ఆనందాల ఊయల్లో.. | Haldi Ceremony Becomes the New Trend in Weddings; Families Spend Big on North Indian Ritual | Sakshi
Sakshi News home page

ఆనందాల ఊయల్లో..

Mar 15 2026 1:04 PM | Updated on Mar 15 2026 1:04 PM

Haldi Ceremony Becomes the New Trend in Weddings; Families Spend Big on North Indian Ritual

కల్యాణంలో కొత్త ట్రెండ్‌

హల్దీ ఫంక్షన్లకు పెరిగిన క్రే జ్‌

ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చిన ఆచారం

ఖర్చుకు వెనుకాడని కుటుంబాలు 

తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను నేటి తరం ఆనందాల ఊ‘యలో’్ల విహరిస్తూ గుర్తుండిపోయేలా జరుపుకోంటోంది. వివాహ తంతులో మంగళస్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దానికి ఆధునిక హంగులు అద్దుతూ కొత్తగా హల్దీ ఫంక్షన్‌ వచ్చి చేరింది. దీన్నే పసుపు వేడుక అని కూడా పిలుస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకూ ఈ ట్రెండ్‌ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరిగా మారింది.   

కొత్త పుంతలు 
పెళ్లికి ఒక్కరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్‌గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్‌లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు.   

ప్రత్యేక సెట్టింగ్‌లు 
హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్‌లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్‌గా మారింది.

డ్రెస్‌ కోడ్‌ 
హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్‌ కోడ్‌తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్‌ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్‌లో ఫొటో, వీడియో షూట్‌ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్‌ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్‌ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు.  

చెప్పలేని ఆనందం
ఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్‌లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. 
– కె.సాయికుమార్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, కాకినాడ 

ఉత్సాహాన్నిస్తాయి
కొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్‌ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్‌ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
– కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం  

ప్రత్యేక ఆకర్షణ
పెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్‌ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్‌లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. 
– కె.సతీష్, ఎన్‌కేఎస్‌ ఈవెంట్‌ మేనేజర్,రాజమహేంద్రవరం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement