రైవేటు సంస్థల బకాయిలను, కుప్పం రెస్కో బకాయిలను ఎందుకు వసూలు చేయలేదని వచ్చిన ప్రశ్నలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటి స్పందిస్తూ.. వాటిలో అధిక శాతం కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిపారు. కుప్పం రెస్కోకు టారిఫ్‌ను నిర్ణయించాల్సిందిగా ఏపీ ఈఆర్‌సీని సీఎండీ కోరారు. టైమ్ ఆఫ్ డే బిల్లింగ్‌లో పీక్, ఆఫ్ పీక్ అవర్స్‌కు వేస్తున్న విద్యుత్ చార్జీలు, ఆక్వా రంగంలో విద్యుత్ సమస్యలపై వచి్చన ఫిర్యాదులకు ఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృధ్వీతేజ్ వివరణ ఇచ్చారు.
వివిధ వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్‌ను గతం నుంచీ ఇస్తున్నట్టుగానే ఇకపైనా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధన శాఖ అదనపు కార్యదర్శి కిశోర్‌కుమార్ తెలిపారు. ఈ మొత్తం బహిరంగ విచారణలో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు వంటి మెటీరియల్ కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వచ్చే రెండు నెలల్లోగా ఏపీఈఆర్‌సీ నిబంధనలు (రెగ్యులేషన్) రూపొందిస్తుందని చైర్మన్ పీవీఆర్ రెడ్డి ప్రకటించారు.
తొలి ఏడాదే రూ.15 వేల కోట్ల భారం
వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి ఏపీఈఆర్‌సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి ఇన్‌చార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా భారం వేశారని, తర్వాత వేసిన వాటితో కలిపి ఇప్పటి వరకూ 4 విడతల్లో రూ.20 వేల కోట్లకుపైగా భారం మోపడంతో విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయని, దీనిపై ఏపీఈఆర్‌సీ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరారు.
డిస్కంలు ట్రూ అప్ పేరుతో వాస్తవ లెక్కలు కాకుండా అత్యధికంగా ప్రతిపాదనలు ఇస్తున్నారని, అది సమంజసం కాదని మండిపడ్డారు. జాతీయ రహదారులపై ఉండే వీధి దీపాలకు గ్రామాల పరిధిపి కేటగిరీ–4లో చేర్చాలని జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు కోరారు. వాటర్ ప్లాంట్ వ్యాపారులకు విద్యుత్ బిల్లులు కేటగిరీ–2లోకి మార్చడం వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయని, వీటిని కేటగిరీ–3లోకి మార్చాలని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ, కర్నూలులో విజ్ఞప్తి చేశారు.


